kalatturu narayana swamy
-
తొలిరోజు 1.24 లక్షల మందికి ప్రికాషన్ డోసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ప్రికాషన్ డోసు పంపిణీకి శ్రీకారం చుట్టింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1,24,609 మందికి వేశారు. వీరిలో 12,128 మంది వృద్ధులు, 36,037 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 76,444 మంది హెల్త్‌కేర్ వర్కర్లు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రభుత్వాసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్లు వేశారు. రెండో డోసు వేసుకుని 9 నెలలు (39 వారాలు) పూర్తయిన వారికి వేశారు. ప్రికాషన్ డోస్ వేసుకున్న డిప్యూటీ సీఎం పుత్తూరు రూరల్: కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి కోరారు. ప్రభుత్వం సోమవారం నుంచి ప్రికాషన్ డోస్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో తొలిరోజే డిప్యూటీ సీఎం ప్రికాషన్ డోస్‌ను తన ఇంటి వద్ద వేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకొని 90 రోజులు పూర్తయిన వారు, 60 ఏళ్లు నిండిన వారు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
‘చంద్రబాబూ నీ బుద్ధి మార్చుకో’
సాక్షి, పెనుమూరు(చిత్తూరు) : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని శుక్రవారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి మొక్కు తీర్చుకున్నారు. పెనుమూరు మండలంలోని పర్యాటక కేంద్రమైన పులిగుండు వద్ద పులిగుంటీశ్వరునికి తలనీలాలు సమర్పించారు. పులిగుండు ఎక్కి దేవతలను దర్శించుకున్నారు. 2015 జనవరి 17వ తేదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామి చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డితో కలిసి సుమారు 1,200 అడుగులు ఎత్తున్న పులిగుండు ఎక్కారు. వైఎస్ జగ,న్మోహన్రెడ్డి సీఎం అయితే తిరిగి పులిగుండు ఎక్కుతానని, పులిగుంటీశ్వరస్వామికి తలనీలాలు సమర్పిస్తానని అప్పట్లో మొక్కుకున్నారు. శుక్రవారం ఉదయం చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి సమక్షంలో పులిగుంటీశ్వరస్వామికి తలనీలాలు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పులిగుండు ఎక్కి దేవతామూర్తులను దర్శించుకున్నారు. చంద్రబాబూ నీ బుద్ధి మార్చుకో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చుకోవాలని, అబద్ధాలు చెప్పడం మానాలని నారాయణస్వామి చెప్పారు. పులిగుండు వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబుతో పాటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు పెట్టించారన్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 150 అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఒక్క అక్రమ కేసు పెట్టలేదన్నారు. తమ ప్రభుత్వంలో ఒక్క తప్పుడు కేసుపెట్టినట్లు చెప్పినా నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామన్నారు. కార్వేటినగరం మాజీ ఎంపీపీ జనార్థనరాజు, అతని అనుచరులు తప్పతాగి కారులో తలకోనకు వెళుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని, ఈ విషయం పోలీసుల దృష్టికి వస్తే వారు మానవతా దృక్పథంతో నిందితులపై కేసు నమోదు చేశారని తెలిపారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు గురువారం చంద్రబాబునాయుడును కలిస్తే ఆయన తమ పార్టీ నేతలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందడం మంచి పద్ధతి కాదని, ఆ వీడియోను ఒక్కసారి చంద్రబాబు చూడాలని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గాంధీ జయంతి రోజు మద్యం విక్రయాలు జరగలేదన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజున మద్యం విక్రయాలు జరిగాయని చెప్పడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంసీ విజయానందరెడ్డి, మండల కన్వీనర్లు సురేష్‌రెడ్డి(పెనుమూరు), పేట ధనుంజయరెడ్డి(వెదురుకుప్పం) తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీ కాదు...వాగ్దానాల మాఫీ
చిత్తూరు (టౌన్) : రాష్ట్రప్రభుత్వం తీరు చూస్తుంటే రుణమాఫీ కథ దేవుడెరుగు కానీ.. వాగ్దానాల మాఫీ అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. గురువారం ఆయన జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో కొన్నిం టిని కూడా నెరవేర్చలేదన్నారు. రైతుల వ్యవసాయరుణాల మాఫీతో పాటు డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని అధికారంలోకొచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. పింఛన్లను ఏవేవో కుంటిసాకులతో అర్హులకు అందకుండా చేయడం దారుణమన్నారు. జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ల పంపిణీ తప్ప ఇంకేమీ చేయలేదన్నారు. జన్మభూమి కార్యక్రమం జరిగే తేదీల్లో కార్యాలయూలన్నీ అధికారులు లేకుండా బోసిపోయాయన్నారు. దీనిపై తాము తమ నాయకునితో కలిసి అసెంబ్లీలో తీవ్రస్థాయిలో చర్చించనున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులొద్దంటూ కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు. డీలర్లపై కక్షసాధింపెందుకు ? రేషన్ షాపు డీలర్లపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తోందని, దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించనున్నామని నారాయణ స్వామి చెప్పా రు. డీలర్లు ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి కమిషన్‌తో ప్రజలకు నిత్యావసరాలను పంపిణీచేసే వారు మాత్రమేనన్నారు. అయితే ప్రభుత్వం డీలర్లపై కక్షగట్టి వారి డీలర్‌షాపులను రద్దుచేస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ కొంతమందిపై పనిగట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారనే నెపంతో 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించారని విమర్శించారు. ఆమెతోపాటు వీరు కూడా పార్టీ మారివుంటే మంచివాళ్లు, మారకపోతే అవినీతిపరులా అని ఎద్దేవా చేశారు. కార్వేటినగరం మండలంలోని రెండు డీలరు షాపుల రద్దు చెల్లదని హైకోర్టు ఆదేశించినా ఆ ఆదేశాలను అమలు చేయలేని స్థితిలో అధికారులున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ప్రగతి కరుణాకర్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీ దేవి పాల్గొన్నారు.