
జోరుగా జీరో బిజినెస్
విజయవాడ కేంద్రంగా వ్యాపారం
అక్రమంగా పుప్పుధాన్యాల దిగుమతి
మామూళ్ల మత్తులో వాణిజ్య పన్నుల అధికారులు
కోట్లాది రూపాయల పన్ను ఎగనామం
విజయవాడ : మామూళ్ల మత్తులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడం.. ఆన్‌లైన్‌లో వే ఫ్రీగా బిల్లులు లభిస్తుండటంతో విజయవాడ కేంద్రంగా పప్పుధాన్యాల జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. విజయవాడలో 14 బోగస్ సంస్థల పేరుతో ఇప్పటికీ ఈ వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. వాణిజ్య కూడలి అయిన విజయవాడ నుంచి రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన పట్టణాలకు అక్రమంగా పప్పుధాన్యాలను తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా అక్రమార్కులు రోజుకు రూ.60 లక్షలు చొప్పున నెలకు రూ.18 కోట్ల పన్నులను ప్రభుత్వానికి చెల్లించకుండా తప్పించుకుంటున్నట్లు ‘సాక్షి’ సేకరించిన సమాచారంలో స్పష్టమైంది.
పక్కా ప్రణాళికతో మోసం
బ్రోకర్లు విజయవాడలో తిష్టవేసి అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి పక్కా ప్రణాళికతో బిల్లులు లేకుండా మహారాష్ట్ర నుంచి పప్పుధాన్యాలను దిగుమతి చేస్తున్నారు. రోజుకు వంద లారీల కందిపప్పు అనామతుగా దిగుమతి అవుతోంది. పప్పుధాన్యాలపై దిగుమతి టాక్స్ లేని చెన్నై, ఒడిశా తదితర రాష్ట్రాలకు సరుకు తీసుకెళ్తున్నట్లు చూపించి విజయవాడలో దింపేస్తున్నారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లే సరుకు మన రాష్ట్రంలోకి ప్రవేశించగానే బోర్డర్ చెక్‌పోస్టులో ట్రాన్‌సిస్ట్‌మెంట్ పాస్ తీసుకోవాల్సి ఉంది. దాన్ని మన బోర్డర్ దాటగానే అక్కడ చెక్‌పోస్టులో అందించాలి. బ్రోకర్లు పథకం ప్రకారం ఖాళీ లారీలను చెక్‌పోస్టులు దాటించేస్తున్నారు. కొందరు బిల్‌ట్రేడింగ్‌లోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. సుగుణ, రాఘవేంద్ర, నాగేశ్వరావు వంటి బినామీ పేర్లతో పది మంది బ్రోకర్లు, వారి గుమాస్తాలు విజయవాడలో ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు.
రోజుకు వంద లారీలు..
ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన దాదాపు వంద లారీల కందిపుప్పు, శనగపుప్పును విజయవాడలో దిగుమతి చేస్తున్నారు. ఒక్కో లారీలో 17 టన్నుల సరుకు ఉంటుంది. దాని విలువ రూ.12లక్షలు. ఈ లెక్కన రోజుకు రూ.120కోట్ల విలువైన పప్పుధాన్యాలు దిగుమతి చేస్తున్నారు. ఒక్కో లారీకి ఐదు శాతం చొప్పున రూ.60వేలు పన్ను చెల్లించాల్సి ఉంది. అక్రమంగా దిగుమతి చేసిన పప్పుధాన్యాలకు పన్ను చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.18కోట్లు నష్టం వస్తోందని అంచనా.
ఇతర ప్రాంతాలకు సరఫరా..
విజయవాడలో అక్రమంగా దిగుమతి చేసిన సరుకును బ్రోకర్లు రోజూ గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, భీమవరం, పాలకొల్లు తదితర పట్టణాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోనూ సబ్-బ్రోకర్లను ఏర్పాటు చేసి జీరో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ జీరో వ్యాపారంపై ఉన్నత స్థాయి విచారణ నిర్వహించి పప్పుధాన్యల అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకోవటంతోపాటు బినామీ వ్యాపార సంస్థలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్నులు సమకూరే అవకాశం ఉంది.
విజయవాడలోని బెంజిసర్కిల్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం పరిధిలో రెండు చోట్ల బాలాజీ ఎంటర్‌ప్రెజైస్ పేరుతో వ్యాపారాల నిర్వహణకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఈ సంస్థలు జనవరి నుంచి ఆగస్టు వరకు దాదాపు రూ.42 కోట్ల విలువైన పప్పుధాన్యాలను విక్రయించి పన్ను చెల్లించలేదు. వాస్తవానికి బాలాజీ ఎంటర్‌ప్రెజైస్ పేరుతో అనుమతి కోసం అందజేసిన దరఖాస్తుల్లో పేర్కొన్న చిరునామాల్లో ఎటువంటి వ్యాపార సంస్థలు లేవని, రెండు సంస్థలను ఒకే వ్యాపారి నిర్వహించాడని తర్వాత తేలింది. గుట్టుగా తన పని ముగించుకున్న వ్యాపారి ఆ తర్వాత బోర్డు తిప్పేశాడు.
విజయవాడ సూర్యారావుపేట సర్కిల్ పరిధిలో విజయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ నకిలీ చిరునామాతో జనవరి నుంచి జూన్ వరకు రూ.24 కోట్ల విలువైన కందిపప్పును నిబంధనలకు విరుద్ధంగా నగరానికి తీసుకొచ్చినట్లు ఆన్‌లైన్‌లో వే బిల్లులు చూపిస్తున్నాయి.
సీతారామపురం సర్కిల్ ఏరియాలో శ్రీ వెంకటలక్ష్మి ట్రేడర్స్ అనే సంస్థ గత ఏడాది ఆన్‌లైన్‌లో వేబిల్లులు పొంది రూ.10 కోట్ల మేర వ్యాపారం నిర్వహించి పన్ను చెల్లించకుండా బోర్డు తిప్పేసింది.
గుడివాడ వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ పరిధిలో నెక్కలం-గొల్లగూడెం గ్రామంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ పేరుతో ఈ సంవత్సరం మే నెల వరకు రూ.30 కోట్ల విలువైన కందిపప్పు లావాదేవీలు జరిగినట్లు ఆన్‌లైన్‌లో వే బిల్లులు చూపిస్తున్నాయి. కానీ, ఒక్క పైసా కూడా పన్ను చెల్లించలేదు. ఆడిట్ సమయంలో ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెళ్లి పరిశీలించగా నెక్కలం-గొల్లడూడెంలో అసలు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ లేదని తేలింది.