శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం | Andhra Pradesh to procure 3 lakh quintals of seed for Kharif | Sakshi
Sakshi News home page

శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం

Published Tue, Sep 26 2023 5:46 AM | Last Updated on Tue, Sep 26 2023 4:26 PM

Andhra Pradesh to procure 3 lakh quintals of seed for Kharif - Sakshi

సాక్షి, అమరావతి: ముందస్తు రబీకి సిద్ధమైన రైతులకు అవసరమైన విత్తన సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి శనగ విత్తనాల పంపిణీ ప్రారంభించగా.. మిగిలిన విత్తనాలను అక్టోబర్‌ మొదటి వారం నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. రబీలో 10.92 లక్షలు ఎకరాల్లో శనగ సాగవుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌కు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీలో శనగ సాగువైపు మొగ్గు చూపుతుండటంతో ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆ మేరకు రబీ కోసం 3 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని సబ్సిడీపై పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అదేవిధంగా 36,121 క్వింటాళ్ల వరి, 14,164 క్వింటాళ్ల మి­ను­ము, 4,353 క్వింటాళ్ల పెసలు, 142 క్వింటాళ్ల కందులు, 833 క్వింటాళ్ల ఉలవలు, 502 క్వింటాళ్ల చిరుధాన్యాలు, 367 క్వింటాళ్ల నువ్వులు, 727 క్వింటాళ్ల వేరుశనగ, 1,697 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీకి సిద్ధం చేశారు.

పకడ్బందీగా విత్తన పంపిణీ 
ముందస్తు రబీ సీజన్‌కు సిద్ధమైన రైతులకు శనగ విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టాం. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేయగా.. ఈ సారి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి వరితో సహా మిగిలిన విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేశాం. – గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ

ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనం 
గడిచిన సీజన్‌లో ఎంపిక చేసిన రైతు క్షేత్రాల్లో శనగ విత్తనాన్ని సేకరించారు. ఏపీ సీడ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీ ద్వారా పరీక్షించి నాణ్యతను  ధ్రువీకరించారు. 3.44 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాన్ని ఆర్‌బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎకరం లోపు రైతుకు బస్తా (25 కేజీలు), ఆ తర్వాత ఎకరానికి ఒకటి చొప్పున ఐదెకరాల్లోపు రైతులకు ఐదు బస్తాల చొప్పున విత్తనాలు పంపిణీ చేయనున్నారు.

గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేసిన శనగ విత్తనాలపై ఈ సారి 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. పచ్చిరొట్టతో పాటు చిరుధాన్యాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుండగా.. వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం సబ్సిడీ,  మినుము, పెసలు, కందులు, అలసందల విత్తనాలను 30 శాతం సబ్సిడీపై పంపిణీ  చేయనున్నారు. వరి విత్తనాలను క్వింటాల్‌కు ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో రూ.1000, వర్తించని జిల్లాల్లో రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 58 కోట్లు భరించగా, ఈసారి రూ.120 కోట్లు భరించేందుకు సిద్ధమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement