సర్కారు స్కూళ్లకు ప్రమాద ఘంటికలు
Published Mon, Oct 14 2013 4:26 AM | Last Updated on Sat, Sep 15 2018 5:57 PM
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్:జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒకప్పుడు విద్యార్థులతో కిటకిటలాడినవన్నీ ప్రస్తుతం పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నా వాటిలో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఏటా విద్యార్థుల నమోదు తిరోగమనంలో ఉంటోంది.పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఏటా ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ఉన్నత విద్యార్హతలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నా..ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో కొన్ని చోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సమాన సంఖ్యలో ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
34 శాతం పడిపోయిన నమోదు:
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు ఏటా పడిపోతోంది. 2012-13 విద్యా సంవత్సరం, 2013-14 విద్యా సంవత్సరాల్లో పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పరిశీలిస్తే వాస్తవం అవగతమవుతుంది. జిల్లాలో 2011-12 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు 4,78,746 మంది నమోదు కాగా, 2012-13 విద్యా సంవత్సరంలో 4,77,024 మంది చేరారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3,14,479 మంది మాత్రమే చేరారు. అంటే గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1,62,545 మంది పిల్లలు తగ్గారు. జిల్లాలోని 56 మండలాల్లో కేవలం మూడు మండలాల్లో మాత్రమే ఈ ఏడాది విద్యార్థుల నమోదు స్వల్పంగా పెరగగా మిగిలిన 53 మండలాల్లో విద్యార్థుల నమోదు భారీగా పడిపోయింది. ఒంగోలు మండలంలో గత విద్యా సంవత్సరంలో 34,395 మంది విద్యార్థులు చేరగా ఈ సంవత్సరం కేవలం 7,900 మంది మాత్రమే చేరారు.
చీరాల మండలంలో 13,062 మంది, గిద్దలూరులో 9,328 మంది, మార్కాపురంలో 8,206 మంది, ఇతర మండలాల్లో విద్యార్థులు వేలసంఖ్యలోనే తగ్గారు. బల్లికురవ మండలంలో 270 మంది, కొత్తపట్నంలో 236 మంది, కారంచేడులో 21 మంది విద్యార్థులు పెరిగారు. ప్రభుత్వ పాఠశాలలకు బలహీన వర్గాల విద్యార్థులు కూడా దూరమవుతున్నారు. గత విద్యాసంవత్సరంతో పోల్చుకుంటే వెనుకబడిన తరగతుల విద్యార్థులు 31 శాతం, గిరిజన విద్యార్థులు (ఎస్‌టీ) 24 శాతం, షెడ్యూల్డు కులాల విద్యార్థులు (ఎస్సీ) 20 శాతం మంది తగ్గారంటే ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట ఎంతగా దిగజారుతుందో తెలుస్తోంది. బీసీ విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో 1,77,775 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉండగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో వారి సంఖ్య 1,22,652కు పడిపోయింది.
అంటే 55,123 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ఎస్సీ విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో 1,34,225 మంది ఉండగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆ సంఖ్య 1,07,693కు పడిపోయింది. అంటే 26,532 మంది ఎస్సీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. ఎస్టీ విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో 27,911 మంది ఉండగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో 21,143 మంది మాత్రమే ఉన్నారు. అంటే 6768 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఏటా వందల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా ఆశించిన మేర ఫలితాలు సాధించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం గోచరిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం కలిగించి పిల్లల నమోదు పెంచి పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Advertisement
Advertisement