రుణమాఫీ కాదు...వాగ్దానాల మాఫీ
చిత్తూరు (టౌన్) : రాష్ట్రప్రభుత్వం తీరు చూస్తుంటే రుణమాఫీ కథ దేవుడెరుగు కానీ.. వాగ్దానాల మాఫీ అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. గురువారం ఆయన జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో కొన్నిం టిని కూడా నెరవేర్చలేదన్నారు. రైతుల వ్యవసాయరుణాల మాఫీతో పాటు డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని అధికారంలోకొచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చలేదని విమర్శించారు.
పింఛన్లను ఏవేవో కుంటిసాకులతో అర్హులకు అందకుండా చేయడం దారుణమన్నారు. జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ల పంపిణీ తప్ప ఇంకేమీ చేయలేదన్నారు. జన్మభూమి కార్యక్రమం జరిగే తేదీల్లో కార్యాలయూలన్నీ అధికారులు లేకుండా బోసిపోయాయన్నారు. దీనిపై తాము తమ నాయకునితో కలిసి అసెంబ్లీలో తీవ్రస్థాయిలో చర్చించనున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులొద్దంటూ కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు.
డీలర్లపై కక్షసాధింపెందుకు ?
రేషన్ షాపు డీలర్లపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తోందని, దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించనున్నామని నారాయణ స్వామి చెప్పా రు. డీలర్లు ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి కమిషన్‌తో ప్రజలకు నిత్యావసరాలను పంపిణీచేసే వారు మాత్రమేనన్నారు. అయితే ప్రభుత్వం డీలర్లపై కక్షగట్టి వారి డీలర్‌షాపులను రద్దుచేస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ కొంతమందిపై పనిగట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారనే నెపంతో 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించారని విమర్శించారు.
ఆమెతోపాటు వీరు కూడా పార్టీ మారివుంటే మంచివాళ్లు, మారకపోతే అవినీతిపరులా అని ఎద్దేవా చేశారు. కార్వేటినగరం మండలంలోని రెండు డీలరు షాపుల రద్దు చెల్లదని హైకోర్టు ఆదేశించినా ఆ ఆదేశాలను అమలు చేయలేని స్థితిలో అధికారులున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ప్రగతి కరుణాకర్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీ దేవి పాల్గొన్నారు.