సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో మరో వినూత్న ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లలో సాగయ్యే ఆక్వా సహా వివిధ రకాల పంటలను ఎలక్ట్రానిక్ పద్ధతి(ఇ–పంట)న నమోదు చేయనుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ తొట్టతొలి ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త అజమాయిషీలో జరిగే ఇ–పంట నమోదుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే వివిధ స్థాయిల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చింది.
క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన
► వీఏఏ, వీహెచ్‌ఏ, ఆక్వా, పశు సంవర్థక సహాయకులు, గ్రామ సర్వేయర్, వీఆర్‌వో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనలో పంటను నమోదు చేస్తారు. ఇలా నమోదు చేయడం ఇదే ప్రథమం.
►రైతులకు ముందుగానే తెలియచేసి సర్వే చేపడతారు. రైతును పొలంలో నిల్చోబెట్టి ఫొటో తీసి రికార్డ్ చేస్తారు.
►చేపలు, రొయ్యల చెరువులనూ సర్వే చేసి ఆ వివరాలనూ నమోదు చేస్తారు. పట్టాదారు లేదా కౌలుదారుల పేర్లను మాత్రమే నమోదు చేస్తారు. ఈ మేరకు వారి మొబైల్‌కు సందేశం వస్తుంది.
ఇ–పంట డేటానే ప్రామాణికం
► ప్రభుత్వం అమలు చేసే.. సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, కనీస మద్దతు ధర, ప్రకృతి విపత్తుల సహాయం తదితర పథకాలకు ఇ–పంట డేటానే ప్రామాణికంగా తీసుకుంటారు. రైతులు తమ సందేహాల నివృత్తికి రైతు భరోసా కేంద్రాలను లేదా 155251 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
ఎవరు బాధ్యత వహిస్తారంటే..
► గ్రామస్థాయిలో వీఆర్‌వో, వ్యవసాయ, అనుబంధ రంగాల సహాయకులు, గ్రామ సర్వేయర్ బాధ్యత వహిస్తారు.
► మండలస్థాయిలో తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షకులుగా ఉంటారు. సమాచారాన్ని గ్రామాధికారుల వద్ద ఉండే ట్యాబ్‌ల ద్వారా ఇ–పంట యాప్‌లో నమోదు చేస్తారు.
► ప్రతి రికార్డును బయోమెట్రిక్ ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది.
► నమోదు వివరాలను గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు.
సాగు హక్కు ధ్రువీకరణ పత్రాలపై అవగాహన
భూ యాజమాన్య హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కౌలుదారులకు సాగు హక్కు ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గ్రామసభలు నిర్వహించి భూయజమానులకు, కౌలుదారులకు అవగాహన కల్పిస్తున్నారు. సాగు హక్కు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన తేదీ నుంచి 11 నెలలు మాత్రమే అమలులో ఉంటాయి.
మూడు సీజన్లలో నమోదు
► సంవత్సరంలో మొత్తం మూడు సీజన్లలోనూ ఇ–పంట నమోదు జరుగుతుంది. తొలి విడత ప్రస్తుత ఖరీఫ్‌కు సంబంధించినది కాగా మిగతా రెండూ రబీ, వేసవి (మూడో పంట) పంటలకు చెందినవి.
► ఖరీఫ్ పంట నమోదు ఈ నెల 13న ప్రారంభమై వచ్చే నెల 31న ముగుస్తుంది.
► రబీ పంటల నమోదు నవంబర్ 1న మొదలై అదే నెల 30న ముగుస్తుంది.
► మూడో పంట నమోదు మార్చి 1న మొదలై ఏప్రిల్ 30న ముగుస్తుంది.
► ఖరీఫ్ పంట నమోదు ఈ నెల 13న ప్రారంభమై వచ్చే నెల 31న ముగుస్తుంది.
► రబీ పంటల నమోదు నవంబర్ 1న మొదలై అదే నెల 30న ముగుస్తుంది.
► మూడో పంట నమోదు మార్చి 1న మొదలై ఏప్రిల్ 30న ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment