సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో బుధవారం గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి తరఫున ఆయన సమాధానమిచ్చారు. కడియం మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో 1,661 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపామన్నారు. వాటికి ఆయా వర్సిటీలు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నాటికి భర్తీలు జరుగుతాయన్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11 వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ. 420 కోట్లు కేటాయించిందన్నారు. 2004–14 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం రూ.1.29 లక్షల కోట్లు కాగా, 2014 నుంచి ఇప్పటివరకు చేసిన పెట్టుబడి వ్యయం రూ.1.24 లక్షల కోట్లు ఉందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందనడానికి ఈ లెక్కలే నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment