పప్పు.. నిప్పు
► ఆకాశాన్నంటుతున్న పప్పుల ధరలు
► కందిపప్పు ధర కిందటేడాదితో పోలిస్తే రెట్టింపు
► గత ఏడాది కిలో రూ. 75.. ఇప్పుడు రూ. 150
► వారంలోనే రూ. 40 పెరుగుదల
►రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గడం..
►విదేశాల్లో నిల్వలు పడిపోవడమే కారణం
►మిగతా పప్పుల ధరల్లోనూ 35 శాతం నుంచి
► 45 శాతం దాకా పెరుగుదల
► మిర్చి, చింతపండు, వేరుశనగ నూనెల రేట్లూ పైపైకే..
► కందులకు రికార్డు ధర..
తాండూరు: తాండూరు మార్కెట్‌లో కందులు రికార్డు ధర పలికాయి. శుక్రవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు కందులకు ప్రభుత్వ మద్దతు ధర రూ.4,625 ఉండగా గరిష్టంగా రూ.10,400, కనిష్టంగా రూ. 9,950 ధర పలికింది. ఈ ధరలకు యార్డులో 42 క్వింటాళ్ల కందులను కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. సీజన్, అన్ సీజన్‌లో అయినా కందులకు ఇంత భారీ ధర రావడం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంటే.. మరోవైపు పప్పులు నిప్పుల్లా మండిపోతున్నాయి! రాష్ట్రంలో పప్పుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కంది పప్పు ధర గతేడాది ఇదే సమయంలో రూ.75 ఉండగా ఇప్పుడది రూ.150కి పెరిగింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో 15 శాతం మేర కంది సాగు తగ్గిపోవడం, దిగుమతి చేసుకుంటున్న దేశాల్లోనూ సాగు తగ్గి, నిల్వలు నిండుకోవడంతో భవిష్యత్తులో కంది ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు. ధర పెరగడమే కాదు.. మున్ముందు కంది పప్పుకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా రాష్ట్రంలో ఏటా 1.90 లక్షల టన్నుల కందిపప్పు అవసరం ఉండగా గతేడాది కేవలం 80 వేల టన్నుల కందిపప్పు మాత్రమే లభించింది. రబీలో తగ్గిన సాగు కారణంగా కందిపప్పు లభ్యత ఏకంగా 41 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది సైతం కందిసాగు 2.78 లక్షల హెక్టార్లకు గానూ 2.12 లక్షలకు మాత్రమే పరిమితమైంది. మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యా దేశాల నుంచి దీనిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ కూడా వర్షాభావం వల్ల సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పప్పుకు డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడంతో కొరత పెరిగింది. వారం కిందటే కందిపప్పు ధర రూ.110 వరకు ఉందని, కేవలం వారం రోజుల్లోనే ధర అమాంతం రూ.40 మేర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మున్ముందు మరింత పెరుగుదలకు అవకాశం ఉండడంతో కందిపప్పు నిల్వలపై కేంద్రం పరిమితిని విధించింది. హైదరాబాద్‌లో హోల్‌సేలర్ అయితే 4 వేల క్వింటాళ్లు, రిటైలర్ అయితే 125 క్వింటాళ్లను మించి నిల్వ చేయరాదని, మిగతా ప్రాంతాల్లో హోల్‌సేలర్ 2,500 క్వింటాళ్లు, రిటైలర్ 100 క్వింటాళ్లను మించి నిల్వ చేయరాదని నిర్దేశించింది. అయినా మున్ముందు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో వ్యాపారులు పప్పును రహస్యంగా గోడౌన్లకు తరలిస్తున్నారు.
పెసళ్లకు పెరుగుతున్న ధర
తాండూరు: మార్కెట్ యార్డులో పెసళ్ల ధర కూడా క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం క్వింటాలు పెసళ్లకు గరిష్టంగా రూ.7,590, కనిష్టంగా రూ.6,300, సగటు ధర రూ. 6,800 పలికిందని మార్కెట్ కమిటీ వర్గాలు తెలియజేశాయి. సగటు ధర ప్రకారం రూ. 25.16 లక్షల విలువచేసే 370 క్వింటాళ్ల పెసళ్లను కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు.
మిగతా పప్పులూ అదే దారి..
పెసర, మినప, శనగపప్పు ధరలూ ఆకాశంలోనే ఉన్నాయి. వీటి సాగు కూడా తగ్గిపోవడంతో 45 నుంచి 55 శాతం వరకు ధరలు పెరిగిపోయాయి. పెసర పప్పు ధర ప్రస్తుతం రూ.110 వరకు ఉండగా మినపపప్పు కిలో రూ.140 నుంచి రూ.150 మధ్య ఉంది. శనగపప్పు రూ.70 వరకూ ఉంది. నిత్యావసర సరుకులు మిర్చీ, చింతపండు, వేరుశనగ నూనె ధరలూ మండిపోతున్నాయి. మిర్చీ ధర గత ఏడాది కిలో రూ.79.35 ఉండగా ఇప్పుడు రూ.105 పైనే ఉంది. వేరుశనగ నూనె ధర గతేడాది రూ.90 ఉండగా.. ప్రస్తుతం రూ.120కి చేరింది.
పప్పులు, నిత్యావసర ధరల్లో
పెరుగుదల ఇలా.. (రూపాయల్లో)
సరుకు గతేడాది ప్రస్తుతం
కందిపప్పు(ఒకటో ర కం) 73.64 150
కందిపప్పు(రెండో రకం) 65.18 145
మినప్పప్పు 84.77 140-150
పెసరపప్పు 94.93 110
శనగపప్పు 43.34 70
చింతపండు 67.73 85
మిర్చి 79.35 105
వేరుశనగ నూనె 88.08 110
నెలలో ఒక వ్యక్తి తలసరి వినియోగం ఇలా ఉండాలి
సరుకు వినియోగం
(గ్రాముల్లో)
కందిపప్పు 432
పెసరపప్పు 84
శనగపప్పు 52
మినప్పప్పు 129
శనెగనూనె 241
చింతపండు 69
మిర్చీ 717
సాగు విస్తీర్ణం
పడిపోయిందిలా.. (హెక్టార్లలో)
పంట సాధారణం సాగు జరిగింది
కందిపప్పు 2.78 లక్షలు 2.12 లక్షలు
పెసరపప్పు 1.29 లక్షలు 1.04 లక్షలు
మినపపప్పు 39 వేలు 27 వేలు
వేరుశనగ 21 వేలు 5 వేలు
మిర్చీ 58 వేలు 3 వేలు
తాండూరులో క్వింటాలు కందులు రూ.10,400