సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ముందస్తుగా పలకరించిన రుతుపవనాలు, ఏరువాక ఆరంభంతో అన్నదాతలు కాడెడ్లను అదిలిస్తూ ఉత్సాహంగా ఖరీఫ్ సాగులో నిమగ్నమయ్యారు. ఊరు దాటాల్సిన పనిలేకుండా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుతుండటంతో పొలాల బాట పడుతున్నారు. పంటల సాగు కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించిన పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నవరత్న పథకాలు గ్రామసీమల్లో వెలుగులు నింపుతున్నాయి.
అన్నదాతకు సాయం.. ఇలా
వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ యోజన ద్వారా ఏటా రూ.13,500 చొప్పున మూడేళ్లలో రెండు కోట్లకుపైగా కుటుంబాలకు రూ.23,875.59 కోట్ల మేర ఆర్థిక సాయం అందింది. ఎకరం వరి సాగు చేసేందుకు పెట్టుబడి అంచనా వ్యయం రూ.25 వేలు కాగా రైతు భరోసా ద్వారా సగానికిపైగా సాయం అందుతోంది. ఇక మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తూ పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. రూ.6,684.84 కోట్లను రైతులకు పంటల బీమా పరిహారం కింద చెల్లించారు. మూడేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.79,642.18 కోట్ల మేర ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చింది.
సగటున రూ.20 కోట్ల లబ్ధి
కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురం గ్రామానికి 2020– 21లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.6,49,92,155 మేర లబ్ధి కలిగింది. గ్రామ జనాభా 4,378 కాగా లబ్ధిదారుల సంఖ్య 4,159. అంటే 95 శాతం జనాభాకు మేలు జరిగింది. పెట్టుబడుల కోసం తమ గ్రామస్తులు అప్పులు చేయాల్సిన అవసరం లేదని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ’సాక్షి’తో పేర్కొన్నారు. అన్ని పల్లెల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 4,500 – 5,000 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి మూడేళ్లలో సగటున రూ.20 కోట్ల వరకు ప్రయోజనం చేకూరిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
67% చిన్న రైతులే...
ఖరీఫ్, రబీ సీజన్లలో సాధారణ సాగు విస్తీర్ణం 60 లక్షల హెక్టార్లు కాగా ఉద్యాన పంటలు 17 లక్షల హెక్టార్లలో సాగవుతుంటాయి. రైతు కుటుంబాలు దాదాపు 80 లక్షల వరకు ఉండగా 67 శాతం చిన్న రైతులే ఉన్నారు. వీరిలో ఒక్కో కుటుంబానికి 1.05 ఎకరాల లోపే ఉంది. మరో 20 శాతం కుటుంబాలకు మూడు ఎకరాల లోపు ఉంటుందని అంచనా. తక్కిన 13 శాతం కుటుంబాలకు మాత్రమే మూడు ఎకరాలకు మించి ఉంది.
బడ్జెట్‌లో పెద్దపీట
ఏటా బడ్జెట్‌లో వ్యవసాయశాఖకు కేటాయింపులను ప్రభుత్వం పెంచుతోంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బడ్జెట్లో కనిష్టంగా 9.98 శాతం, గరిష్టంగా 12.54 శాతం కేటాయింపులు ఉండగా ఇప్పుడు 2022–23 బడ్జెట్‌లో 16.80 శాతం నిర్దేశించడం వ్యవసాయ రంగం పట్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రాధాన్యతను వెల్లడిస్తోంది.
పథకాలే ఆదుకుంటున్నాయి...
ఖరీఫ్‌లో సాగుకు ఏటా రూ.3 లక్షలు అప్పులు చేసి కనీసం రూ.50 వేలు వడ్డీ కింద చెల్లిస్తుంటా. కానీ ఇప్పుడు పెట్టుబడి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన అగత్యం లేదు. మూడు విడతలుగా వైఎస్సార్ రైతు భరోసా సాయం అందింది. నా భార్యకు పొదుపు సంఘంలో సున్నా వడ్డీ కింద రెండుసార్లు డబ్బులు వచ్చాయి. పిల్లాడి చదువుకు అమ్మ ఒడి అందింది. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రుణం మంజూరు చేసింది.
– తాడిబోయిన చంద్రశేఖర్, వల్లభాపురం, గుంటూరు జిల్లా.
అప్పులు లేని సేద్యం..
వైఎస్సార్ రైతు భరోసాతోపాటు ఇన్‌పుట్ సబ్సిడీ రూ.6 వేలు అందాయి. నా బిడ్డకు అమ్మ ఒడి వచ్చింది. పంట నష్టపోతే పరిహారం ఇస్తున్నారు. పెట్టుబడి, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సిన అవసరం తప్పింది.
– కడిమిశెట్టి విజయ భాస్కరరెడ్డి, గోర్స, కొత్తపల్లి మండలం, కాకినాడ జిల్లా.
భయం లేదు... భరోసానే
క్రమం తప్పకుండా రైతు భరోసా అందుతోంది. గత ఏడాది పంట నష్టపోతే రూ.12 వేలు ఇచ్చారు. బీమా పరిహారం రూ.35,044 అందింది. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 వచ్చింది. మొత్తంగా మాకు ఏడాది వ్యవధిలో రూ.79,294 అందాయి. ఇప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేదు. పంట పోతే సొమ్ములు రావనే భయం కూడా లేదు.
– పితాని అనసూయ, మహిళా రైతు, తాండవపల్లి, అమలాపురం, కోనసీమ.
కౌలు కార్డుతో బ్యాంకు రుణం
ప్రభుత్వం కౌలు కార్డు (సీసీఆర్సీ) జారీ చేయటంతో పంట సాగుకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా. గతంలో మాకు వడ్డీ వ్యాపారులే దిక్కు. పంట చేతికి రాకముందే వేధింపులు మొదలయ్యేవి. ఇప్పుడా దుస్థితి లేదు.
–సయ్యద్ సుభాని, రైతు, పెదపులిపాక, పెనమలూరు.
Comments
Please login to add a commentAdd a comment