
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం దేహదారుఢ్య, మెయిన్ పరీక్షలకు కాల్ లెటర్లను మార్చి 1 నుంచి 10వ తేదీలోగా తమ వెబ్‌సైట్ slprb.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం ప్రిలిమినరీ పరీక్షను జనవరిలో నిర్వహించారు.
అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య, మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. దేహదారుఢ్య పరీక్షలను మార్చి 13 నుంచి నిర్వహించాలని పోలీసు నియామక మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. మెయిన్ పరీక్షను ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ పరీక్షల తేదీలను పోలీసు నియామక మండలి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.