సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మంగళవారం లేఖ రాశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)లో 73.47 శాతం ఉన్న ప్రభుత్వ వాటాను పూర్తిగా అమ్మాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన లేఖలో ఏమి రాశారంటే...దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం సరైనది కాదన్నారు. 41 ఏళ్ల ‘మిని రత్న’ ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాత్మకంగా, రక్షణపరంగా లాభదాయకమైన నిర్ణయం కాదని వివరించారు. 7500 కి.మీ ల పొడవైన దేశ కోస్తా తీర ప్రాంతంలో అనేక విధాలుగా తవ్వకాలను నిర్వహిస్తున్న డీసీఐ అమ్మకం సరైంది కాదని తెలిపారు.
డీసీఐ పాత్ర దేశ రక్షణలో అత్యంత కీలకమైందని, ప్రకృతి వైపరీత్యాలను, విధ్వంసాలను అరికట్టడంలో సమగ్ర తవ్వకాలను నిర్వహించడంలో డిసిఐ పాత్ర చాలా ఉందన్నారు. నిపుణులతో కూడిన కమిటీని వేసి దేశంలో డ్రెడ్జింగ్ రంగం భవిష్యత్తు, ఆర్ధిక ప్రయోజనాలపై ఉండే ప్రభావం అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా పార్లమెంట్ లో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరారు. అప్పటివరకు డీసీఐలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment