పప్పుల ‘మద్దతు’ పునస్సమీక్ష
బఫర్ స్టాక్ 20 లక్షల టన్నులకు పెంపు: కేంద్రం
న్యూఢిల్లీ : చుక్కలనంటిన పప్పుధాన్యాల ధరల నియంత్రణ, రైతులను ప్రోత్సహించేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తిదారులకు ప్రస్తుతమిస్తున్న కనీస మద్దతు ధర, బోనస్‌లపై పునస్సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలని నిర్ణయించింది. అలాగే బఫర్ స్టాక్‌ను 8 లక్షల టన్నుల నుంచి 20 లక్షల టన్నులకు పెంచనున్నట్టు తెలిపింది. సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన సమావేశమైన ఉన్నత స్థాయి మంత్రుల బృందం ఈ మేరకు నిర్ణయించింది. ఇందులో పాల్గొన్న ఆహార మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ భేటీ వివరాలను విలేకరులకు తెలిపారు.
‘పప్పుధాన్యాలపై దీర్ఘకాలిక విధానాన్ని రూపొందించేందుకు ముఖ్య ఆర్థిక సలహాదారు నేతృత్వంలో కమిటీ వేయాలని నిర్ణయించాం రైతులకిచ్చే కనీస మద్దతు ధర, బోనస్ తదితర అంశాలపై కమిటీ కసరత్తు చేసి రెండు వారాల్లో నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా కచ్చితమైన విధానాన్ని తెచ్చి, దేశంలో పప్పుల సాగును ప్రోత్సహించాలన్నది లక్ష్యం’ అని చెప్పారు. 2016-17 పంట సంవత్సరానికి(జూలై-జూన్) కేంద్రం ఇప్పటికే మద్దతు ధర ప్రకటించింది. దేశంలో కొరతను దృష్టిలో పెట్టుకుని పప్పుధాన్యాలు అధికంగా పండే కెనడా వంటి దేశాల నుంచి భారీ దిగుమతులు చేసుకోవడానికి యత్నిస్తామన్నారు. బఫర్ స్టాక్‌ను 20 లక్షల టన్నులకు పెంచనున్నామని, రాష్ట్రాలకు కిలో రూ.120 చొప్పున సబ్సిడీపై సరఫరా చేసేందుకు 2016-17కు సంబంధించి ఇప్పటికే 1.19 లక్షల టన్నుల కందిపప్పు సేకరించామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తతతో కేంద్రానికి చెడ్డపేరు వస్తోందని, తమ వదద ఉన్న పప్పులను తీసుకెళ్లాలని రాష్ట్రాలను కోరారు.