నోటిఫికేషన్‌తో సరి! | Issue notifications Dr. B.R. Ambedkar University | Sakshi
Sakshi News home page

నోటిఫికేషన్‌తో సరి!

Published Fri, Jun 13 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

నోటిఫికేషన్‌తో సరి!

నోటిఫికేషన్‌తో సరి!

ఎచ్చెర్ల క్యాంపస్: ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని..’ అన్నట్టుంది డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ పరిస్థితి. రెగ్యులర్ బోధకుల నియామక వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చినా వర్సిటీ అధికారులు సకాలంలో ఆ ప్రక్రియను పూర్తిచేయకపోవటం విద్యార్థు ల పాలిట శాపంగా మారింది. 2008 జూన్ 25న వర్సిటీ ఏర్పాటు కాగా ఒక్కసారి మాత్రమే నియామకాలు జరపగలిగారు. మరో మూడుసార్లు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ పోస్టుల భర్తీ మాత్రం చేయలేకపోయారు.
 
 ఇదీ పరిస్థితి
 బీఆర్‌ఏయూలో ప్రస్తుతం 12 మంది రెగ్యులర్ బోధకులు మాత్రమే ఉన్నారు. దీంతో 70 మంది కాంట్రాక్ట్ బోధకులతో తరగతులను నెట్టుకొస్తున్నారు. 2008లో ఎచ్చెర్లలోని ఏయూ పీజీ సెంటర్ బీఆర్‌ఏయూగా ఏర్పాటయ్యాక ఇక్కడ పనిచేస్తున్న 22 మంది బోధకులు విశాఖలోని మాతృసంస్థ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్లిపోయారు. దీంతో మొదటినుంచి సమస్య కొనసాగుతోంది. రెగ్యులర్ బోధకులు లేకపోవటం వర్సిటీ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. తగినంతమంది రెగ్యులర్ బోధకులు లేకపోవటంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి 12-బీ గుర్తింపు ఇంతవరకు లభించలేదు.
 
   వర్సిటీ ఏర్పడ్డాక 2008లో తొలి వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సుధాకర్ హయాంలో సోషల్ వర్క్, బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్లను ప్రారంభించారు. 2009లో నోటిఫికేషన్ జారీ చేసి బయోటెక్నాలజీ విభాగంలో నలుగురు, సోషల్ వర్క్‌లో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ఈ సమయంలోనే బోధనేతర సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష ని ర్వహించినా ఫలితాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఆ నియామకాలు నిలిచిపోయాయి.  వీసీ సుధాకర్ హయాంలోనే 8 ప్రొఫెసర్, 7 అసోసియేట్ ప్రొఫెసర్, 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 2010 డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో సోషల్‌వర్క్ విభాగానికి 4, బయోటెక్నాలజీకి 3, కామర్స్‌కు 3, ఎకనామిక్స్‌కు 3, ఎల్‌ఎల్‌బీకి 7, ఎంఎల్‌ఐఎస్సీకి 3, రూరల్ డెవలప్‌మెంట్‌కు 4, గణిత విభాగానికి 5 పోస్టులను కేటాయించారు. అయితే భర్తీ ప్రక్రియను సకాలంలో పూర్తిచేయకపోవటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
 
   వీసీగా ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ బాధ్యతలు చేపట్టాక అవే 34 పోస్టులకు కొద్దిపాటి రోస్టర్ మార్పులతో 2013 జూన్ 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి స్పందనగా 400 దరఖాస్తులు రాగా వాటి పరిశీలనను సైతం పూర్తి చేశారు. కానీ నియామకాలు మాత్రం చేపట్టలేకపోయారు. నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది అవుతుండటం, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టటంతో ఈ నోటిఫికేషన్‌కు కూడా కాలదోషం పట్టనుందని సమాచారం.
 
   ఈ ఏడాది మార్చి 3న మరో 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు. తర్వాత ఎలాంటి కదలిక లేకపోవటంతో పోస్టుల భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి సాధారణ ఎన్నికలకు ముందే నియామకాలు పూర్తిచేయాలని అధికారులు భావించినా గవర్నర్ కార్యాలయం నుంచి అనుమతి రాకపోవటంతో ప్రక్రియ నిలిచిపోయింది. వర్సిటీ అధికారుల ఏకపక్ష నిర్ణయాల గురించి సమాచారం ఉండటంతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తన నామినీని నియమించలేదని తెలిసింది.
 
 రాజకీయ అడ్డంకులు తప్పవా?
 బీఆర్‌ఏయూ ప్రస్తుత వీసీ హనుమంతు లజపతిరాయ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు. ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు పట్టింది. నియామకాలపై దీని ప్రభావం తప్పనిసరిగా ఉంటుం దని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు, వర్సిటీ పాలక మండలి నియామకం ఇంతవరకు జరగకపోవటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటం వల్ల నియామకాలు ఇప్పట్లో జరగకపోవ చ్చని తెలుస్తోంది.
 
 
 టీచింగ్ అసోసియేట్ల ప్రచారం..
 రెగ్యులర్ బోధకులుగా తాము నియమితులవటం ఖాయమని కొందరు టీచిం గ్ అసోసియేట్లు గట్టిగా ప్రచారం చేసుకుంటుండటం గమనార్హం. వర్సిటీ ఉన్నతాధికారి త మ బంధువని.. అందువల్ల తమకు పోస్టు వచ్చి తీరుతుందని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే జిల్లాకు చెందిన అప్పటి కేంద్ర సహాయ మంత్రి అండదండలతో నియామకాలను పూర్తి చేయాలనుకున్నారు. కానీ గవర్నర్ నామినీ నియామకం జరగకపోవటంతో అది సాధ్యం కాలేదు.
 
 ఏర్పాట్లు చేశాం.. కానీ..
 పోస్టుల భర్తీని సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని.. అయితే ఎన్నికలకు ముందు గవర్నర్ నామినీ రాకపోవటంతో ప్రక్రియ నిలిచిపోయిందని వర్సిటీ రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement