రైల్వే వేడుకలో రగడ
సాక్షి, చెన్నై: దక్షిణ రైల్వే నేతృత్వంలో తాంబరం రైల్వే కాలనీ మైదానం వేదికగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేశారు. తాంబరం నుంచి చెంగల్పట్టు వైపుగా మూడో రైల్వే మార్గం పనులు, కళ్లకురిచ్చి- చిన్న సేలం మధ్య రైల్వే మార్గం విస్తరణ పనులు అందులో ఉన్నాయి. అలాగే, తిరుచ్చి రైల్వే స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన ఎస్కలేటర్ ప్రారంభోత్సవం, చెన్నై సెంట్రల్, తిరువనంత పురం స్టేషన్లలో ప్రయాణికుల కోసం దుప్పట్లు, దిండుల విక్రయాలకు, సెంట్రల్ నుంచి షాలిమార్‌కు వారంతపు రైలుకు జెండా ఊపడం తదితర అంశాలు ఈ వేడుకలో ఉన్నాయి.
ఇందులో ముఖ్య అతిథిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పాల్గొని తాంబరం- చెంగల్పట్టు మూడో ట్రాక్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఇతర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వారంతపు రైలు సేవలకు జెండా ఊపారు. ఇంత వరకు బాగానే ఉన్నా, డీఎంకే రాజ్య సభ సభ్యుడు తిరుచ్చి శివను ప్రసంగానికి ఆహ్వానించడం వివాదానికి దారి తీసినట్టు అయింది.
వాదులాట: తిరుచ్చి శివ తన ప్రసంగంలో రైల్వే అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తిరుచ్చి రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్ ఏర్పాటుకు తన నియోజకవర్గ నిధి నుంచి రూ. 95 లక్షలు ఇచ్చినట్టు ప్రకటించారు. అయితే, రైల్వే అధికారుల ప్రకటనలో ఎక్కడా తాను కేటాయించినట్టుగా పేర్కొనక పోవడం విచారకరంగా వ్యాఖ్యానించా రు. తిరుచ్చిలో జరగాల్సిన వేడుకను తాంబరానకి మార్చారని, ఈ వేడుకను బహిష్కరించాలని తొలుత తాను భావించినట్టు పేర్కొన్నారు.
అయితే, మంత్రి సురేష్ ప్రభు పిలుపుతో ఇక్కడికి వచ్చానని, అధికార వేడుకల్ని సైతం రాజకీయం చేయడం తగదంటూ పరోక్షంగా అన్నాడీఎంకే సర్కారును ఉద్దేశించి స్పందించారు. ఇంతలో వేదిక మీదున్న రాష్ట్ర మంత్రి చిన్నయ్య మైక్ అందుకుని వ్యంగ్యాస్త్రంతో కూడిన ఓ సామెతను గుర్తు చేస్తూ తీవ్రంగానే స్పందించి తన సీట్లో కూర్చున్నారు. మంత్రికి ఇరు వైపులా చిన్నయ్య, శివ కూర్చోవడమే కాదు, ఇద్దరూ వాగ్యుద్ధానికి దిగారు.
ఇద్దరు ఏవో తిట్టుకుంటున్నట్టుగా స్పందించడంతో తన ప్రసంగానికి పిలుపు వచ్చినట్టుగా చటుక్కున అక్కడి నుంచి లేచిన మైక్ అందుకున్నారు. అప్పటికి కూడా వేదికపై తమ సీట్లలో ఉన్నట్టుగా తిరుచ్చి శివ, చిన్నయ్య వాదులాడుకుంటూ ఉండడంతో పక్కనే ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ జోక్యం చేసుకుని ఇద్దరిని బుజ్జగించాల్సి వచ్చింది. అంత వరకు ఈ ఇద్దరి వాదులాట వేదిక ముందున్న వాళ్లనే కాదు కేంద్ర మంత్రిని సైతం విస్మయానికి గురి చేసినట్టు అయింది.
నిధుల పెంపు: రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన ప్రసంగంలో తమిళనాడుకు రైల్వే పథకాల్లో పెద్ద పీట వేస్తున్నామన్నారు. తమ హయంలోనే భాగస్వామ్యం పెరిగిందన్నారు. 1.5 శాతం మేరకు నిధుల్ని పెంచామని, కొత్త పథకాలను, రైళ్లను అందిస్తూ వస్తున్నామని వివరించారు. తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం సమష్టిగా పథకాల్ని అమలు చేస్తున్నాయని, మున్ముందు మరిన్ని పథకాలు తమిళనాడుకు దరి చేరుతాయని వ్యాఖ్యానించారు.