అసహనమా అదెక్కడ?
న్యూఢిల్లీ: దేశం శాంతియుతంగా ఉందని, మత అసహనం అనేది ఎక్కడా లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దేశంలో ఆరోగ్యకర వాతావరణం ఉందని, ఈ సమయంలో సినిమా రంగానికి చెందిన అవార్డులు వెనక్కు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. అవార్డులు ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. బాధ్యతారహిత వ్యాఖ్యలు ఆరోగ్యకర వాతావరణాన్ని పాడు చేస్తాయని అభిప్రాయపడ్డారు.
సృజన, మతాలపై అసహనం దేశానికి హానికరమని బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై జైట్లీ స్పందించారు. దేశంలో అసహనం లేదని ఎవరైనా చెబితే అందులో తప్పేముందని ప్రశ్నించారు. అరుణ్ శౌరీ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు జైట్లీ నిరాకరించారు.
యూపీఏ హయాంలో మహారాష్ట్రలో జరిగిన ఘటనలతో తమ ప్రభుత్వానికి ముడిపెట్టొదని ఆయన కోరారు. పలువురు మంత్రులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పప్పుల ధరలను కనిపెట్టిచూస్తున్నామన్నారు. నూనెలు, డీజిల్, గ్యాస్, పంచదార ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.