‘రాజధాని’ మిస్సైతే..‘మహారాజా’ స్వాగతం
న్యూఢిల్లీ: రాజధాని రైళ్లలో టికెట్ తీసుకున్నా.. చివరి నిమిషం వరకు బెర్తు ఖరారు కాని ప్రయాణికులకు శుభవార్త. రాజధాని రైలు ప్రయాణం మిస్సైందనే చింత అక్కర్లేదు. ఇలాంటి ప్రయాణికులకు మహారాజా (ఎయిర్ ఇండియా మస్కట్) స్వాగతం పలకనున్నాడు. రాజధాని టికెట్ ఖరారు కాని ప్రయాణికులు కొంతమొత్తం అదనంగా చెలిస్తే వీరిని ఎయిర్ ఇండియా విమానంలో గమ్యస్థానానికి చేర్చేలా.. ఐఆర్‌సీటీసీ, ఎయిర్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. వారం రోజుల్లోనే ఈ సదుపాయం మొదలుకానుందని సమాచారం.
అయితే రాజధాని ఏసీ ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని.. సెకండ్, థర్డ్ ఏసీ ప్రయాణికులు రూ.2వేల వరకు చెల్లిస్తే సరిపోతుందని ఎయిర్ ఇండియా చీఫ్ అశ్వని లొహానీ తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాలకు విమాన సేవలు మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, వెయిటింగ్ లిస్టులో, ఆర్‌ఏసీలో ఉన్న ప్రయాణికులు 139కు డయల్ చేసి తమ టికెట్‌ను రద్దుచేసుకోవచ్చని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఢిల్లీలో తెలిపారు. అయితే రైలు బయలుదేరేందుకు 4 గంటల ముందు వరకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందన్నారు.