Dr. B.R. Ambedkar University
-
నోటిఫికేషన్‌తో సరి!
ఎచ్చెర్ల క్యాంపస్: ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని..’ అన్నట్టుంది డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ పరిస్థితి. రెగ్యులర్ బోధకుల నియామక వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చినా వర్సిటీ అధికారులు సకాలంలో ఆ ప్రక్రియను పూర్తిచేయకపోవటం విద్యార్థు ల పాలిట శాపంగా మారింది. 2008 జూన్ 25న వర్సిటీ ఏర్పాటు కాగా ఒక్కసారి మాత్రమే నియామకాలు జరపగలిగారు. మరో మూడుసార్లు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ పోస్టుల భర్తీ మాత్రం చేయలేకపోయారు. ఇదీ పరిస్థితి బీఆర్ఏయూలో ప్రస్తుతం 12 మంది రెగ్యులర్ బోధకులు మాత్రమే ఉన్నారు. దీంతో 70 మంది కాంట్రాక్ట్ బోధకులతో తరగతులను నెట్టుకొస్తున్నారు. 2008లో ఎచ్చెర్లలోని ఏయూ పీజీ సెంటర్ బీఆర్ఏయూగా ఏర్పాటయ్యాక ఇక్కడ పనిచేస్తున్న 22 మంది బోధకులు విశాఖలోని మాతృసంస్థ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్లిపోయారు. దీంతో మొదటినుంచి సమస్య కొనసాగుతోంది. రెగ్యులర్ బోధకులు లేకపోవటం వర్సిటీ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. తగినంతమంది రెగ్యులర్ బోధకులు లేకపోవటంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి 12-బీ గుర్తింపు ఇంతవరకు లభించలేదు. వర్సిటీ ఏర్పడ్డాక 2008లో తొలి వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సుధాకర్ హయాంలో సోషల్ వర్క్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లను ప్రారంభించారు. 2009లో నోటిఫికేషన్ జారీ చేసి బయోటెక్నాలజీ విభాగంలో నలుగురు, సోషల్ వర్క్‌లో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ఈ సమయంలోనే బోధనేతర సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష ని ర్వహించినా ఫలితాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఆ నియామకాలు నిలిచిపోయాయి. వీసీ సుధాకర్ హయాంలోనే 8 ప్రొఫెసర్, 7 అసోసియేట్ ప్రొఫెసర్, 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 2010 డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో సోషల్‌వర్క్ విభాగానికి 4, బయోటెక్నాలజీకి 3, కామర్స్‌కు 3, ఎకనామిక్స్‌కు 3, ఎల్ఎల్బీకి 7, ఎంఎల్‌ఐఎస్సీకి 3, రూరల్ డెవలప్మెంట్కు 4, గణిత విభాగానికి 5 పోస్టులను కేటాయించారు. అయితే భర్తీ ప్రక్రియను సకాలంలో పూర్తిచేయకపోవటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. వీసీగా ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ బాధ్యతలు చేపట్టాక అవే 34 పోస్టులకు కొద్దిపాటి రోస్టర్ మార్పులతో 2013 జూన్ 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి స్పందనగా 400 దరఖాస్తులు రాగా వాటి పరిశీలనను సైతం పూర్తి చేశారు. కానీ నియామకాలు మాత్రం చేపట్టలేకపోయారు. నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది అవుతుండటం, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టటంతో ఈ నోటిఫికేషన్‌కు కూడా కాలదోషం పట్టనుందని సమాచారం. ఈ ఏడాది మార్చి 3న మరో 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు. తర్వాత ఎలాంటి కదలిక లేకపోవటంతో పోస్టుల భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి సాధారణ ఎన్నికలకు ముందే నియామకాలు పూర్తిచేయాలని అధికారులు భావించినా గవర్నర్ కార్యాలయం నుంచి అనుమతి రాకపోవటంతో ప్రక్రియ నిలిచిపోయింది. వర్సిటీ అధికారుల ఏకపక్ష నిర్ణయాల గురించి సమాచారం ఉండటంతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తన నామినీని నియమించలేదని తెలిసింది. రాజకీయ అడ్డంకులు తప్పవా? బీఆర్‌ఏయూ ప్రస్తుత వీసీ హనుమంతు లజపతిరాయ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు. ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు పట్టింది. నియామకాలపై దీని ప్రభావం తప్పనిసరిగా ఉంటుం దని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు, వర్సిటీ పాలక మండలి నియామకం ఇంతవరకు జరగకపోవటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటం వల్ల నియామకాలు ఇప్పట్లో జరగకపోవ చ్చని తెలుస్తోంది. టీచింగ్ అసోసియేట్ల ప్రచారం.. రెగ్యులర్ బోధకులుగా తాము నియమితులవటం ఖాయమని కొందరు టీచిం గ్ అసోసియేట్లు గట్టిగా ప్రచారం చేసుకుంటుండటం గమనార్హం. వర్సిటీ ఉన్నతాధికారి త మ బంధువని.. అందువల్ల తమకు పోస్టు వచ్చి తీరుతుందని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే జిల్లాకు చెందిన అప్పటి కేంద్ర సహాయ మంత్రి అండదండలతో నియామకాలను పూర్తి చేయాలనుకున్నారు. కానీ గవర్నర్ నామినీ నియామకం జరగకపోవటంతో అది సాధ్యం కాలేదు. ఏర్పాట్లు చేశాం.. కానీ.. పోస్టుల భర్తీని సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని.. అయితే ఎన్నికలకు ముందు గవర్నర్ నామినీ రాకపోవటంతో ప్రక్రియ నిలిచిపోయిందని వర్సిటీ రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
దరఖాస్తు చేయండి.. ఫలితం ఆశించకండి!
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ వ్యవస్థ అధ్వానం గా ఉంది. ముఖ్యంగా కీలకమైన రీవాల్యుయేషన్ విషయంలో జరుగుతున్న అనుచిత జాప్యంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. రీవేల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నాక ఆ విషయం మరచిపోవాల్సి వస్తోందని అంటున్నారు. డిగ్రీ, పీజీ.. రెండింటి పరిస్థితీ ఇలాగే ఉంది. ఫలితాలపై అనుమానమున్నవారు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. అటువంటి వారికి నిర్ణీత కాలవ్యవధిలో ఫలితాన్ని ప్రకటించాలి. కానీ నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఆ విషయమై కనీస సమాచారం అందడం లేదు. సంబంధిత సెక్షన్‌కు నేరుగా వెళ్లి అడిగినా సరైన స్పందన లభించ దు. ఎప్పుడో ఒకప్పుడు వస్తుందిలే.. అంటూ అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తారు. పరిస్థితి దారుణంగా ఉన్నా యూనివర్సిటీ అధికారులు సైతం స్పందించడం లేదు. ఫలి తంగా డిగ్రీ, పీజీ పేపర్ల రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసిన ఎంతోమంది విద్యార్థులు వర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆనుభవం ఉన్న వారిని, ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన సీనియర్లను ఈ సెక్షన్లో నియమించారు. అలాగే డిగ్రీ పరీక్షలకు ప్రత్యేకాధికారిని నియమించారు. అయినా తీరు మారడంలేదు. అవకాశాలు కోల్పోతున్నారు ఎల్ఎల్బి థర్డ్ సెమిస్టర్ రాసిన ఒక విద్యార్థి మొదటి సెమిస్టర్లో ఒక పేపర్ ఫెయిల్ అయ్యాడు. ఫలితం వచ్చిన 15 రోజుల్లోనే ఆ పేపర్ రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇది జరిగి ఏడాదైంది. మూడో సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. రీ వాల్యుయేషన్ మార్కుల మెమో మాత్రం రాలేదు. ఇది ఈ ఒక్క విద్యార్థి సమస్య కాదు. వందలాది మంది విద్యార్థులు ఇదే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. తక్కువ మార్కుల తేడాతో ఫెయిల్ అయిన వారు, ఒక సబ్జెక్టులో తప్పినవారు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకొని, ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. రీవాల్యుయేషన్‌లోనూ పాస్ కాకపోతే సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే సకాలంలో ఫలితం అందక సప్లిమెంటరీ రాసే అవకాశం కోల్పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పేపర్ రీ వాల్యుయేషన్‌కు రూ.500 ఫీజు వసూలు చేస్తున్నారు. సప్లిమెంటరీ లోపు ఫలితం ప్రకటించాల్సి ఉంటుంది. అయితే నెలలు, సంవత్సరాల తరబడి జాప్యం చేస్తున్నారు. దృష్టి సారిస్తాం ఈ అంశంపై రిజస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ అంశంపై దృష్టి పెడతామన్నారు. దీనికి సంబంధించి త్వరలో ఒక షెడ్యూల్ రూపొందించి, అమలు చేస్తామని చెప్పారు. -
నిబంధనలకు టెండర్!
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ఈ ఏడాది మే 17న బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి వర్సిటీలో చేపడుతున్న నిర్మాణ పనుల ను టెండర్లు పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చేస్తున్నారు. ఎచ్చెర్లకు చెందిన జరుగుళ్ల కృష్ణమూర్తి, శ్రీకాకుళానికి చెందిన పైడి నిర్మల్కుమార్లకే వీటిని కట్టబెడుతుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల మేరకు అవసరమైతే పనులను ముక్కలు చేస్తున్నారు తప్ప టెండర్లు పిలవటం లేదు. ఇదీ పనుల పరిస్థితి పార్కింగ్ షెడ్, ఆంధ్రాబ్యాంకు పక్క గేటు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గేటును రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, పార్కింగ్ షెడ్ ను వీసీ లజపతిరాయ్ ప్రారంభించారు. ప్రారంభ శిలాఫలకాలపై అంచనా వ్యయమెంతో రాయటం లేదు. అంచనాల్లో తరచూ మార్పులు చోటు చేసుకోవటమే దీనికి కారణమని సమాచారం. మహిళా వసతిగృహంపై అదనపు గదుల నిర్మాణ పనులను నాలుగు భాగాలుగా విభజించి ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇంత భారీ పనికి టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నిస్తే పనులు వేగంగా పూర్తవుతాయని ముక్కలు చేసి అప్పగించామని అధికారులు కథలు చెబుతున్నారు. సీసీ రోడ్డు, ఎగ్జామినేషన్ గోదాం, మహిళా వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నాణ్యతపై సందేహాలు మరోపక్క నిర్మాణ పనుల్లో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ ఇంజినీరింగ్ అధికారిగా విశ్రాంత ఇంజినీర్ పని చేస్తుండటంతో జవాబుదారీతనం ఉండటం లేదని పలువురు అంటున్నారు. సిమెంటు, ఇసుకలను సరైన నిష్పత్తిలో వాడటం లేదని, శ్లాబు నిర్మాణానికి పీపీసీ బదులు ఓపీసీ సిమెంటు వాడుతున్నారని, వాటరింగ్ సరిగా చేయటం లేదని ఆరోపణలు ఉన్నాయి. పనుల నాణ్యతపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవటంతో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారని అంటున్నారు. పర్సంటేజీలే కారణం? టెండర్ల ద్వారా ఇచ్చే పనులకు వచ్చే పర్సంటేజీ కన్నా నామినేటెడ్ పనులకు ఎక్కువ పర్సంటేజీ వస్తుండటం వల్లే ఇలా జరుగుతోందని వర్సిటీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పద్ధతిలో పనులు ఇస్తే 28 శాతం (కాంటాక్టర్‌కు 40 శాతం మిగిలే అవకాశం ఉందట), టెండర్ల ద్వారా ఇస్తే 14 శాతం(కాంట్రాక్టర్‌కు 20 శాతం మిగిలే అవకాశం ఉందట) సొమ్ము వస్తుందని అంటున్నారు. మరోవైపు.. వర్సిటీ ఇంజినీరింగ్ అధికారి కూడా పనుల్లో పరోక్షంగా పెట్టుబడి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే పరిస్థితి మరింత దారితప్పే అవకాశం ఉందని వర్సిటీ శ్రేయోభిలాషులు అంటున్నారు. నిబంధలకు లోబడే చేస్తున్నాం.. ఈ విషయమై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇప్పటివరకు అత్యవసర పనులను మాత్రమే చేయించామని, ప్రతి పనికీ విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ, ఆభివృద్ధి మండలి అనుమతులు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని పనులు నిబంధనలకు లోబడే చేస్తున్నామని, ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోవటం లేదన్నారు. త్వరలో రూ.18 లక్షలతో నిర్మించనున్న భవనాల పనులకు టెండర్లు ఆహ్వానిస్తామని చెప్పారు.