
వెంకటేశ్ (ఫైల్)
విజయనగరం టౌన్: విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను ప్రైవేటీకరించొద్దని, తన చావుతోనైనా ఈ ప్రక్రియ నిలిపివేయాలని డీసీఐ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి శ్రీకాకుళం జీఆర్‌పీ హెచ్‌సీ చిరంజీవులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం ఎమ్మార్వో కార్యాలయ సమీపంలో నివాసం ఉంటున్న భాసిన రామ్మూర్తి, అన్నపూర్ణకు కుమారుడు నారాయణం వెంకటేశ్, సంధ్య, శిరీష అనే కుమార్తెలు ఉన్నారు.
వెంకటేశ్ (30) విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లోని అడ్మిన్ విభాగంలో పనిచేస్తున్నాడు. 2017 జూన్‌లో అప్పు చేసి సోదరికి పెళ్లి చేశాడు. తమ సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుందనే సమాచారంతో వెంకటేశ్ ఆందోళనకు గురయ్యాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అని కలత చెందాడు. తన చావును చూసైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందనుకొని ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. శనివారం తన తల్లికి అరగంటలో వస్తానని చెప్పి వెంకటేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సోమవారం సాయంత్రం రైల్వే పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో వెంకటేశ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీకాకుళం రైల్వే జీఆర్‌పీ చిరంజీవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వెంకటేశ్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమని డీసీఐ ఉద్యోగులు సీహార్స్ కూడలిలో ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment