సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నిత్యం వివాదాల మయంగా మారుతోంది. ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూ.. సంస్థ పరువును బంగాళాఖాతంలో కలిపేసేలా వ్యవహారాలు జరుగుతున్నాయి. కీలకమైన పోస్టు ఎంపిక విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నకిలీ సర్టిఫికెట్లతో సంస్థ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన జీవైవీ విక్టర్ అదే సంస్థను కోట్లాది రూపాయల నష్టాల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. నిండా మునిగిన తర్వాత తేరుకున్న ఉన్నతాధికారులు విక్టర్‌ని విధుల నుంచి తప్పించారు. తాజాగా ఓ ఉన్నతాధికారి పోస్టును కూడా అదేమాదిరిగా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన నియామకంపైనా వివాదం ముదురుతోంది.
షిప్పులో డెక్ కేడెట్‌గా చేరి..
సదరు వ్యక్తి 1987లో ఎస్సీ కోటా స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా షిప్పులో డెక్ కేడెట్‌గా డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లో చేరారు. 2009లో డీజీఎంగా పదోన్నతి పొంది.. పట్టుమని పది నెలలైనా పని చెయ్యకుండా డీసీఐకు రాజీనామా చేసేశారు. డీసీఐ ప్రత్యర్థి సంస్థగా చెప్పుకునే మెర్కటర్ సంస్థలో డీజీఎం ఆపరేషన్స్‌గా జాయిన్ అయ్యారు. రెండున్నర సంవత్సరాలు పనిచేసి.. తిరిగి 2012లో డీసీఐకి వచ్చేశారు. ఈ సమయంలో డీసీఐలో తిరిగి చేరినప్పుడు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల్ని సమర్పించారు. ఇక్కడే ఆయన బండారంబట్టబయలయ్యింది.
బీ‘కామ్’గా అబద్ధాలు
2020 ఆగస్టులో ఉన్నతాధికారి పోస్టుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సదరు అధికారి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హిందు రిలీజియన్‌గా దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే.. సదరు అధికారి ఆ సమయంలో విశాఖలోని యూనియన్ చాపల్ బాప్టిస్ట్ చర్చ్‌కి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రిస్టియన్‌గా ఉంటూ ఉద్యోగం కోసం చేసిన దరఖాస్తులో మాత్రం హిందూగా పేర్కొన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా.. 2012లోనే బీకామ్ పాసైనట్టు అప్లికేషన్‌తో పాటు సర్టిఫికెట్ సమర్పించారు.
దీనిపైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీకామ్ సర్టిఫికెట్ కూడా నకిలీదని తేలినట్టు తెలిసింది. డిగ్రీ కూడా చేయని వ్యక్తిని.. కేవలం ఇంటర్ విద్యార్హత ఉన్న వ్యక్తికి ఉన్నతాధికారి హోదాను కట్టబెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు తాను పనిచేసిన మెర్కటర్ సంస్థ డీసీఐకి అనుబంధ సంస్థగా దరఖాస్తులో పేర్కొన్నారు. కానీ.. సదరు సంస్థ డీసీఐకు పూర్తి ప్రత్యర్థి సంస్థ. ఇలా.. విద్యార్హత నుంచి ప్రతి అంశాన్ని తప్పుగా చూపిస్తూ.. కీలక బాధ్యతల్ని దక్కించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డీసీఐకి నష్టం చేకూర్చారంటూ ఫిర్యాదుల వెల్లువ
సదరు ఉన్నతాధికారి డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కి రాజీనామా చేసి మెర్కటర్ సంస్థలో చేరిన తర్వాత డీసీఐకి నష్టం వాటిల్లేలా వ్యవహరించినట్టు కొందరు ఉద్యోగులు ఆధారాలు సేకరించారు. డీసీఐలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పోటీ సంస్థ అయిన మెర్కటర్ సుమారుగా రూ.800 కోట్ల విలువైన పనులను డీసీఐ కంటే 5 శాతం వరకు అధికంగా కోట్ చేసి దక్కించుకుంది. దీనివెనుక సదరు అధికారి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా.. ఓవైపు జీఎంగా పనిచేస్తూనే మరోవైపు లీగల్ సెల్ బాధ్యతల్ని కూడా పర్యవేక్షించిన సదరు అధికారి రూ.50 కోట్ల విలువైన ఆర్బిట్రేషన్‌ను మెర్కటర్‌కు దక్కేలా చేశారనీ.. ఈ విధంగా లబ్ధి చేకూర్చడం వల్లే.. మెర్కటర్ సంస్థ సదరు ఉన్నతాధికారికి డీజీఎం బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది. ఇలా ప్రతి విషయంలోనూ సదరు అధికారికి సంబంధించిన నియామకం వెనుక అక్రమాల జాబితాలను జత చేస్తూ కేంద్ర పోర్టులు మంత్రిత్వ శాఖతో పాటు సీబీఐకి కూడా కొందరు ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment