పప్పుల మంట.. కూరగాయలతో తంటా!
రాష్ట్రంలో చుక్కలను తాకుతున్న ధరలు
వర్షాభావంతో తగ్గిన సాగు.. పడిపోయిన దిగుమతులు
50శాతం వరకు పెరిగిన పప్పుల ధరలు..
రెండింతలైన కూరగాయల ధరలు
కందిపప్పు, పెసరపప్పు ధరలన్నీ కిలో రూ.120పైనే
టమాటా నుంచి చిక్కుడుదాకా రూ.40కి పైనే
ధరల పెరుగుదలకు దోహదపడ్డ ఎంట్రీ ట్యాక్స్
హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలకు పప్పులు, కూరగాయల ధరలు తోడయ్యాయి.. జేబులన్నీ ఖాళీ చేసినా కొన్ని రోజులకు సరిపడా కూరగాయలు, పప్పులు కొనలేని పరిస్థితి నెలకొంది. పప్పుల ధరలు ఇప్పటికే కిలోకు రూ.120ని దాటిపోగా.. కూరగాయల ధరలు నిరుడితో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో పప్పుధాన్యాలు, కూరగాయల సాగు తగ్గిపోవడం, ఇతర రాష్ట్రాల నుంచీ సరఫరా తగ్గిపోవడం, వ్యాపారులు నిల్వలు పెంచేసుకుని కృత్రిమ కొరతను సృష్టించడం ఈ ధరాఘాతానికి కారణమవుతున్నాయి. మరోవైపు ఏపీ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణలో ప్రవేశపన్ను విధిస్తుండడం కూడా కూరగాయల ధరలు పెరగడానికి కారణమవుతోంది.
తగ్గిన దిగుబడులు: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయలు, పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది. భూగర్భ జలాలు ఎన్నడూ లేనిరీతిలో అడుగంటడంతో బోర్ల కింద సాగు చతికిలపడింది. 2013-14లో (జూన్ వరకు) 6.25లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగుకాగా.. ఈసారి 4.75లక్షల ఎకరాలకు పడిపోయింది. పప్పుధాన్యాల సాగు సైతం 11.67లక్షల ఎకరాల నుంచి 7.72లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. దీంతో కూరగాయలు, పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీంతో మార్కెట్‌లో ప్రస్తుత డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు కిలో రూ.35 నుంచి రూ.40 మధ్య ఉన్నాయి. ఇవి నిరుడితో పోలిస్తే రెట్టింపు కావడం గమనార్హం.
పప్పుల మంట: ఇక రాష్ట్రంలో పప్పుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. పెసరపప్పు, కందిపప్పు కిలో రూ.130కి చేరుకోగా.. మినపపప్పు రూ.120 వద్ద ఉంది. చివరికి శనగపప్పు ధర కూడా కిలోకు రూ.70కి చేరుకుంటోంది. ఈ ధరలన్నీ కూడా గత ఏడాదితో పోలిస్తే.. 35 నుంచి 50శాతం మేర ఎక్కువకావడం ఆందోళనకరం. పప్పుధాన్యాల సాగు తగ్గిన నేపథ్యంలో... భవిష్యత్ డిమాండ్‌ను ముందుగానే ఊహించిన వ్యాపారులు భారీగా పప్పులను నిల్వచేయడం, కొద్దికొద్దిగా మార్కెట్‌లోకి విడుదల చేస్తూ ధరలను ఇష్టారీతిన నిర్ణయిస్తుండటంతో సామాన్యుడికి ధరాఘాతం తప్పడం లేదు.
ఇతర రాష్ట్రాల నుంచి తగ్గిన సరఫరా
ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి. సాధారణంగా కూరగాయలు రాష్ట్రంలోనే 32శాతం దాకా ఉత్పత్తవుతుండగా.. ఏపీ నుంచి 26 శాతం, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 42 శాతం దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలన్నిటా వర్షాభావం నేపథ్యంలో దిగుమతులు 30 శాతం వరకు తగ్గాయి. దీంతో కర్నూలు, అనంతపురం, మదనపల్లి నుంచి రావాల్సిన టమాటా, ప్రకాశం, గుంటూరు, అనంతపురం ప్రాంతాల నుంచి రావాల్సిన వంకాయ, బెంగళూరు, చిక్‌బల్లాపూర్‌ల నుంచి రావాల్సిన బెండకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు తదితరాల దిగుమతులు తగ్గిపోయాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.
కూరగాయల ధరలు.. (కిలోకి రూ.లలో)
టమాటా
గత ఏడాది రూ.14
ప్రస్తుతం రూ. 32
వంకాయ
గత ఏడాది రూ.8
ప్రస్తుతం రూ.28
బెండకాయ
గత ఏడాది రూ. 15
ప్రస్తుతం రూ.40
పచ్చిమిర్చి
గత ఏడాది రూ.16
ప్రస్తుతం రూ.42
గోరుచిక్కుడు
గత ఏడాది రూ.18
ప్రస్తుతం రూ.40
చిక్కుడు
గత ఏడాది రూ.30
ప్రస్తుతం రూ.35
బీరకాయ
గత ఏడాది రూ.16
ప్రస్తుతం రూ.30
సొరకాయ
గత ఏడాది రూ.6
ప్రస్తుతం రూ.20
క్యారెట్
గత ఏడాది రూ.22
ప్రస్తుతం రూ.38
క్యాప్సికం
గత ఏడాది రూ.18
ప్రస్తుతం రూ.42
హైదరాబాద్‌కు కూరగాయల దిగుమతులు.. (క్వింటాళ్లలో)
కూరగాయలు ఏప్రిల్ మే
టమాటా 964 799
వంకాయ 79 59
బెండకాయ 101 125
పచ్చిమిర్చి 200 224
గోరుచిక్కుడు 94 91
చిక్కుడు 62 10
సొరకాయ 187 57
క్యారెట్ 1,220 1,098
క్యాప్సికం 419 345