అమ్మకానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్
కేంద్రం ‘వ్యూహాత్మక’ ప్రణాళిక...
కంపెనీని పూర్తిగా ప్రైవేటుపరం చేసే అవకాశం
ఖజానాకు రూ.1,400 కోట్లు వస్తాయని అంచనా...
మరో 4 కంపెనీల్లో 100 శాతం వాటా విక్రయంపైనా దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐఎల్)ను పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు పావులు కదుపుతోంది. ప్రస్తుతం కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం 73.47 శాతం వాటాను వేలం పద్దతిలో వ్యూహాత్మక విక్రయం చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత శుక్రవారం(16న) డీసీఐఎల్ షేరు ధర బీఎస్ఈలో 1.3% లాభపడి రూ.691 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.1,935 కోట్లు. ప్రస్తుత షేరు ధర ప్రకారం73.47% వాటా అమ్మకంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1,400 కోట్లు లభించే అవకాశం ఉంది.
త్వరలో కేబినెట్ ముందుకు...
అదేవిధంగా మరో నాలుగు అన్–లిస్టెడ్ కంపెనీల్లో 100 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ జాబితాలో కామరాజర్ పోర్ట్, హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్, ఇండియన్ మెడిసిన్స్ అండ్ ఫార్మాసూటికల్స్ కార్పొరేషన్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాసూటికల్స్ ఉన్నాయి. డిజిన్వెస్ట్మెంట్పై ఏర్పాటైన కీలక కార్యదర్శుల బృందం ఇప్పటికే ఈ ఐదు ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)ల విక్రయానికి ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బృందానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారు. కాగా, ఈ ఐదు కంపెనీల డిజిన్వెస్ట్మెంట్కు నీతి ఆయోగ్ కూడా సుముఖంగానే ఉండటం గమనార్హం. ఈ ప్రతిపాదనలకు ఆమోదం కోసం త్వరలోనే ఆర్థిక వ్యవçహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)కి నివేదించనున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్యూల్లో వ్యూహాత్మక వాటా అమ్మకాల ద్వారా ఈ ఏడాది(2017–18)లో రూ.15,000 కోట్లను సమీకరించాలని కేంద్రం బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
రెండంచెల విధానం...
మినీరత్న జాబితాలో ఉన్న డీసీఐఎల్లో మొత్తం వాటా అమ్మకం కోసం ప్రభుత్వం రెండంచెల వేలం ప్రక్రియను అమలు చేయాలని భావిస్తోంది. ముందుగా అర్హులైన బిడ్డర్లను ఎంపిక చేయడం.. ఆ తర్వాత కాంపిటీటివ్ ఫైనాన్షియల్ బిడ్డింగ్ ద్వారా అమ్మకాన్ని పూర్తిచేయాలనేది కేంద్రం యోచన. గడిచిన ఆర్థిక సంవత్సరం(2016–17)లో ఈ కంపెనీ రూ.7.4 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా, డీసీఐఎల్ అమ్మకంతోపాటు ఉద్యోగులకు మరింత మెరుగైన స్వచ్ఛంద పదవీవిరమణ పథకాన్ని(వీఆర్ఎస్) కూడా అమలు చేసే అంశాన్ని సీసీఈఏ పరిశీలించనున్నట్లు సమాచారం. డ్రెడ్జింగ్(సముద్రం, నదులు, కాలువలు వంటి నీటితో నిండిన ప్రాంతాల్లో పూడిక తీత–నౌకా మార్గాల్లో తగినంత లోతు ఉండేలా చూడటం కోసం దీన్ని చేపడతారు) అనేది వ్యూహాత్మక రంగంలోకి రానందున డీసీఐఎల్ను పూర్తిగా ప్రైవేటు కంపెనీలకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.