దేశం విడిచి వెళ్తాం! | Ww will go from this nation | Sakshi
Sakshi News home page

దేశం విడిచి వెళ్తాం!

Published Fri, Apr 1 2016 4:18 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

దేశం విడిచి వెళ్తాం! - Sakshi

దేశం విడిచి వెళ్తాం!

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బీటీ కాటన్ పత్తి విత్తనం రాయల్టీని గణనీయంగా తగ్గించడంపై బహుళజాతి కంపెనీ మోన్‌శాంటో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. దేశం విడిచి వెళ్తానని బెదిరిస్తోంది. దీంతో మోన్‌శాంటో అనుకూల, వ్యతిరేక వర్గాల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మోన్‌శాంటో వెళ్లిపోతే వచ్చే నష్టమేమీ లేదని, ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉందని ఆ కంపెనీని వ్యతిరేకిస్తున్న వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మోన్‌శాంటో గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ కేంద్రం బీటీ కాటన్ విత్తన ధరలను, రాయల్టీని తగ్గించిన సంగతి తెలిసిందే.

బీటీ-1 పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.635, బీటీ-2 విత్తనాల ధర రూ.800గా నిర్ధారించింది. దీనివల్ల తెలంగాణలో బీటీ-1 పత్తి విత్తనాల ధర గతం కంటే రూ.195, బీటీ-2 విత్తనాల ధర రూ.130 మేర తగ్గనుంది. అలాగే బీటీ-1 పత్తి విత్తన రాయల్టీని కేంద్రం రద్దు చే సింది. బీటీ టెక్నాలజీ కలిగిన ఇతర కంపెనీలకూ పత్తి విత్తన వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించింది. అందుకు మార్గదర్శకాల ముసాయిదా, లెసైన్సింగ్  నమూనాను ఇప్పటికే వెల్లడించింది. ఈ చర్యలు మోన్‌శాంటోకు మింగుడు పడలేదు. ఈ నిర్ణయాలను మరోసారి పరిశీలించాలని, లేదంటే దేశం విడిచి వెళ్లిపోతానని బె దిరిస్తోంది. అయితే ఆ కంపెనీవి బెదిరింపులు మాత్రమేనని, భారత్‌లో మార్కెట్‌ను అది వదులుకోదని కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వెళ్లిపోయినా నష్టమేమీ లేదని పేర్కొంటున్నాయి.

 దేశం వదిలి వెళ్తే మంచిదే..
 మోన్‌శాంటో దేశం విడిచిపోతే పీడ పోయినట్లేనని ఇతర విత్తన కంపెనీలు, వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. బీటీ కాటన్ వల్ల దేశంలో రైతు లు పెద్ద ఎత్తున నష్టపోయారని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీటీ-2 పత్తి విత్తనం వేసిన  చోట పంటకు గులాబీ రంగు పురుగు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక అయితే విత్తన కంపెనీ నుంచి రూ.2 వేల కోట్ల పరిహారం కోరుతోంది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిరసనలు, ధరల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏం చేయాలో అర్థంకాక మోన్‌శాంటో దేశం విడిచి వెళ్తానంటూ బెదిరిస్తోందని అంటున్నారు.
 
  ప్రత్యామ్నాయాలపై కసరత్తు
 మోన్‌శాంటోకు ప్రత్యామ్నాయంగా దేశంలోని పలు విత్తన కంపెనీలు బీటీ-3 పత్తి విత్తనాన్ని తీసుకు రావాలని నిర్ణయించాయి. నాగపూర్‌లోని కేంద్ర పత్తి పరిశోధన సంస్థ(సీఐసీఆర్) ప్రత్యామ్నాయ విత్తనంపై పరిశోధన చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్వర్ణభార త్ బయోటెక్నిక్స్ సంస్థ కూడా బీటీ పత్తి విత్తనంపై దృష్టిసారించింది. అయితే బీటీ కాటన్‌కు బదులు నాన్-బీటీ పత్తి విత్తనాన్ని ముందుకు తీసుకురావాలని మరికొందరు వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.

దేశంలో పత్తి 70 శాతం వర్షాధార ప్రాంతాల్లోనే సాగవుతుందని, బీటీ విత్తనం ఆ నేలలకు సరిపోదని అంటున్నారు. అందుకు బీటీయేతర పత్తే సరైన ప్రత్యామ్నాయం అని స్పష్టంచేస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సీఎస్‌ఏ) ఆధ్వర్యంలో రైతులను సహకార సంఘంగా ఏర్పాటు చేసి తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్‌తోపాటు మహారాష్ట్రలోని యావత్‌మాల్, వార్దాల్లో 3 వేల ఎకరాల్లో నాన్-బీటీ పత్తిని సాగు చేయిస్తున్నారు. మోన్‌శాంటో బెదిరింపుల నేపథ్యంలో దేశంలో బీటీ విత్తనాన్ని కొనసాగించాలా? లేదంటే నాన్-బీటీ విత్తనాన్ని ప్రోత్సహించాలా? అన్న చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement