సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను మించి బహిరంగ మార్కెట్‌లో ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు గతంలో సిండికేట్‌గా ఏర్పడి తమ ఇష్టమొచ్చిన ధరలకే రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేసేవారు. దీనివల్ల కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా రైతులకు లభించేవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కనీస మద్దతు ధర లభించని పంటలను మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్, ఇతర పద్ధతుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. గత ఏడాది ఈ విధంగా పెద్దఎత్తున పంట ఉత్పత్తుల్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులకు వ్యవసాయ ఉత్పత్తులు దొరకని పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ ఏడాది పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. దీంతో పప్పు ధాన్యాలు, రాగులు, సజ్జలు, ఇతర చిరు ధాన్యాల ధరలు పెరిగాయి. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి వాటిని కొనుగోలు చేస్తుండటంతో రైతుల పంట పండింది. ఈ కారణంగా రైతులు ఈసారి మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు.
గతేడాది రూ.2,856.53 కోట్ల విలువైన పంటల కొనుగోలు
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం గతేడాది మాదిరిగానే కందులు, శనగలు, జొన్న, మొక్కజొన్న ఇతర పంటల కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా సుమారు 10 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ అధ్వర్యంలో మార్చి 1న తెరిచింది. అయితే, ఇప్పటివరకు రూ.796.81 కోట్ల విలువైన 4.05 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే రైతులు వాటిలో విక్రయించారు. గతేడాది రబీలో రూ.2,856.53 కోట్ల విలువైన 8,19,572 టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. అంటే గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌లో అమ్ముడుపోయాయి.
మొక్కజొన్న, జొన్న రైతుల్ని ఆదుకుంటున్న కొనుగోలు కేంద్రాలు
మొక్కజొన్న, జొన్న రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ఆదుకుంటున్నాయి. ఈ ఏడాది మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,850 కాగా, బహిరంగ మార్కెట్‌లో రూ.1,450 నుంచి రూ.1,550 మధ్య పలుకుతోంది. ఈ కారణంగా మొక్కజొన్న రైతులు పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు క్యూ కట్టారు. ఈ ఏడాది 3.96 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా.. ఇప్పటివరకు రూ.553.01 కోట్ల విలువైన 2,98,924.50 టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి ఆదుకుంది.
జొన్నలు 1.10 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.195.33 కోట్ల విలువైన 96,332.85 టన్నులను కొనుగోలు చేశారు. ఈ విధంగా ఈ ఏడాది 60,953 మంది రైతుల నుంచి రూ.796.81 కోట్ల విలువైన 4,04,763.10 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయగలిగింది.
ఇది శుభపరిణామం
ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చింది. మినుములు, కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే మిన్నగా ధరలు పలకడం వలన ఈ ఏడాది మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు పెద్దగా రాలేదు. ఇది నిజంగా శుభపరిణామం.
– పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment