ఖాళీగా ఉన్న రొయ్యల చెరువు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వ్యాపారులు సిండికేట్‌గా మారి రొయ్యల ధరలు భారీగా తగ్గించారు. ఒక్కో రైతుకు కేజీ రూ.50 నుంచి రూ.70 వరకు నష్టపోయారు. దీంతో రెండో పంట సాగుకు వెనుకాడుతున్నారు. దీంతో తీర ప్రాంతంలోని 11 మండలాల పరిధిలో 30 వేల ఎకరాల్లో 25 వేల ఎకరాల చెరువులు బీళ్లుగా మారాయి. ఇక కౌలు రైతులకు మరింత నష్టం వాటిల్లుతోంది. దీంతో వారు రెండో పంటకు రొయ్యల సాగుజోలికి వెళ్లడం లేదు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లా పరిధిలో వేటపాలెం, కొత్తపట్నం, ఒంగోలు రూరల్, సింగరాయకొండ, టంగుటూరు, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, నాగులుప్పలపాడు, జరుగుమల్లి మండలాల్లో అధికారికంగా 27 వేల ఎకరాలు, అనధికారికంగా 30 వేల ఎకరాల్లో వేలాది మంది రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. వానాకాలం పంటలు దాదాపు పూర్తిగా రొయ్యల చెరువులు సాగయ్యాయి. అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారి రొయ్యల ధరలు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక కేజీ 100 కౌంట్ రొయ్యల సాగుకు రైతులు..ఒక ఎకరాలో లక్ష సీడ్‌కు రూ.30 వేలు, ఒకటిన్నర ఫీడ్‌కు రూ.లక్షా10 వేలు, కరెంటు బిల్లు మూడు నెలలకు రూ.36 వేలు, ఫీల్డు బాయ్‌కి రూ.15 వేలు, కెమికల్స్ అండ్ మినరల్స్‌కు రూ.30 వేలు చొప్పున రూ.2లక్షల 20 వేలు ఖర్చు చేశారు.
ఇక ఒక పంటకి కౌలు రైతు కౌలు కింద రూ.25 వేలు వెచ్చించారు. ఈ లెక్కన ఎకరాకు రైతుకు పెట్టుబడి రూ.2.45 లక్షలు అయ్యింది. ఒక కేజీ రొయ్య ఉత్పత్తికి రైతుకు రూ.245లు ఖర్చు కాగా 100 కౌంట్ రొయ్య కేవలం రూ.175లకు అమ్ముడు పోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట కొద్దో గొప్పో వచ్చిన వారి పరిస్థితి ఇలా ఉంటే రొయ్యలు చనిపోయి చెరువులు పూర్తిగా నష్టపోయిన వారూ ఉన్నారు. మొత్తంగా మొదటి పంటలో దాదాపుగా రైతులందరూ తీవ్ర స్థాయిలో నష్టాలు చవి చూశారు. ఇదే ధరలకు రొయ్య రైతులు మరింతగా నష్టపోవాల్సిందే. దీంతో బెంబేలెత్తిన రైతులు వర్షాకాలం పంట సాగుకు విముఖత చూపడంతో 30 వేల ఎకరాల సాగులో దాదాపు 20 వేల ఎకరాల్లో రొయ్యల సాగు నిలిచి పోయింది. చెరువులన్నీ బీళ్లుగా మారాయి.
రెండో పంట సాగు చేసి మరింత నష్టాలు పాలు కావడం ఇష్టం లేక చాలా మంది రైతులు సాగుకు దూరమయ్యారు. రొయ్య రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర మత్స్యశాఖ, కేంద్ర పరిధిలోని ఆక్వా అథారిటీ ఆఫ్ ఇండియాలు తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోయాయి. రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాల్సిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఉష్ణోగ్రతల తీవ్రతల కారణంగా జిల్లాలో రెండో పంట రొయ్యసాగు తగ్గుతోందని అధికారులు పేర్కొంటుండడం విడ్డూరంగా ఉంది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ప్రారంభం సమయంలో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని కొందరు రైతులు పేర్కొంటున్నారు. వర్షాలు వచ్చిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గి రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటాయన్నది వారి అభిప్రాయం.
వాస్తవానికి 15 నుంచి 28 శాతం నీటిలో ఉప్పు ఉంటే రొయ్యల ఎదుగుదల ఉంటుంది. అయితే ప్రస్తుతం రెండో పంట ప్రారంభంలో ముందస్తు వర్షాలు కురవక పోవడంతో సముద్రపు నీటితో ఉన్న బకింగ్ హామ్ కెనాల్‌తో పాటు క్రీకులు, కాలువల్లో నీరు నిల్వ ఉండడం వల్ల ఉప్పు శాతం 38 శాతం నుంచి ప్రాంతాలను బట్టి 50 శాతం వరకు ఉంది. ఈ సమయంలో రొయ్యల సాగు కొంత ఇబ్బందికరమే. అయితే వర్షం కురిస్తే క్రీకులు కాలువల నీరు సముద్రంలో కలిసిపోయి కొత్త నీరు నిల్వ ఉంటుంది. అప్పుడు ఉప్పు శాతం తగ్గుతుంది. రెండో పంట సమయంలో ఇది సర్వ సాధారణమని రైతులు పేర్కొంటున్నారు. వాస్తవానికి రొయ్య ధరలు పతనం కావడం వల్లే రైతులు రెండో పంటకు మొగ్గు చూపడం లేదన్నది రైతుల వాదన. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు గిట్టుబాటు అయ్యేలా ధరలు పెంచి రొయ్యల సాగు యధావిధిగా కొనసాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment