రైల్వేకు కొత్త శోభ తీసుకొస్తాం
లోక్‌సభ చర్చలో మంత్రి సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ: రైల్వేలోని వివిధ విభాగాలకు కేటాయింపులు తగ్గడంతో నిర్వహణ, భద్రతపై ప్రభావం పడుతుందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మంగళవారం విమర్శించారు. రైల్వే నిధుల కేటాయింపు (2016-17)పై లోక్‌సభలో చర్చను ప్రారంభిస్తూ.. రూ. లక్ష కోట్ల జాతీయ రైలు భద్రత నిధి కోసం ఎంత కేటాయించారని ప్రశ్నించారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న రైల్వేల్ని పునర్ నిర్మించడంతో పాటు పునరుత్తేజం తీసుకొస్తామంటూ కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు సమాధానమిచ్చారు. కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నామని, జపాన్ నుంచి రూ.లక్ష కోట్ల రుణం తీసుకుంటున్నామని తెలిపారు. రైల్వే బడ్జెట్ బాగున్నా.. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని టీడీపీ ఎంపీ తోట నరసింహం అన్నారు. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కోరారు. హైదరాబాద్, అమరావతి మధ్య హైస్పీడ్ రైలు నడపాలని కోరారు. రైల్వే బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ వి.వరప్రసాద్‌రావు అన్నారు.
పార్లమెంటు సమాచారం.. వ్యవసాయ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని రూ. 553.14 కోట్లకు పెంచామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్‌భాయ్ కుందారియా లోక్‌సభకు తెలిపారు. వ్యవసాయ సంబంధ కారణాలతో 116 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో 57, పంజాబ్‌లో 56 మంది, తెలంగాణలో ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు మరో 6 రాష్ట్రాల్లో కరువు పరిస్థితులున్నాయని, ఆ రాష్ట్రాల్లో ఉపాధి హామీ కింద మరో 50 రోజులు అదనంగా పని కల్పిస్తామని తెలిపారు. వందకోట్లకుపైగా రుణాలు చెల్లించాల్సిన 701 మంది ప్రభుత్వ బ్యాంకులకు రూ. 1.63 లక్షల కోట్ల మొండి బకాయిలున్నారని కేంద్రం రాజ్యసభకు వెల్లడించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కొత్త జీతభత్యాల అమలుతో ప్రభుత్వంపై రూ.1.02 లక్షల కోట్ల భారం పడుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 2,400 గెజిటెడ్ అధికారులు అవినీతికి పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా నివేదిక అందజేశారు.