ఫేస్బుక్ లో పోస్ట్ తొలగించిన జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి నెటిజన్లు ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన సందేశాన్ని ఆయన ఉపసంహరించుకున్నారు. ప్రపంచ యుఎఫ్ఓ దినోత్సవం(అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్) జరుపుకుంటున్నామంటూ ఫేస్బుక్ లో బుధవారం జైట్లీ పోస్ట్ పెట్టారు. ఆకాశయానంలో గల్లంతైన వస్తువుల కోసం ఈ రోజు జరుపుకుంటారని కూడా వివరించారు.
జైట్లీ పోస్ట్ పై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆర్థిక మంత్రి గారూ ఈరోజు భారతీయులు యుఎఫ్ఓ డే బదులుగా ధరల పెంపు రోజు జరుపుకుంటున్నాం అంటూ ఓ యూజర్ వ్యంగ్యాస్త్రం వదిలారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు, రైల్వే చార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ కామెంట్ చేశారు.
అంతరిక్షం గురించి కాకుండా సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని మరో యూజర్ సూచించారు. దీంతో యుఎఫ్ఓ డే పోస్ట్ ను తన ఫేస్బుక్ నుంచి జైట్లీ తొలగించారు. కాగా, త్వరలో ప్రవేశపెట్టనున్న 2014-15 బడ్జెట్ లో కఠిన నిర్ణయాలు తప్పవని జైట్లీ ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై నెటిజన్లు ఇంకెంత ఘాటుగా స్పందిస్తారో చూడాలి.