prawns business
-
‘బ్రౌన్’ హంగామా!
సాక్షి, విశాఖపట్నం: మత్స్యకారుల వలకు రొయ్యలు ఆశాజనకంగా చిక్కుతున్నాయి. వీటిలో బ్రౌన్ రకం రొయ్యలు అధికంగా ఉంటున్నాయి. గతేడాది కంటే ఇటీవల రొయ్యల లభ్యత బాగుండడంతో మత్స్యకారుల మోములు వికసిస్తున్నాయి. మత్స్యకారులు సాధారణంగా 10–15 రోజుల పాటు రొయ్యల వేట సాగిస్తుంటారు. రొయ్యల కోసం బోటులో సముద్రంలో దూరంగా వెళ్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే రొయ్యలు లభ్యమవుతున్నాయి. దీంతో నాలుగైదు రోజులకే ఒక్కో బోటుకు అర టన్ను నుంచి టన్ను వరకు దొరుకుతున్నాయి. దీంతో వేట సమయాన్ని నాలుగైదు రోజులకే కుదించుకుని హార్బర్‌కు చేరుకుంటున్నారు. దీనివల్ల రొయ్యలు తాజాగా ఉంటూ మంచి ధర కూడా లభిస్తోంది. అదే పది రోజులకు పైగా వేట కొనసాగిస్తే వలకు చిక్కిన రొయ్యలను ఐస్‌లో రోజుల తరబడి బోట్లలోనే నిల్వ ఉంచాల్సి వస్తోంది. దీనివల్ల రొయ్యల రంగు మారిపోయి, తాజాదనం కోల్పోయి తక్కువ ధర పలుకుతోంది. ఇది మత్స్యకారులకు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో రొయ్యలు పుష్కలంగా లభిస్తున్నందున తక్కువ రోజుల వేటకే మొగ్గు చూపుతున్నారు. విరివిగా బ్రౌన్ రొయ్యలు కొన్నాళ్లుగా లభిస్తున్న రొయ్యల్లో బ్రౌన్ రకం రొయ్యలే అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం వీటికి కిలో రూ.350 ధర పలుకుతోంది. ఎగుమతి చేసే రొయ్యల తలలు తీసివేస్తారు. వీటిని హెడ్‌లెస్ ష్రింప్గా పేర్కొంటారు. వీటికి కిలోపై రూ.100 వరకు ధర అధికంగా ఉంటుంది. గత సంవత్సరం ఈ సీజనులో వీటి ధర ఒకింత బాగున్నా తక్కువగా లభ్యమయ్యేవి. కానీ ఈ సీజనులో ఇవి విరివిగా దొరుకుతుండడంతో ఊరటనిస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో రొయ్యలు, చేపలను బాస్కెట్ల లెక్కన కొనుగోలు చేస్తుంటారు. రొయ్యల్లో టైగర్, ఫ్లవర్, గోల్డ్/వైట్, బ్రౌన్/పింక్ తదితర రకాలుంటాయి. ప్రస్తుతం కిలో టైగర్ రొయ్యలు రూ.1,100, ఫ్లవర్ రకం రూ.500, గోల్డ్/వైట్ రూ.300, బ్రౌన్ రకం రూ.350 చొప్పున ధర పలుకుతోంది. రొయ్యల కొనుగోలుదారులు, ఎగుమతిదారులు ఆశించినంతగా వీటిని కొనుగోలు చేయకపోయినా స్థానికంగానే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 70 శాతానికి పైగా బోట్లు సమీపంలోనే రొయ్యల వేట సాగిస్తున్నారని, దీంతో నాలుగైదు రోజులకే తీరానికి చేరుకుంటున్నారని వైశాఖి డాల్ఫిన్ బోట్ ఆపరేటర్ల సంక్షేమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సూరాడ సత్తిబాబు ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల రొయ్యలు తాజాగా ఉండడంతో స్థానికంగా విక్రయాలు బాగా జరుగుతున్నాయని తెలిపారు. -
చేపలు సరే.. రొయ్యల జాడేది ?
పాల్వంచరూరల్ : మత్స్యసంపద పెంపుతో పాటు మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆయా సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. అయితే చేపల కంటే రొయ్యల పెంపకంతో అత్యధిక లాభాలు గడించవచ్చనే ఉద్దేశంతో ఆ పిల్లలను కూడా పెంచాలని నిర్ణయించింది. రొయ్యలకు ధర, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో గణనీయమైన ఆదాయం వస్తుందని మత్స్యకారులు కూడా ఆనందపడ్డారు. అయితే ఈనెల 26 నుంచి చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తుండగా.. రొయ్య పిల్లల జాడే లేకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మత్స్యసిరి పెంచేలా.. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధితో పాటు మత్స్య సంపదను పెంచేందుకు 2016 – 17 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను పెంచుతోంది. వంద శాతం సబ్సిడీపై రెండు రకాల చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. చేపలను పట్టడం, విక్రయించడం, రవాణాకు అవసరమైన పరికరాలు, ద్విచక్ర వాహనాలు కూడా మత్స్యకారులకు సబ్సిడీపై అందిస్తోంది. జిల్లాలో 734 చెరువులు, 3 జలాశయాల్లో ఈ ఏడాది 1.77 కోట్ల చేప పిల్లలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న మత్స్యశాఖ.. ఇందుకు అనుగుణంగా చేప పిల్లల పంపిణీకి ఈనెల 26న శ్రీకారం చుట్టనుంది. మంచినీటి చెరువుల్లో రొయ్యలు.. జిల్లాలోని 14 మంచినీటి చెరువుల్లో ఈ సంవత్సరం రొయ్యలు కూడా పెంచాలని మత్స్యశాఖ అధికారులు నిర్ణయించారు. గతేడాది సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో 1.38 లక్షలు, బూర్గంపాడు మండలం నకిరపేట చెరువులో 38 వేల రొయ్యల ఉత్పత్తి కోసం మత్స్య పారిశ్రామిక సొసైటీలకు రూ.6 లక్షలు మంజూరు చేశారు. గతేడాది రొయ్యల ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది వాటి ఉత్పత్తిని మరింతగా పెంచాలని నిర్ణయించారు. బూర్గంపాడు, అశ్వాపురం, అశ్వారావుపేట, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, సుజాతనగర్, చండ్రుగొండ, చర్ల, మణుగూరు మండలాల్లో వీటిని ఉత్పత్తి చెయ్యాలని భావించారు. అయితే ఈ ససంవత్సరం రొయ్యల ఉత్పత్తిపై మత్స్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఇటు మత్స్య పారిశ్రామిక సొసైటీ సభ్యులు, అటు అధికారులు ఎదురుచూస్తున్నారు. రొయ్య ల పంపిణీలో ఇంకా జాప్యం జరిగితే ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఐదు నెలల్లో దిగుబడి.. రొయ్యల్లో రెండు రకాలు ఉంటాయి. ఇందులో ఉప్పునీటిలో పెరిగే రొయ్యలు (టైగర్ రొయ్యలు), మంచినీటిలో పెరిగే రొయ్యలు ఉన్నాయి. జిల్లా వాతావరణ పరిస్థితులకు మంచినీటి రొయ్యలే అనుకూలంగా ఉండడంతో ఆ రకాలనే పెంచాలని అధికారులు నిర్ణయించారు. రొయ్య పిల్లలు చెరువుల్లో పోసిన ఐదు నెలలకు సరైన దిగుబడి వస్తుంది. ఈ రొయ్యలను మత్స్య సొసైటీ సభ్యులు విక్రయించుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ రూ.300 ఉండగా, డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 14 చెరువులకు పంపిణీ చేస్తాం జిల్లాలో రొయ్యల ఉత్పత్తి పెంపునకు 14 చెరువుల్లో 20, 84, 250 రొయ్య పిల్ల లను పంపిణీ చేయాలని ప్రతిపాదనలు పంపించాం. అన్నపురెడ్డిపల్లి మండలం ఆనందవనం ప్రాజెక్టు, అశ్వాపురంలోని తుమ్మల చెరువు, అశ్వారావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టు, అంకమ్మచెరువు, బూర్గంపాడు మండలం దోమలవాగు ప్రాజెక్టు, చండ్రుగొండలోని వెంగళరావుసాగర్ ప్రాజెక్టు, చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు, జూలూరుపాడులో ఎర్రవాగు ప్రాజెక్టు, మణుగూరులో పెద్దచెరువు, పేరంటాల చెరువు, సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువు, టేకులపల్లిలోని పరకలవాగు, ఇల్లెందు మండలం రాఘబోయినగూడెం, సుదిమళ్ల చెరువుల్లో రొయ్యలు పెంచాలని నిర్ణయించాం. అయితే దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – వీరన్న, జిల్లా మత్స్యశాఖాధికారి -
రొయ్య సాగెలా..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వ్యాపారులు సిండికేట్‌గా మారి రొయ్యల ధరలు భారీగా తగ్గించారు. ఒక్కో రైతుకు కేజీ రూ.50 నుంచి రూ.70 వరకు నష్టపోయారు. దీంతో రెండో పంట సాగుకు వెనుకాడుతున్నారు. దీంతో తీర ప్రాంతంలోని 11 మండలాల పరిధిలో 30 వేల ఎకరాల్లో 25 వేల ఎకరాల చెరువులు బీళ్లుగా మారాయి. ఇక కౌలు రైతులకు మరింత నష్టం వాటిల్లుతోంది. దీంతో వారు రెండో పంటకు రొయ్యల సాగుజోలికి వెళ్లడం లేదు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లా పరిధిలో వేటపాలెం, కొత్తపట్నం, ఒంగోలు రూరల్, సింగరాయకొండ, టంగుటూరు, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, నాగులుప్పలపాడు, జరుగుమల్లి మండలాల్లో అధికారికంగా 27 వేల ఎకరాలు, అనధికారికంగా 30 వేల ఎకరాల్లో వేలాది మంది రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. వానాకాలం పంటలు దాదాపు పూర్తిగా రొయ్యల చెరువులు సాగయ్యాయి. అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారి రొయ్యల ధరలు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక కేజీ 100 కౌంట్ రొయ్యల సాగుకు రైతులు..ఒక ఎకరాలో లక్ష సీడ్‌కు రూ.30 వేలు, ఒకటిన్నర ఫీడ్‌కు రూ.లక్షా10 వేలు, కరెంటు బిల్లు మూడు నెలలకు రూ.36 వేలు, ఫీల్డు బాయ్‌కి రూ.15 వేలు, కెమికల్స్ అండ్ మినరల్స్‌కు రూ.30 వేలు చొప్పున రూ.2లక్షల 20 వేలు ఖర్చు చేశారు. ఇక ఒక పంటకి కౌలు రైతు కౌలు కింద రూ.25 వేలు వెచ్చించారు. ఈ లెక్కన ఎకరాకు రైతుకు పెట్టుబడి రూ.2.45 లక్షలు అయ్యింది. ఒక కేజీ రొయ్య ఉత్పత్తికి రైతుకు రూ.245లు ఖర్చు కాగా 100 కౌంట్ రొయ్య కేవలం రూ.175లకు అమ్ముడు పోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట కొద్దో గొప్పో వచ్చిన వారి పరిస్థితి ఇలా ఉంటే రొయ్యలు చనిపోయి చెరువులు పూర్తిగా నష్టపోయిన వారూ ఉన్నారు. మొత్తంగా మొదటి పంటలో దాదాపుగా రైతులందరూ తీవ్ర స్థాయిలో నష్టాలు చవి చూశారు. ఇదే ధరలకు రొయ్య రైతులు మరింతగా నష్టపోవాల్సిందే. దీంతో బెంబేలెత్తిన రైతులు వర్షాకాలం పంట సాగుకు విముఖత చూపడంతో 30 వేల ఎకరాల సాగులో దాదాపు 20 వేల ఎకరాల్లో రొయ్యల సాగు నిలిచి పోయింది. చెరువులన్నీ బీళ్లుగా మారాయి. రెండో పంట సాగు చేసి మరింత నష్టాలు పాలు కావడం ఇష్టం లేక చాలా మంది రైతులు సాగుకు దూరమయ్యారు. రొయ్య రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర మత్స్యశాఖ, కేంద్ర పరిధిలోని ఆక్వా అథారిటీ ఆఫ్ ఇండియాలు తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోయాయి. రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాల్సిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఉష్ణోగ్రతల తీవ్రతల కారణంగా జిల్లాలో రెండో పంట రొయ్యసాగు తగ్గుతోందని అధికారులు పేర్కొంటుండడం విడ్డూరంగా ఉంది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ప్రారంభం సమయంలో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని కొందరు రైతులు పేర్కొంటున్నారు. వర్షాలు వచ్చిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గి రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటాయన్నది వారి అభిప్రాయం. వాస్తవానికి 15 నుంచి 28 శాతం నీటిలో ఉప్పు ఉంటే రొయ్యల ఎదుగుదల ఉంటుంది. అయితే ప్రస్తుతం రెండో పంట ప్రారంభంలో ముందస్తు వర్షాలు కురవక పోవడంతో సముద్రపు నీటితో ఉన్న బకింగ్ హామ్ కెనాల్‌తో పాటు క్రీకులు, కాలువల్లో నీరు నిల్వ ఉండడం వల్ల ఉప్పు శాతం 38 శాతం నుంచి ప్రాంతాలను బట్టి 50 శాతం వరకు ఉంది. ఈ సమయంలో రొయ్యల సాగు కొంత ఇబ్బందికరమే. అయితే వర్షం కురిస్తే క్రీకులు కాలువల నీరు సముద్రంలో కలిసిపోయి కొత్త నీరు నిల్వ ఉంటుంది. అప్పుడు ఉప్పు శాతం తగ్గుతుంది. రెండో పంట సమయంలో ఇది సర్వ సాధారణమని రైతులు పేర్కొంటున్నారు. వాస్తవానికి రొయ్య ధరలు పతనం కావడం వల్లే రైతులు రెండో పంటకు మొగ్గు చూపడం లేదన్నది రైతుల వాదన. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు గిట్టుబాటు అయ్యేలా ధరలు పెంచి రొయ్యల సాగు యధావిధిగా కొనసాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
ఉపాధికి వేదిక... ఆక్వాకల్చర్
అప్‌కమింగ్ కెరీర్: ఆక్వా కల్చర్ అంటే కేవలం చేపలు, రొయ్యల పెంపకమే కాదు. ఔషధాల తయారీకి ఉపయోగించే ఒకరకమైన నాచును, మొక్కలను చెరువుల్లో పెంచడాన్ని కూడా ఆక్వాకల్చర్గా పరిగణిస్తున్నారు. చేపలు, రొయ్యల సాగును కెరీర్‌గా ఎంచుకుంటే మెరుగైన భవిష్యత్తుకు, ఆకర్షణీయమైన ఆదాయానికి ఢోకా ఉండదని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ రైతులతోపాటు ఉన్నత చదువులు చదువుకున్న ఆధునిక యువత సైతం ఇటీవల ఆక్వా రంగంలోకి ప్రవేశించి, విజయవంతంగా ముందుకు సాగుతుండడం గమనార్హం. అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత ఏదైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్(బీఎఫ్ఎస్)లో ప్రవేశం పొందొచ్చు. వేతనాలు: పనిచేస్తున్న సంస్థ పరిధిని బట్టి వేతనాలు మారుతుంటాయి. సాధారణంగా ఆక్వా నిపుణులకు ప్రారంభంలో నెలకు రూ.20 వేల దాకా వేతనం లభిస్తుంది. ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో పోలిస్తే ఆక్వా రంగంలో అధిక ఆదాయం ఉంటుంది. ఆక్వాకల్చర్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు 1. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్-ముంబై వెబ్సైట్: http://www.cife.edu.in/ 2. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్-భువనేశ్వర్ వెబ్సైట్: http://www.cifa.in/web/ 3. రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్-తమిళనాడు వెబ్సైట్: http://www.rgca.org.in/ 4. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్-కేరళ వెబ్సైట్: http://www.kufos.ac.in/ 5. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.ignou.ac.in/ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు ‘‘అగ్రికల్చర్, అక్వాకల్చర్ వంటి కోర్సులు చేసిన వారికి ఉద్యోగాల పరంగా ఢోకా ఉండదు. ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగింది. బహుళ జాతి కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అక్వాకల్చర్ కోర్సును పూర్తిచేసి.. సబ్జెక్టుపై ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచుకుంటే నెలకు రూ.40 వేలకు తక్కువ కాకుండా వేతనం సంపాదించే వీలుంది. ప్రభుత్వ రంగంలోనూ మంచి అవకాశాలున్నాయి’’. - పి.హరి, మత్స్యశాఖ ఉద్యోగి, ముంబై