సేద్యమే వేదం.. బతుకు భారం | Farmers facing huge troubles and getting suicides in their lives | Sakshi
Sakshi News home page

సేద్యమే వేదం.. బతుకు భారం

Published Wed, Nov 1 2017 4:15 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers facing huge troubles and getting suicides in their lives - Sakshi

మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరంలోని రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు, రైతులు

వాస్తవ సాగుదారులు మన కౌలుదారులు
రాష్ట్రంలో ప్రతి 30 గంటలకు ఓ కౌలు రైతు ఉరికొయ్యకు వేళ్లాడుతున్నాడు. రెండు నెలల వ్యవధిలో 43 మంది చనిపోయారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 24 వరకు 23 మంది చనిపోతే ఆ తర్వాత రోజు నుంచి ఇప్పటికి అంటే అక్టోబర్‌ 31 నాటికి మరో 20 మంది చనిపోయారు. ఇవి కేవలం దినపత్రికల్లో వచ్చిన వివరాల మేరకే. ఇక నమోదు కానివి, మారుమూల ప్రాంతాల్లో అనామకంగా ముగిసిపోయే జీవితాలు మరెన్నో...

సాక్షి, అమరావతి: అటు ప్రకృతి కరుణించక, ఇటు పాలకులు దృష్టి సారించక వ్యవసాయం జూదంగా మారింది. ‘ఓ సంతోషం లేదు.. సుఖం లేదు.. ఇదేం జీవితం..’ అంటూ భూములున్న రైతులు విసిగి వేసారి సాగు వదిలేసి మరో దారి చూసుకుంటున్నారు. మరో దారి లేని పరిస్థితుల్లో వ్యవసాయాన్నే నమ్ముకుని పొలాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు బడుగు రైతులు. పగలూ రాత్రి ఒళ్లు హూనమయ్యేలా పనిచేస్తున్నా కాయకష్టమే మిగులుతోంది తప్ప ఎదుగూ బొదుగూ లేని జీవితం వారిది. ఏటేటా పెరుగుతున్న కౌలురేట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్‌ ధరల పెరుగుదలతో కుదేలవుతున్నారు. వీరి కోసం ఎన్నో చట్టాలు ఉన్నా ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు. రుణ అర్హత కార్డులు ఇవ్వరు.. ఒకవేళ ఇచ్చినా రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రారు.. పంటల పెట్టుబడికి వడ్డీ వ్యాపారులే గతి. అతివృష్టితోనే, అనావృష్టితోనో పంట పాడైతే పరిహారం దక్కదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. ఈ పరిస్థితుల్లో పిల్లల చదువులు, పెళ్ళిళ్లు వారికి పెనుభారంగా మారుతున్నాయి. మరోవైపు రోజురోజుకీ పెరుగుతున్న అప్పుల భారంతో దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీరి జీవితాలు ఇంతేనా? వీరి ఆత్మహత్యలు నివారించే మార్గాలే లేవా? ప్రభుత్వం ఏం చేస్తోంది..? 

కాయకష్టం తప్ప కాసులు మిగిలిందెక్కడ?
‘‘నేనో సన్నకారు కౌలు రైతును. 16 ఏళ్లుగా కౌలు చేస్తున్నా.. పిల్లలు పెద్దోళ్లు అయ్యారు తప్ప చేతిలో నాలుగు రాళ్లు మిగిలింది లేదు. పిల్లలను బాగా చదివించాలనుకున్నా.. పరిస్థితి ఇట్టాగుంటే ఏం సదివిస్తాం? కంటి నిండ నిద్రా లేదు.. కడుపారా తిన్నదీ లేదు.. ఎద్దులతో దున్నినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చూశా. ఆ నాటి పరిస్థితులు ఈ వేళ లేవు. ఇవ్వాళ అన్నీ కొనుక్కోవాల్సిందే. రెండేళ్లు నీళ్లు లేక నాట్లు వేయలేదు. అంతకు ముందు అధిక వర్షాలతో పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. చూసి చూసి కళ్లు కాయలు కాశాయి తప్ప ఇంతవరకు ఏ సాయం అందలేదు. ఒకేడాది అయితే పంట బాగా పండింది. కష్టాలన్నీ తీరుతాయనుకున్నా. పంటను మార్కెట్‌కు తీసుకుపోయే సరికే ధర ఉన్నట్లుండి పడిపోయింది. ఆ భూదేవినే నమ్ముకున్నా.. నాకు సేద్యం చేయడం తప్ప మరో పని రాదు. ఈ ఏడాది కూడా పంట వేశాను. ఎలా ఉంటుందో మరి. రెండు గేదెలుండబట్టి సరిపోయింది గానీ లేకుంటే ఆకలి దప్పులతో ఎప్పుడో పోయేవాళ్లం. మాలాంటోళ్ల కోసం సర్కారోళ్లు ఏమేమో చేసేస్తున్నారని చెబుతున్నారే కానీ ఏం చేశారో తెలియడం లేదు.’’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరుకు చెందిన కౌలు రైతు పల్లపోతు రెడ్డయ్య వాపోయాడు. రాష్ట్రంలోని కౌలు రైతులందరిదీ ఇదే ఆవేదన. 

వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వ సర్వేల ప్రకారమే రాష్ట్రంలోని 93 శాతం మంది రైతులు రుణగ్రహీతలుగా ఉన్నారు. సగం మంది రైతులకు కూడా సంస్థాగత రుణాలు అందడం లేదు. రాష్ట్రంలో గ్రామీణ జీవితం భూమితో ముడిపడి ఉంది. ఇప్పటికీ 63 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి ప్రధానంగా సాంకేతికం, వ్యవస్థాగతం అనే రెండు అంశాలపై ఆధారపడి ఉంది. కౌల్దారీ వ్యవస్థ రెండో రకానికి చెందినది. కమతాల మెరుగుదల, కౌలు కాల పరిమితి, నియంత్రణతో పాటు భూ యజమాని, కౌల్దారు మధ్య సత్‌ సంబంధాలు, కౌలు రైతుకు భద్రత ఉంటే వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి వీలవుతుంది. వ్యవసాయ రంగంలో 1991 తర్వాత విధానపరమైన మార్పులు అనేకం చోటు చేసుకున్నాయి. భూములపై సరిపడా ఆదాయం రాకపోవడం, భూమి ఆర్థికంగా గిట్టుబాటు కాకపోవడంతో భూస్వాములు క్రమంగా తమ భూముల్ని కౌలుకు ఇచ్చి పట్టణాల బాట పట్టారు. కొన్ని ప్రాంతాల్లో సొంత భూమి ఉన్న రైతులకు పంటల్ని సాగు చేయడం కష్టతరమైంది. అప్పటివరకు భూస్వాముల పొలాల్లో పని చేసిన కూలీలు సైతం సొంత భూమి కోసం ఆరాటపడ్డారు. ఈ పరిస్థితిని గమనించిన భూ యజమానులు తమ పొలాన్ని కౌలుకు, పాలికి ఇవ్వడం ప్రారంభించారు. 

కౌలు రైతులే అధికం
దేశంలో ప్రస్తుతం ఉన్న 9 కోట్ల రైతు కమతాల్లో 10 శాతానికిపైగా కౌలు రైతుల చేతుల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవంగా 34 శాతం వరకు కౌలు రైతుల చేతుల్లో ఉన్నట్టు అనధికార వర్గాల సమాచారం. జాతీయ నమూనా సర్వే ప్రకారం రాష్ట్రంలోని ప్రస్తుత సాగుదార్లలో 70 శాతం మంది కౌలుదారులు. వీరిలోనూ అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల వారే. తాజా అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కానీ, 24 లక్షల మంది ఉన్నట్టు రైతు సంఘాల అంచనా. (వాస్తవానికి వీరి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. ఎకరం.. రెండెకరాల భూమి ఉన్న రైతులు మరో రెండు మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వీరిని కౌలు రైతులుగా గుర్తించడం లేదు) భూ అధీకృత చట్టం ప్రకారం రైతులకు కౌలు రైతులకు రుణ అర్హత గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డు ఉన్న వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. ఇతర ప్రభుత్వ పథకాలు, రాయితీలు ఇవ్వాలి. కానీ అవేవీ ఇప్పటికీ అమలు కావడం లేదు. గత ఏడాది 11 లక్షల మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అందులో సగం కూడా ఇవ్వలేదు. 2016–17లో రూ.80 వేల కోట్ల పంట రుణాలలో 80 వేల మంది కౌలు రైతులకు కేవలం రూ.202 కోట్ల రుణం మాత్రమే ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

సగం మందికి పైగా సన్న, చిన్నకారు రైతులే
సాగు కమతాల విస్తీర్ణంపై వ్యవసాయ ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో సగటున రైతుకున్న భూమి 1.06 హెక్టార్లు (సగటు సాగు విస్తీర్ణం 2.64 హెక్టార్లు). 70 శాతానికి పైగా గ్రామీణ ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల మంది రైతులున్నారనుకుంటే వారిలో 49,83,611 మంది సన్నకారు రైతులు. 15,91,112 మంది చిన్నకారు, 7,96,198 మంది ఓ మోస్తరు మధ్యతరహా రైతులు. మధ్యతరహా 2,30,419 మంది కాగా, 19,878 మంది పెద్ద రైతులు ఉన్నారు. సాగు పరంగా చూస్తే సన్నకారు రైతుల చేతిలో 26.68 శాతం భూమి, చిన్నకారు రైతుల చేతుల్లో 27.80 శాతం, ఓ మోస్తరు మధ్య తరహా రైతుల చేతిలో 25.93 శాతం, మధ్యతరహా రైతుల చేతిలో 15.83 శాతం, పెద్ద రైతుల చేతిలో 3.75 శాతం భూమి ఉన్నట్టు అంచనా. ఈ లెక్కన రాష్ట్రంలో 66 శాతం భూమిని సన్నకారు రైతులే సాగు చేస్తున్నారు.

విస్తృత చర్చ జరగాలి
రాష్ట్రంలో కౌలు రైతుల దుస్థితిపై విస్తృతంగా చర్చ జరగాలని రైతు సంఘాల నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవంగా వీరు ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టాల అమలులో అడ్డంకులపై అంశాలవారీ చర్చ జరగాలని చెబుతున్నారు. ఓ వైపు పొలం కౌలుకు తీసుకున్నందుకు చెల్లించే డబ్బు కోసమే తొలుత అప్పు చేయాల్సి వస్తోంది. ఆపై పంట పెట్టుబడి కోసం రుణదాతల మీద ఆధారపడుతున్నారు. రుణ అర్హత కార్డులు ఇవ్వడంలో ఏ తరహా అడ్డంకులు వస్తున్నాయి.. వాటినెలా పరిష్కరించాలనే విషయంపై పాలకులు మరింతగా దృష్టి సారించి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేలా ఒత్తిడి పెంచాలని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. వీటి గురించి పాలకులు పట్టించుకోక పోవడం వల్లే కౌలు రైతుల అప్పులు ఏటికేటా పెరిగిపోతూ.. తీర్చే మార్గం కనిపించక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. 

కౌలు రైతుల డిమాండ్లు
- 2011 కౌల్దారి చట్టం ప్రకారం కౌలురైతులకు రుణ అర్హత పత్రాలు ఇవ్వాలి. 
- స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం వడ్డీలేని పంట రుణం లక్ష రూపాయలు ఇవ్వాలి
- ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు కౌలు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలి
- పంటల బీమా పథకం కింద కౌలు రైతులు చెల్లించే బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలి
- ఈ–క్రాప్‌ బుకింగ్‌లో కౌలురైతుల పేర్లను నమోదు చేయాలి
- ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రక్రియను సులభతరం చేయాలి
- స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలి. ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించాలి

ఆగని ఆత్మహత్యల పరంపర...
కౌలు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 31 వరకు కన్నుమూసిన రైతుల వివరాలను చూస్తే కర్నూలు జిల్లా ముందుంది. ఈ జిల్లాలో 8 మంది చనిపోతే గుంటూరు జిల్లాలో ఆరుగురు ఉన్నారు. అనంతపురం జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, వైఎస్సార్, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. ఖరీఫ్‌ పంటలు చేతికి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలను రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.


 











No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement