అనంతపురం అగ్రికల్చర్ : అందర్-బాహర్ జూదంలా తయారైన వేరుశనగ పంట స్థానంలో చిరుధాన్యపు, పప్పుదినుసుల పంటల సాగు విస్తీర్ణం పెరిగితే తప్ప వ్యవసాయం లాభసాటి అయ్యే పరిస్థితి లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ తరహా వ్యవసాయ పద్ధతులు సాగులోకి రావాలంటే ప్రజల ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. అనంతపురం రైతు బజార్ ప్రాంగణంలో జరుగుతున్న రాయలసీమ పంటలు-వంటల పండుగ రెండో రోజు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నిర్వహణ కమిటీ చైర్మన్, ఏఎఫ్ ఎకాలజీ డెరైక్టర్ డాక్టర్ వై.వి.మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం హాజరై స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. కొన్ని రకాల వంటకాలను రుచి చూశారు.
ప్రజాపంపిణీలో మార్పులు
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ... వ్యవసాయ పరంగా దేశం, రాష్ట్రం అగ్రస్థానాల్లో కొనసాగుతున్నా ప్రజల ఆహారపు అలవాట్లలో బియ్యం, గోధుమలు లాంటి కొన్నింటికే ప్రాముఖ్యత ఉందన్నారు. తీసుకుంటున్న ఆహారంలో ప్రోటీన్లు, క్యాల్షియం లాంటివి తక్కువగా ఉంటున్నాయని తెలిపారు. ఫలితంగా అనేక రకాలైన వ్యాధుల బారిన పడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తీసుకునే ఆహారంలో ఆరు రకాల పదార్థాలు సమంగా ఉంటేనే ప్రజారోగ్యానికి ఇబ్బంది ఉండదన్నారు. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో సమతుల్య ఆహారం దొరకడం కష్టంగా మారిందని తెలిపారు.
ఈ క్రమంలో ప్రభుత్వం చౌకదుకాణాలు, ఐసీడీఎస్ ద్వారా చేపడుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పీడీఎస్ బియ్యంతో పాటు రాగులు లాంటివి ఒకట్రెండు నిత్యావసర వస్తువుల జాబితాలోకి చేర్చి, పంపిణీ చేయడానికి వీలుగా సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. స్మార్ట్‌విలేజ్ కార్యక్రమంలో తీసుకున్న 20 సూత్రాల్లో పౌష్టికాహార అంశం నాలుగో సూత్రంగా చేర్చి ప్రాముఖ్యత ఇచ్చారన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో కొంతవరకు చైతన్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పురాతన పంటలు, వంటలు పునరుద్ధరణ జరగాలి
డాక్టర్ వై.వి.మల్లారెడ్డి మాట్లాడుతూ... ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు వస్తే రైతుకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. అందుకోసం పురాతన పంటలు, వంటల పునరుద్ధరణ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. బియ్యం వంటకాలు తగ్గించి వాటి స్థానంలో తృణ, చిరు, పప్పుధాన్యపు పంటల ఉత్పత్తుల వంటకాలు ఆహారంగా తీసుకుంటే వాటికి డిమాండ్ ఏర్పడుతుందని తెలిపారు. అప్పుడు రైతు ఆలోచనలు కూడా ఏకపంటగా ఉన్న వేరుశనగ నుంచి ఇతర పంటల వైపునకు మళ్లుతుందన్నారు. వినియోగదారుల సంఖ్య పెరిగితే చిరుధాన్యపు, పప్పుధాన్యపు పంటలకు గిరాకీ ఏర్పడి, రైతు పండించిన పంట ఉత్పత్తులు మార్కెట్‌లో మంచి ధర పలుకుతుందని చెప్పారు.
తద్వారా రైతు ఆర్థికంగా గట్టెక్కడంతో పాటు వ్యవసాయం సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనిస్తుందని తెలిపారు. ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో సమతుల్యత లోపించడంతో రక్తహీనత లాంటి జబ్బులు వస్తున్నాయన్నారు. గతంలో బీపీ, షుగర్ లాంటి అరుదుగా కనిపించేవన్నారు. మారిన ఆహారంలో బీపీ, షుగర్ కామన్ అయిందని తెలిపారు. దీంతో దాదాపు అన్ని వర్గాల ప్రజలు పెడుతున్న ఖర్చుల్లో సగానికి పైగా వైద్యానికి పెడుతున్నారని ఒక సర్వేలో వెల్లడైందన్నారు. ఈ క్రమంలో అటు రైతుల్లో ఇటు ప్రజల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వంతో పాటు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.
అనూహ్య స్పందన
రాయలసీమ పంటలు-వంటలు పండుగ కార్యక్రమానికి రెండో రోజు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో రైతుబజార్ ప్రాంగణం కిటకిటలాడింది. టింబక్టు, ఏపీఎంఎస్, జీ-4, రెడ్డిపల్లి కేవీకే, డీఆర్‌డీఏ వెలుగు సంఘాల ఆధ్వర్యంలో కొర్ర పలావ్, కొర్ర అన్నం, కోడికూర, రాగి సంకటి, రాగిదోసే, మునగ, పితకబ్యాళ్ల కుర్మా, వట్టిచేపల పులుసు, నరిడి చెట్నీ, ముద్ద పప్పు, రాగులు, జొన్నలు, సద్దలతో తయారు చేసిన పలు వంటకాలు, పచ్చళ్లు, చిరుతిళ్లు అక్కడే వంటా వార్పు చేసి ప్రదర్శనకు పెట్టారు. నగర ప్రజలు కొత్త రుచులు ఆస్వాదించారు.
ఈ సందర్భంగా నగరానికి చెందిన కొందరు మహిళలు ఇంటి దగ్గరే వండుకుని తెచ్చిన సంప్రదాయ వంటలను నిర్వాహకులు రుచి చూసి బహుమతులకు ఎంపిక చేశారు. ఆర్డీవో హుస్సేన్‌సాబ్, వ్యవసాయశాఖ జేడీ పి.వి.శ్రీరామమూర్తి, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకర్‌రెడ్డి, ఉద్యానశాఖ డీడీ బి.ఎస్.సుబ్బరాయుడు, డ్వామా పీడీ నాగభూషణం, మార్కెటింగ్‌శాఖ ఏడీ బి.శ్రీకాంత్‌రెడ్డి, ఎస్టేట్ అధికారి ప్రతాప్‌రుద్ర తదితరులతో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ వర్గాలు, నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చిరు, పప్పుధాన్యాల సాగుతో మేలు
Published Sun, Mar 15 2015 2:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement