కామారెడ్డి జిల్లా జుక్కల్ అంగళ్లలో అన్ని రకాల పప్పులు
పాలిష్ చేయకుండా అమ్మే పొట్టు పప్పునకు గిరాకీ
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజల కొనుగోలు
అన్ని సీజన్లలోనూ పప్పులు లభ్యం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో ఆచార వ్యవహారాలన్నీ భిన్నంగా కనిపిస్తాయి. ఇక్కడ సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు. చాలా మంది ఇక్కడ శాకాహారులే ఉంటారు. ఈ ప్రాంతంలోని ప్రజలు తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతారు. అందుకే దీన్ని త్రిభాషా సంగమం అని అంటుంటారు.
జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్, మద్నూర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, డోంగ్లీ, బిచ్కుంద, నిజాంసాగర్, మహ్మద్‌నగర్ మండలాలున్నాయి. ఆయా మండలాల్లో పలుచోట్ల అంగళ్లు (వారసంతలు) జరుగుతాయి. బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం, జుక్కల్‌లో గురువారం, పి ట్లంలో శుక్రవారం, మద్నూర్‌లో సోమవారం, డోంగ్లీ, మేనూర్‌లో శుక్రవారం అంగళ్లు జరుగుతాయి. ఆ ప్రాంత ప్రజలు ఇంటికి అవసరమైన నిత్యావసరాలు, బట్టలు, వంట పాత్రలు.. ఏవైనా సరే అంగడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు.
పేద, మధ్య తరగతి వర్గాలు కూరగాయలు, నిత్యావసరాల కోసం అంగళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పప్పులు అమ్ముతుంటారు. స్థానికంగా ఉన్న రైతులు వారు పండించిన పప్పుదినుసులను అంగళ్లలో అమ్ముతారు. పెసర, కంది, మినుము, శనగ, ఎర్రపప్పులతో పాటు జొన్నలు, గోధుమలు, ఆవాలు కూడా విక్రయిస్తారు.
పొట్టు పప్పునకు భలే డిమాండ్
సాధారణంగా పంట చేతికి వచ్చిన తర్వాత పప్పు దినుసులు ఎక్కువ మొత్తంలో అమ్మకానికి వస్తాయి. ఆ సమయంలో ధర కొంత తక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు ఆయా అంగళ్లకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. దుకాణాల్లో మరపట్టిన, పాలిష్ చేసినవి అమ్ముతుంటే అంగళ్లలో మాత్రం రైతులు నేచురల్ గా పండించిన పప్పుదినుసులు దంచి పొట్టుతో అమ్ముతుంటారు. చాలా మంది వాటిని ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. క్వింటాళ్ల కొద్దీ పప్పులు అమ్ముడు పోతాయని చెబుతున్నారు.
దేశంలో ఎక్కడైనా పప్పులకు కొరత రావచ్చు గానీ, జుక్కల్ ప్రాంతంలో మాత్రం ఏనాడూ పప్పుదినుసులకు కొరత ఏర్పడదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడే ఎక్కువగా పప్పుదినుసులు పండిస్తారు. అలాగే పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో కూడా పప్పుదినుసులు సాగుచేస్తారు. జొన్నలు, గోధుమలు కూడా విక్రయిస్తారు.
పొరుగు రాష్ట్రాల నుంచి కూడా..
జుక్కల్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద అంగళ్లకు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్, హనేగావ్ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటకలోని ఔరద్ ప్రాంతానికి చెందిన వారు కూడా పప్పులు అమ్మడానికి వస్తుంటారు. అలాగే అంగళ్లలో పప్పులు, నిత్యావసరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి మూడు రాష్ట్రాల ప్రజలు రావడం విశేషం. జుక్కల్ అంగడికి జుక్కల్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కొన్ని గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారు.
మద్నూర్, మేనూర్‌లో జరిగే అంగళ్లకు చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్రలోని దేగ్లూర్ తాలూకాలోని గ్రామాల ప్రజలు వస్తారు. బిచ్కుంద అంగడికి బిచ్కుంద మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. పిట్లం మండల కేంద్రంలో జరిగే అంగడికి పిట్లం, పెద్దకొడప్‌గల్, నిజాంసాగర్ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లాలోని కంగి్ట, కల్హేర్ మండలాల నుంచి వచ్చి కొనుగోళ్లు చేస్తారు.
రెండు తరాలుగా ఇదే దందా
మా కుటుంబం రెండు తరాలుగా పప్పులు, జొన్నలు పిట్లం అంగడిలో అమ్ముతున్నం. మా నాయిన అమ్మేవారు. తర్వాత నేనూ పదేళ్లుగా పప్పులు, జొన్నలు అమ్ముతున్నాను. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పప్పులు, జొన్నలు కొంటారు. – రంజిత్, తిమ్మానగర్ (విక్రయదారుడు)
పిట్లం అంగడిలోనే కొంటాను
పిట్లం అంగడిలో ఏళ్ల నుంచి పప్పులు కొనుగోలు చేస్తున్నాం. తక్కువ ధరకు దొరుకుతాయి. పప్పులతో పాటు జొన్నలు కూడా అమ్ముతారు. ఇంట్లో అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తాను. ఎన్నో ఏళ్లుగా పిట్లం అంగడిలో కొన్నవే తింటున్నాం. – రాజు, ఎల్లారెడ్డి (కొనుగోలుదారుడు)
నాణ్యమైన పప్పులు దొరుకుతాయి
పిట్లంకు మా ఊరు దగ్గరగా ఉంటుంది. వారం వారం అంగడికి ఇక్కడికే వచ్చి అవసరం ఉన్నవి కొనుగోలు చేస్తాం. పప్పులు ప్రతిసారీ పిట్లం అంగడిలోనే కొంటాం. ఇక్కడ నాణ్యమైనవి దొరుకుతాయి. – రాజేశ్వర్, తాడ్కోల్, సంగారెడ్డి జిల్లా (కొనుగోలుదారుడు)
Comments
Please login to add a commentAdd a comment