పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ గ్రామంలో ఎలుకల నివారణ మందు సిద్ధం చేస్తున్న సిబ్బంది
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగులో అన్నదాతను కలవరపెడుతున్న మూషికాల ఆటకట్టించేందుకు సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. గత రెండేళ్లలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్నదాతకు అండగా నిలిచేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మార్గదర్శకాలు జారీచేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఏడాది పొడవునా వరి, వేసవిలో పప్పుధాన్యాలు సాగుచేస్తారు. ఏడాది పొడవునా పంటలు సాగుచేయడంతో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణ ద్వారా వరిపంట నష్టాన్ని తగ్గించడం, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సాధించడం లక్ష్యంగా 2019–20 నుంచి సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
రెండేళ్లలో 25.95 లక్షల మంది రైతులకు లబ్ధి
ఖరీఫ్‌లో జూన్ నుంచి అక్టోబర్ వరకు, రబీలో నవంబర్ నుంచి మార్చి వరకు చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల గత రెండేళ్లలో హెక్టార్‌కు 5 నుంచి 7 క్వింటాళ్ల ధాన్యాన్ని సంరక్షించగలిగారు. 2019–20లో 13.05 లక్షల హెక్టార్లలో రూ.1.75 కోట్లతో చేపట్టగా 14.57 లక్షల మంది రైతులకు లబ్ధికలిగింది. 2020–21లో 12.03 లక్షల హెక్టార్లలో రూ.1.14 కోట్లతో చేపట్టగా 11.38 లక్షల మంది అన్నదాతలు లబ్ధిపొందారు. 2021–22 వ్యవసాయ సీజన్‌లో రూ.2.01 కోట్లతో 15.18 లక్షల హెక్టార్లలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం అమలు చేయాలని సంకల్పించారు. దీనికి 14,376 కిలోల ఎలుకల మందు (బ్రోమోడయోలిన్)ను వినియోగించనున్నారు. ఖరీఫ్ సీజన్‌లో కృష్ణాలో 2.54 లక్షల హెక్టార్లు, గుంటూరులో 2.34 లక్షల హెక్టార్లు, తూర్పుగోదావరి 2.46 లక్షల హెక్టార్లు, పశ్చిమగోదావరిలో 2.02 లక్షల హెక్టార్లు చొప్పున మొత్తం 9.36 లక్షల హెక్టార్లలో రూ.1.25 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం 8,915 కిలోల ఎలుకల మందు (బ్రోమోడయోలిన్)ను రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకేల్లో) అందుబాటులో ఉంచారు.
2021–22లో కార్యాచరణ ఇలా..
ఎంపికచేసిన గ్రామాల్లో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సామూహిæకంగా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. వ్యవసాయ క్షేత్రాలతోపాటు సాధారణ స్థలాలు, రోడ్లు, కాలువలు, మురుగుకాలువల తిన్నెలు, బీడు, బంజరు, ప్రభుత్వభూముల్లో కూడా ఈ కార్యక్రమం చేపడతారు. ఆర్‌బీకేల వద్ద విషపు ఎరను తయారుచేసి సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు పంపిణీ చేస్తారు. విషపు ఎరలకు వ్యవసాయ క్షేత్రాల్లో అయ్యే ఖర్చును రైతులు, బంజరు, ప్రభుత్వ భూముల్లో అయ్యే ఖర్చును పంచాయతీలు భరించాల్సి ఉంటుంది. హెక్టార్‌కు 8 నుంచి 10 గ్రాముల బ్రోమోడయోలిన్‌ను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ మందులో నూకలు, వంటనూనె కలిపి ఎరను రైతులు పంట నష్టం జరిగే ప్రదేశాల్లో ఎలుకల బొరియల్లో ఉంచాలి. సామూహిక ఎలుకల నిర్మూలన కోసం ఆర్‌బీకే స్థాయిలో ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు.
స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నాం
గడిచిన రెండు సీజన్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సామూహిక ఎలుకల నిర్మూలనకు ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం ఆర్‌బీకే స్థాయిలో స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నాం.ఎలుకల నివారణ మందును ఆర్‌బీకే ద్వారా రైతులకు పంపిణీ
చేస్తున్నాం.
– హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ
Comments
Please login to add a commentAdd a comment