సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వ్యవసాయ భూములు వాస్తవంగా సాగు చేస్తున్నది తామేనని.. తమకు పెట్టుబడి సాయం అందజేయాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 1956 కౌలుదారు చట్టం ప్రకారం కౌలు రైతులకు హక్కులున్నాయని, తమను గుర్తించి, కార్డులు ఇచ్చి ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.
సాగు చేసేవారికి ఇవ్వరా..?
వచ్చే ఖరీఫ్ నుంచి రాష్ట్రంలోని రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సాగు యోగ్యమైన భూములన్నింటికీ ఈ సాయం అందుతుంది. అయితే ఈ పథకంలో ఆ భూముల యజమానులైన రైతులకే సొమ్ము ఇవ్వనున్నారు. అయితే చాలా మంది పెద్ద రైతులు, ఇతర వృత్తుల్లో ఉన్నవారు తమ భూములను సొంతంగా సాగు చేయకుండా కౌలుకు ఇస్తుంటారు.
కానీ ప్రభుత్వ సాయం కౌలురైతులకు అందకుండా.. భూయజమానులకే అందుతుంది. రాష్ట్రంలోని 71.72 లక్షల రైతులకు సంబంధించి 1.42 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇందులో సాగుయోగ్యమైన భూములకు ఎకరాకు ఒక్కో సీజన్‌లో రూ.4 వేల చొప్పున రూ.8 వేల ఆర్థిక సాయం అందుతుంది. దీంతో వాస్తవంగా సాగు చేసే తమకు పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయమ ని కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారు.
14 లక్షల మంది..
రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ తేల్చిన లెక్కల ప్రకారం తెలంగాణలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వారు ఒక్కొక్కరు ఎకరం నుంచి నాలుగైదు ఎకరాల వరకు కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటారు. కానీ కౌలు రైతులకు పెట్టుబడి పథకం వర్తింపజేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. 1956 కౌలుదారు చట్టం ప్రకారం కౌలు రైతులకు హక్కులున్నాయని, వారిని గుర్తించి పెట్టుబడి పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పథకం స్ఫూర్తి దెబ్బతింటుంది!
వ్యవసాయశాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 61.96 శాతం మంది సన్నకారు రైతులే. వారి చేతిలో సరాసరి ఎకరా నుంచి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇక 23.9 శాతం ఉన్న చిన్నకారు రైతుల చేతిలో రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకు భూమి ఉంది. అంటే రాష్ట్రంలో ఉన్న 85.86 శాతం మంది సన్న, చిన్నకారు రైతుల చేతిలో కలిపి 55.45 శాతం భూమి ఉంది. అయితే భూమి తక్కువగా ఉన్న సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు కొందరు కౌలుదారులుగా ఉన్నారు.
ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులు, భూములు సాగు చేయని ధనికులు, వ్యాపారస్తులు, ఇతర రంగాలవారు తమ భూములను కౌలుకు ఇస్తారు. కౌలుదారులే ఆ భూములపై పెట్టుబడి పెట్టి, పంటలు పండిస్తారు. పంట విక్రయించిన అనంతరం భూయజమానికి కౌలు సొమ్ము చెల్లిస్తారు. అంటే వాస్తవంగా పెట్టుబడి సాయం అందాల్సింది కౌలు రైతులకేనని.. సాగు చేయని యజమానులకు ఎందుకని రైతు నేతలు స్పష్టం చేస్తున్నారు. కౌలుదారులకు సాయం ఇవ్వకపోతే పెట్టుబడి పథకం స్ఫూర్తి దెబ్బతింటుందని పేర్కొంటున్నారు.
కౌలుదార్లను గుర్తిస్తేనే సాధ్యం
తమ వద్ద పంట రుణాలు తీసుకునే రైతుల ఆధారంగా బ్యాంకర్లు కౌలు రైతుల సంఖ్యను 14 లక్షలుగా గుర్తించారు. కానీ ప్రభుత్వం కౌలుదారుల చట్టం మేరకు కౌలు రైతులను గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడే పెట్టుబడి సాయం అందించడానికి వీలవుతుంది. దీంతో ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కోరారు.
కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘోరంగా దెబ్బతినాల్సి వస్తుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment