సాక్షి, హైదరాబాద్: బీజీ–3 పత్తి విత్తనంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. అనుమతి లేకుండా విక్రయిస్తున్న ఈ విత్తనాన్ని నిలిపివేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాసింది. బీజీ–1, బీజీ–2 పత్తి విత్తనాలు దేశంలో విఫలమయ్యాయి. దీంతో మోన్‌శాంటో బీజీ–3 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే జీవవైవిధ్యానికి ఇది హానికరంగా మారడంతో దీనికి కేంద్రం ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు.
అయినా అనేక అక్రమ మార్గాల్లో పత్తి విత్తన కంపెనీలు బీజీ–3 విత్తనాన్ని మార్కెట్లోకి తెచ్చి రైతులకు అంటగట్టాయి. రాష్ట్రంలో పత్తి 47.72 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే.. అందులో బీజీ–3 విత్తనమే 20 శాతం వరకు ఉండటం గమనార్హం. దీంతో వచ్చే ఏడాది ఈ విత్తనం రైతులకు చేరకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ ఆదేశాలిచ్చింది. కాగా, బీజీ–3 పత్తి విత్తనాలు విక్రయించే వారిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ పీడీ యాక్టు కింద 5 క్రిమినల్ కేసులు పెట్టింది. ఏడు కంపెనీల లైసెన్సులు రద్దు చేసింది.
జీవ వైవిధ్యానికి ముప్పు ఇలా..
మోన్‌శాంటో కంపెనీ రౌండ్ అప్ రెడీ ప్లెక్స్(ఆర్‌ఆర్‌ఎఫ్) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. మహికో కంపెనీ ఆర్‌ఆర్‌ఎఫ్ కారకం గల బీటీ–3 పత్తి రకాలను రైతు క్షేత్రాల్లో ప్రయోగాత్మక పరిశీలనలు జరిపినట్లు సమాచారం. ఇప్పుడది పత్తి పంటలో ఉంది. ఇది ఇతర పత్తి రకాలను కలుషితం చేస్తూ జీవ వనరులను దెబ్బతీసేలా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పత్తి చేలల్లో బీజీ–3 ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.
అలాగే ‘గ్లైసెల్’ పురుగుమందును తేయాకు తోటల్లో వేయడానికే దేశంలో అనుమతి ఉంది. ఇతర పంటలకు వాడకూడదు. కానీ బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఈ మందునే వాడాల్సి ఉంది. గ్లైసెల్ పురుగుమందును బీజీ–3 పత్తికి వేస్తే.. పక్కనున్న ఇతర పంటలపైనా ప్రభావం చూపుతుంది. అవి విషపూరితమవుతాయి. వాటిని తింటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. జీవవైవిధ్యానికి ముప్పుతోపాటు వాతావరణం కలుషితమవుతుందని నిపుణులు చెబుతున్నారు.బీజీ–3 పత్తి విత్తనాన్ని నిలుపుదల చేయాలని అన్ని రాష్ట్రాలకు లేఖ రాశామని, జీవ వైవిధ్యానికి చేటుగా పరిణమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి బి.రాజేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment