Dredging Corporation
-
అక్రమాల డ్రెడ్జింగ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నిత్యం వివాదాల మయంగా మారుతోంది. ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూ.. సంస్థ పరువును బంగాళాఖాతంలో కలిపేసేలా వ్యవహారాలు జరుగుతున్నాయి. కీలకమైన పోస్టు ఎంపిక విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో సంస్థ ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన జీవైవీ విక్టర్ అదే సంస్థను కోట్లాది రూపాయల నష్టాల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. నిండా మునిగిన తర్వాత తేరుకున్న ఉన్నతాధికారులు విక్టర్ని విధుల నుంచి తప్పించారు. తాజాగా ఓ ఉన్నతాధికారి పోస్టును కూడా అదేమాదిరిగా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన నియామకంపైనా వివాదం ముదురుతోంది. షిప్పులో డెక్ కేడెట్‌గా చేరి.. సదరు వ్యక్తి 1987లో ఎస్సీ కోటా స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా షిప్పులో డెక్ కేడెట్‌గా డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో చేరారు. 2009లో డీజీఎంగా పదోన్నతి పొంది.. పట్టుమని పది నెలలైనా పని చెయ్యకుండా డీసీఐకు రాజీనామా చేసేశారు. డీసీఐ ప్రత్యర్థి సంస్థగా చెప్పుకునే మెర్కటర్ సంస్థలో డీజీఎం ఆపరేషన్స్‌గా జాయిన్ అయ్యారు. రెండున్నర సంవత్సరాలు పనిచేసి.. తిరిగి 2012లో డీసీఐకి వచ్చేశారు. ఈ సమయంలో డీసీఐలో తిరిగి చేరినప్పుడు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల్ని సమర్పించారు. ఇక్కడే ఆయన బండారంబట్టబయలయ్యింది. బీ‘కామ్’గా అబద్ధాలు 2020 ఆగస్టులో ఉన్నతాధికారి పోస్టుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సదరు అధికారి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హిందు రిలీజియన్‌గా దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే.. సదరు అధికారి ఆ సమయంలో విశాఖలోని యూనియన్ చాపల్ బాప్టిస్ట్ చర్చ్‌కి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రిస్టియన్‌గా ఉంటూ ఉద్యోగం కోసం చేసిన దరఖాస్తులో మాత్రం హిందూగా పేర్కొన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా.. 2012లోనే బీకామ్ పాసైనట్టు అప్లికేషన్‌తో పాటు సర్టిఫికెట్ సమర్పించారు. దీనిపైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీకామ్ సర్టిఫికెట్ కూడా నకిలీదని తేలినట్టు తెలిసింది. డిగ్రీ కూడా చేయని వ్యక్తిని.. కేవలం ఇంటర్ విద్యార్హత ఉన్న వ్యక్తికి ఉన్నతాధికారి హోదాను కట్టబెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు తాను పనిచేసిన మెర్కటర్ సంస్థ డీసీఐకి అనుబంధ సంస్థగా దరఖాస్తులో పేర్కొన్నారు. కానీ.. సదరు సంస్థ డీసీఐకు పూర్తి ప్రత్యర్థి సంస్థ. ఇలా.. విద్యార్హత నుంచి ప్రతి అంశాన్ని తప్పుగా చూపిస్తూ.. కీలక బాధ్యతల్ని దక్కించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీసీఐకి నష్టం చేకూర్చారంటూ ఫిర్యాదుల వెల్లువ సదరు ఉన్నతాధికారి డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కి రాజీనామా చేసి మెర్కటర్ సంస్థలో చేరిన తర్వాత డీసీఐకి నష్టం వాటిల్లేలా వ్యవహరించినట్టు కొందరు ఉద్యోగులు ఆధారాలు సేకరించారు. డీసీఐలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పోటీ సంస్థ అయిన మెర్కటర్ సుమారుగా రూ.800 కోట్ల విలువైన పనులను డీసీఐ కంటే 5 శాతం వరకు అధికంగా కోట్ చేసి దక్కించుకుంది. దీనివెనుక సదరు అధికారి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా.. ఓవైపు జీఎంగా పనిచేస్తూనే మరోవైపు లీగల్ సెల్ బాధ్యతల్ని కూడా పర్యవేక్షించిన సదరు అధికారి రూ.50 కోట్ల విలువైన ఆర్బిట్రేషన్‌ను మెర్కటర్‌కు దక్కేలా చేశారనీ.. ఈ విధంగా లబ్ధి చేకూర్చడం వల్లే.. మెర్కటర్ సంస్థ సదరు ఉన్నతాధికారికి డీజీఎం బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది. ఇలా ప్రతి విషయంలోనూ సదరు అధికారికి సంబంధించిన నియామకం వెనుక అక్రమాల జాబితాలను జత చేస్తూ కేంద్ర పోర్టులు మంత్రిత్వ శాఖతో పాటు సీబీఐకి కూడా కొందరు ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. -
10 ఏళ్ల తర్వాత లాభాల్ని అర్జించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో దాదాపు దశాబ్దం తర్వాత డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ) లాభాలు ఆర్జించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 28.61 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. రూ.3.98 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 151.4 కోట్ల నుంచి రూ. 239.6 కోట్లకు ఎగసింది. స్టాండెలోన్ ఫలితాలివి. 2012లో తొలిసారి రూ.కోటి వరకూ లాభాల్ని సాధించాక.. మళ్లీ 2022లో ఏకంగా రూ.28.61 కోట్లు లాభాల్ని ఆర్జించినట్లు ఎండీ, సీఈవో ఎస్.దివాకర్ వెల్లడించారు. ఇటీవల ఇంధన ధరలు అధికమైనప్పటికీ.. మెరుగైన పనితీరుని ప్రదర్శించినట్లు దివాకర్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో డ్రెడ్జింగ్ కార్ప్ షేరు 0.6 శాతం నీరసించి రూ. 357 వద్ద ముగిసింది. -
డీసీఐ చేతికి భారీ డ్రెడ్జర్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) చేతికి భారీ డ్రెడ్జర్ రానుంది. 12 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ట్రెయిలింగ్ సక్షన్ హాపర్ డ్రెడ్జర్ (టీఎస్‌హెచ్‌డీ) కొనుగోలు చేయాలని డీసీఐ నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుకానున్న ఈ డ్రెడ్జర్‌ను కొచ్చి షిప్‌యార్డులో తయారు చేయనున్నారు. ఈ తరహా భారీ డ్రెడ్జర్ ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేదు. వాస్తవానికి వచ్చే పదేళ్లలో దేశంలో ఏకంగా 310 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుందని అంచనా. ప్రస్తుతం డీసీఐ చేతిలో రూ.900 కోట్ల విలువైన డ్రెడ్జింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా కొత్తగా భారీ డ్రెడ్జర్లు అవసరమైన నేపథ్యంలో ఈ భారీ డ్రెడ్జర్‌ను కొనుగోలు చేయాలని డీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి ‘డీసీఐ డ్రెడ్జ్ బ్రహ్మపుత్ర’ అని నామకరణం చేశారు. డ్రెడ్జర్ కొనుగోలుకు సంబంధించి ఈ నెల 17న ఢిల్లీలో ఒప్పంద కార్యక్రమం నిర్వహించనున్నట్టు డీసీఐ వర్గాలు తెలిపాయి. దీని కొనుగోలుకు సుమారు రూ.వెయ్యి కోట్లు వెచ్చించనున్నట్లు తెలిసింది. డ్రెడ్జర్ పనితీరును పరిశీలించిన తర్వాత మరో రెండు భారీ డ్రెడ్జర్లను కొనుగోలు చేసేందుకు డీసీఐ సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
ప్రధాని మోదీకి లేఖ రాసిన కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మంగళవారం లేఖ రాశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)లో 73.47 శాతం ఉన్న ప్రభుత్వ వాటాను పూర్తిగా అమ్మాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన లేఖలో ఏమి రాశారంటే...దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం సరైనది కాదన్నారు. 41 ఏళ్ల ‘మిని రత్న’ ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాత్మకంగా, రక్షణపరంగా లాభదాయకమైన నిర్ణయం కాదని వివరించారు. 7500 కి.మీ ల పొడవైన దేశ కోస్తా తీర ప్రాంతంలో అనేక విధాలుగా తవ్వకాలను నిర్వహిస్తున్న డీసీఐ అమ్మకం సరైంది కాదని తెలిపారు. డీసీఐ పాత్ర దేశ రక్షణలో అత్యంత కీలకమైందని, ప్రకృతి వైపరీత్యాలను, విధ్వంసాలను అరికట్టడంలో సమగ్ర తవ్వకాలను నిర్వహించడంలో డిసిఐ పాత్ర చాలా ఉందన్నారు. నిపుణులతో కూడిన కమిటీని వేసి దేశంలో డ్రెడ్జింగ్ రంగం భవిష్యత్తు, ఆర్ధిక ప్రయోజనాలపై ఉండే ప్రభావం అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా పార్లమెంట్ లో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరారు. అప్పటివరకు డీసీఐలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని విన్నవించారు. -
‘డ్రెడ్జింగ్’ లో పెట్టుబడులు ఉపసంహరించొద్దు..
సాక్షి, న్యూఢిల్లీ : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నుంచి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన.. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ నుంచి పెట్టుబడులు ఉపసంహరణ అవివేకమని వ్యాఖ్యానించారు. డ్రెడ్జింగ్ రంగంలో ప్రైవేటు రంగం ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. డీసీఐని ప్రభుత్వం విక్రయిస్తే కార్మికులు రోడ్డున పడతారని, పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలను వెంటనే ఆపాలని, ఈ వవిషయంలో పునరాలోచించాలని నౌకాయాన మంత్రిత్వశాఖను సాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
నా చావుతోనైనా మార్పు రావాలి
-
నా చావుతోనైనా మార్పు రావాలి
విజయనగరం టౌన్: విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను ప్రైవేటీకరించొద్దని, తన చావుతోనైనా ఈ ప్రక్రియ నిలిపివేయాలని డీసీఐ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి శ్రీకాకుళం జీఆర్పీ హెచ్‌సీ చిరంజీవులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం ఎమ్మార్వో కార్యాలయ సమీపంలో నివాసం ఉంటున్న భాసిన రామ్మూర్తి, అన్నపూర్ణకు కుమారుడు నారాయణం వెంకటేశ్, సంధ్య, శిరీష అనే కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్ (30) విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లోని అడ్మిన్ విభాగంలో పనిచేస్తున్నాడు. 2017 జూన్‌లో అప్పు చేసి సోదరికి పెళ్లి చేశాడు. తమ సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుందనే సమాచారంతో వెంకటేశ్ ఆందోళనకు గురయ్యాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అని కలత చెందాడు. తన చావును చూసైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందనుకొని ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. శనివారం తన తల్లికి అరగంటలో వస్తానని చెప్పి వెంకటేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సోమవారం సాయంత్రం రైల్వే పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో వెంకటేశ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ చిరంజీవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వెంకటేశ్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమని డీసీఐ ఉద్యోగులు సీహార్స్ కూడలిలో ఆందోళనకు దిగారు. -
అమ్మకానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్
కేంద్రం ‘వ్యూహాత్మక’ ప్రణాళిక... కంపెనీని పూర్తిగా ప్రైవేటుపరం చేసే అవకాశం ఖజానాకు రూ.1,400 కోట్లు వస్తాయని అంచనా... మరో 4 కంపెనీల్లో 100 శాతం వాటా విక్రయంపైనా దృష్టి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐఎల్)ను పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు పావులు కదుపుతోంది. ప్రస్తుతం కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం 73.47 శాతం వాటాను వేలం పద్దతిలో వ్యూహాత్మక విక్రయం చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత శుక్రవారం(16న) డీసీఐఎల్ షేరు ధర బీఎస్ఈలో 1.3% లాభపడి రూ.691 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.1,935 కోట్లు. ప్రస్తుత షేరు ధర ప్రకారం73.47% వాటా అమ్మకంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1,400 కోట్లు లభించే అవకాశం ఉంది. త్వరలో కేబినెట్ ముందుకు... అదేవిధంగా మరో నాలుగు అన్–లిస్టెడ్ కంపెనీల్లో 100 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ జాబితాలో కామరాజర్ పోర్ట్, హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్, ఇండియన్ మెడిసిన్స్ అండ్ ఫార్మాసూటికల్స్ కార్పొరేషన్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాసూటికల్స్ ఉన్నాయి. డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటైన కీలక కార్యదర్శుల బృందం ఇప్పటికే ఈ ఐదు ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల విక్రయానికి ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బృందానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారు. కాగా, ఈ ఐదు కంపెనీల డిజిన్వెస్ట్మెంట్కు నీతి ఆయోగ్ కూడా సుముఖంగానే ఉండటం గమనార్హం. ఈ ప్రతిపాదనలకు ఆమోదం కోసం త్వరలోనే ఆర్థిక వ్యవçహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)కి నివేదించనున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్‌యూల్లో వ్యూహాత్మక వాటా అమ్మకాల ద్వారా ఈ ఏడాది(2017–18)లో రూ.15,000 కోట్లను సమీకరించాలని కేంద్రం బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండంచెల విధానం... మినీరత్న జాబితాలో ఉన్న డీసీఐఎల్‌లో మొత్తం వాటా అమ్మకం కోసం ప్రభుత్వం రెండంచెల వేలం ప్రక్రియను అమలు చేయాలని భావిస్తోంది. ముందుగా అర్హులైన బిడ్డర్లను ఎంపిక చేయడం.. ఆ తర్వాత కాంపిటీటివ్ ఫైనాన్షియల్ బిడ్డింగ్ ద్వారా అమ్మకాన్ని పూర్తిచేయాలనేది కేంద్రం యోచన. గడిచిన ఆర్థిక సంవత్సరం(2016–17)లో ఈ కంపెనీ రూ.7.4 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా, డీసీఐఎల్ అమ్మకంతోపాటు ఉద్యోగులకు మరింత మెరుగైన స్వచ్ఛంద పదవీవిరమణ పథకాన్ని(వీఆర్ఎస్) కూడా అమలు చేసే అంశాన్ని సీసీఈఏ పరిశీలించనున్నట్లు సమాచారం. డ్రెడ్జింగ్(సముద్రం, నదులు, కాలువలు వంటి నీటితో నిండిన ప్రాంతాల్లో పూడిక తీత–నౌకా మార్గాల్లో తగినంత లోతు ఉండేలా చూడటం కోసం దీన్ని చేపడతారు) అనేది వ్యూహాత్మక రంగంలోకి రానందున డీసీఐఎల్ను పూర్తిగా ప్రైవేటు కంపెనీలకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.