
సీఎం చిత్తరువు.. కౌలు రైతుపై దరువు
రంగు మారిన రుణార్హత కార్డు
ఏలూరు (సెంట్రల్) : రుణమాఫీ హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేకపోరుున చంద్రబాబు సర్కారు కౌలు రైతులను మరింత కుంగదీసే సరికొత్త కార్యక్రమం చేపట్టింది. 2014-15 సంవత్సరానికి సంబంధించి రుణార్హత గుర్తింపు కార్డుల పంపిణీని హఠాత్తుగా నిలిపివేసి హతాశులను చేసింది. ఇప్పటివరకు ఇచ్చిన కార్డులను కూడా హడావుడిగా వెనక్కి తీసుకుంటోంది. కారణమేమిటని ఆరా తీస్తే.. ఆ కార్డులపై చంద్రబాబు ఫొటోను ముద్రించడం కోసమేనని అధికారులు చెబుతున్నారు.
2013-14 సంవత్సరంలో ఇచ్చిన కౌలురైతు గుర్తింపు కార్డుల్లో ఓ వైపు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఫొటోలు ఉండేవి. తాజాగా 2014-15 గుర్తింపు కార్డులను తొలుత ఎవరి ఫొటోలు లేకుండానే ముద్రించి పంపిణీకి శ్రీకారం చుట్టారు. తర్వాత భూ పరిపాలన శాఖ అధికారి ఆదేశాల మేరకు వీటి పంపిణీ నిలిపేశారు. ఇచ్చిన వాటిని కూడా వెనక్కు తీసుకుంటున్నారు. ఎందుకని అడిగితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఫొటోలతో కూడిన కొత్త కార్డులు ముద్రించి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే సుమారు లక్ష మంది వరకు కౌలు రైతులు ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇవి దక్కితే కానీ రుణం దొరకని పరిస్థితి. గతంలో తీసుకున్న రుణాలు ఇప్పటికీ మాఫీ కాలేదు. మరోవైపు కొత్త రుణం పొందలేని దుస్థితిని ప్రభుత్వం కల్పిస్తోంది. దీంతో వ్యవసాయానికి పెట్టుబడులు పుట్టించుకోలేక కౌలు రైతుల పుట్టి మునిగే ప్రమాదం నెలకొంది. కేవలం తమ ఫొటోలతో కూడిన ప్రచార పటాటోపం కోసం కౌలు రైతులు పంట రుణాన్ని సకాలంలో పొందే హక్కును హరించడం సరికాదని రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. గడచిన మూడేళ్ల కాలంలో 300మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ప్రభుత్వం సవ్యంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
రంగుమారింది
నల్లజర్ల రూరల్ : కౌలు రైతులకు వ్యవసాయ పరపతి సౌకర్యం కల్పించే రుణార్హత కార్డులపై ఉండే రంగుల్లో ఒకదానిని ప్రభుత్వం మార్చేసింది. గతంలో ఇచ్చిన కార్డులను రద్దుచేసి రంగు మార్చిన కార్డుల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ కార్డులపై జాతీయత ఉట్టిపడేలా గతంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్ని ముద్రించగా, తాజా కార్డుల్లో కాషాయం రంగును తొలగించారు. దానిస్థానే పసుపు రంగు ముద్రించారు.