పాల్వంచరూరల్ : మత్స్యసంపద పెంపుతో పాటు మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆయా సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. అయితే చేపల కంటే రొయ్యల పెంపకంతో అత్యధిక లాభాలు గడించవచ్చనే ఉద్దేశంతో ఆ పిల్లలను కూడా పెంచాలని నిర్ణయించింది. రొయ్యలకు ధర, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో గణనీయమైన ఆదాయం వస్తుందని మత్స్యకారులు కూడా ఆనందపడ్డారు. అయితే ఈనెల 26 నుంచి చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తుండగా.. రొయ్య పిల్లల జాడే లేకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
మత్స్యసిరి పెంచేలా..
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధితో పాటు మత్స్య సంపదను పెంచేందుకు 2016 – 17 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను పెంచుతోంది. వంద శాతం సబ్సిడీపై రెండు రకాల చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. చేపలను పట్టడం, విక్రయించడం, రవాణాకు అవసరమైన పరికరాలు, ద్విచక్ర వాహనాలు కూడా మత్స్యకారులకు సబ్సిడీపై అందిస్తోంది. జిల్లాలో 734 చెరువులు, 3 జలాశయాల్లో ఈ ఏడాది 1.77 కోట్ల చేప పిల్లలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న మత్స్యశాఖ.. ఇందుకు అనుగుణంగా చేప పిల్లల పంపిణీకి ఈనెల 26న శ్రీకారం చుట్టనుంది.
మంచినీటి చెరువుల్లో రొయ్యలు..
జిల్లాలోని 14 మంచినీటి చెరువుల్లో ఈ సంవత్సరం రొయ్యలు కూడా పెంచాలని మత్స్యశాఖ అధికారులు నిర్ణయించారు. గతేడాది సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో 1.38 లక్షలు, బూర్గంపాడు మండలం నకిరపేట చెరువులో 38 వేల రొయ్యల ఉత్పత్తి కోసం మత్స్య పారిశ్రామిక సొసైటీలకు రూ.6 లక్షలు మంజూరు చేశారు. గతేడాది రొయ్యల ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది వాటి ఉత్పత్తిని మరింతగా పెంచాలని నిర్ణయించారు. బూర్గంపాడు, అశ్వాపురం, అశ్వారావుపేట, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, సుజాతనగర్, చండ్రుగొండ, చర్ల, మణుగూరు మండలాల్లో వీటిని ఉత్పత్తి చెయ్యాలని భావించారు. అయితే ఈ ససంవత్సరం రొయ్యల ఉత్పత్తిపై మత్స్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఇటు మత్స్య పారిశ్రామిక సొసైటీ సభ్యులు, అటు అధికారులు ఎదురుచూస్తున్నారు. రొయ్య ల పంపిణీలో ఇంకా జాప్యం జరిగితే ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
ఐదు నెలల్లో దిగుబడి..
రొయ్యల్లో రెండు రకాలు ఉంటాయి. ఇందులో ఉప్పునీటిలో పెరిగే రొయ్యలు (టైగర్ రొయ్యలు), మంచినీటిలో పెరిగే రొయ్యలు ఉన్నాయి. జిల్లా వాతావరణ పరిస్థితులకు మంచినీటి రొయ్యలే అనుకూలంగా ఉండడంతో ఆ రకాలనే పెంచాలని అధికారులు నిర్ణయించారు. రొయ్య పిల్లలు చెరువుల్లో పోసిన ఐదు నెలలకు సరైన దిగుబడి వస్తుంది. ఈ రొయ్యలను మత్స్య సొసైటీ సభ్యులు విక్రయించుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ రూ.300 ఉండగా, డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
14 చెరువులకు పంపిణీ చేస్తాం
జిల్లాలో రొయ్యల ఉత్పత్తి పెంపునకు 14 చెరువుల్లో 20, 84, 250 రొయ్య పిల్ల లను పంపిణీ చేయాలని ప్రతిపాదనలు పంపించాం. అన్నపురెడ్డిపల్లి మండలం ఆనందవనం ప్రాజెక్టు, అశ్వాపురంలోని తుమ్మల చెరువు, అశ్వారావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టు, అంకమ్మచెరువు, బూర్గంపాడు మండలం దోమలవాగు ప్రాజెక్టు, చండ్రుగొండలోని వెంగళరావుసాగర్ ప్రాజెక్టు, చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు, జూలూరుపాడులో ఎర్రవాగు ప్రాజెక్టు, మణుగూరులో పెద్దచెరువు, పేరంటాల చెరువు, సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువు, టేకులపల్లిలోని పరకలవాగు, ఇల్లెందు మండలం రాఘబోయినగూడెం, సుదిమళ్ల చెరువుల్లో రొయ్యలు పెంచాలని నిర్ణయించాం. అయితే దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– వీరన్న, జిల్లా మత్స్యశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment