Multi Purpose Facility Center For Farmers: రైతన్నకు ‘బహుళ’ లాభాలు - Sakshi
Sakshi News home page

AP: రైతన్నకు ‘బహుళ’ లాభాలు

Published Tue, Jul 27 2021 2:10 AM | Last Updated on Tue, Jul 27 2021 3:29 PM

CM YS Jagan said multi-purpose facility centers are being set up for farmers - Sakshi

వ్యవసాయ, అనుబంధ శాఖలపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

సాక్షి, అమరావతి: అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాల వద్ద రూ.16,233 కోట్ల వ్యయ అంచనాలతో బహుళ ప్రయోజన కేంద్రాలు (మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వీటిద్వారా ఆర్బీకేల వద్ద రైతులకు 15 రకాల మౌలిక సదుపాయాలు సమకూరతాయన్నారు. రెండోదశ పనులకు సిద్ధం కావాలని, ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి కావాలని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలు (హార్టికల్చర్, అగ్రి ఇన్‌ఫ్రా), పశుసంవర్ధక, మత్స్య శాఖలపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పన, మల్టీపర్పస్‌ సెంటర్లు, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫిషింగ్‌ హార్బర్లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు తదితరాలపై మార్గ నిర్దేశం చేశారు. 

సాగు పరికరాలపై ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సులు 
కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల వల్ల రైతులకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంటాయని, కూలీల కొరత సమస్య తగ్గుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తక్కువ ఖర్చుకే వ్యవసాయ ఉపకరణాలు అందుబాటులో ఉంటాయన్నారు. వ్యవసాయ పరికరాల నిర్వహణ, వినియోగంపై నైపుణ్యాలను పెంపొందించాలని సీఎం సూచించారు. ఇందుకోసం ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యలో ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. దీనివల్ల గ్రామస్ధాయిలో వ్యవసాయ యంత్ర పరికరాల నిర్వహణ, వినియోగంపై నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఏ యంత్ర పరికరం ఎంత అద్దెకు లభ్యమవుతుందనే వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో రైతులతో కూడిన రైతు సలహా మండలి అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో సంబంధిత పరికరాలున్న కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
 
వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు 
రైతులను ఆదుకునేందుకు వరి, పత్తి మినహా మిగతా పంటలను ప్రభుత్వం భారీగా కొనుగోలు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్నడూలేని విధంగా పండ్లు, పొగాకు లాంటి ఉత్పత్తులకూ కనీస గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులకు మేలు చేసే చర్యలను చేపట్టామని, దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ.6,200 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానాన్ని బలోపేతం చేయడం ద్వారా రైతులకు అండగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కనీస గిట్టుబాటు ధరతోపాటు ఆహార రంగంలో పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి తదితర అంశాల్లో ప్రయోజనం చేకూరుతుందని, రైతుల ఉత్పత్తులు ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా నాణ్యమైన పద్ధతుల్లో వినియోగదారులకు చేరతాయని తెలిపారు.  

సెప్టెంబర్‌లో ‘ఆసరా’.. 
పొదుపు సంఘాల మహిళలకు సెప్టెంబర్‌లో ‘ఆసరా’ ఇవ్వబోతున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ఇప్పటికే చేయూత కింద సాయం అందించామన్నారు. ఈ డబ్బులు మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని, కోరుకున్న వారికి ఆవులు, గొర్రెలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.   

340 ఫిష్‌ ల్యాండింగ్‌ల్లో మౌలిక సదుపాయాలు 
ఇప్పటికే ఉన్న 340 ఫిష్‌ ల్యాండింగ్‌ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దీనికోసం దాదాపు రూ.91 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో భారీగా ఏర్పాటు చేస్తున్న ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లపై సీఎం సమీక్షించారు. 8 ఫిషింగ్‌ హార్బర్లలో ఇప్పటికే నాలుగు చోట్ల నిర్మాణ పనులు జరుగుతుండగా మిగతా చోట్ల కూడా త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి, అగ్రికల్చర్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న, ఏపీడీడీసీ డైరెక్టర్‌ డాక్టర్‌ అహ్మద్‌ బాబు, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎఫ్‌.ఎస్‌.శ్రీధర్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈవో ఎల్‌.శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఇవీ సదుపాయాలు..
చేపలు, రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, ఆక్వా హబ్స్‌ నిర్మాణం కోసం రూ.3,997 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఆక్వాలో 10 ప్రాసెసింగ్‌ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, 100 ఆక్వా హబ్స్‌ కలిపి మొత్తం 133 ఏర్పాటు కానున్నాయి. 2022 సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి  ప్రాసెసింగ్‌ యూనిట్ల కార్యకలాపాలను ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు. మంచినీళ్లపేటలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, కొత్తపట్నంలోనూ ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణంతో పాటు మరో 20 ప్రాంతాల్లో ఫ్లోటింగ్‌ జెట్టీల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేలంపాట కోసం హాలు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాం, మరమ్మతులు, అంతర్గత రహదారులు, బయో ఫెన్సింగ్, సెక్యూరిటీ గేట్లు, వీధి లైట్లు, మల్టీపర్పస్‌ యుటిలిటీ ప్లాట్‌ఫాం, పరిశుభ్రంగా ఉంచడానికి మోటార్‌ విత్‌ బూస్టర్‌ పంపు లాంటి మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది. తద్వారా మత్స్యకారులకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.  

మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు(ఎంపీఎప్‌సీ)
డ్రై స్టోరేజీ, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంలు, గోడౌన్లు, హార్టికల్చర్‌ మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, అసేయింగ్‌ ఎక్విప్‌మెంట్లు. మార్కెట్‌ యార్డుల్లో నాడు–నేడు పనులతో పాటు ఈ – మార్కెటింగ్‌ తదితరాల అంచనా ఖర్చు రూ.2,930 కోట్లు.  

రూ.2,134 కోట్లతో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు.. 
ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. నియోజకవర్గాల స్ధాయిలో ఫామ్‌ మెకనైజేషన్‌ (హైటెక్‌ హై వ్యాల్యూ హబ్స్‌) ఏర్పాటవుతాయి. తొలిదశలో 3,250 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు ప్రారంభమైంది. రెండో దశలో సెప్టెంబరు నాటికి మరో 3,250 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటవుతాయి. వీటిలో 500 హార్వెస్టర్లు, 85 హబ్స్‌ ఉంటాయి. 3వ దశలో భాగంగా డిసెంబర్‌ నాటికి 4,250 కమ్యూనిటీ సెంటర్లు, 535 హార్వెస్టర్లు, 85 హబ్స్‌ ఏర్పాటు కానున్నాయి. మొత్తంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, 1,035 కంబైన్డ్‌ హార్వెస్టర్లు, 175హబ్స్‌ ఏర్పాటుకు దాదాపు రూ.2,134కోట్లు ఖర్చు కానుందని అంచనా.  

సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు.. 
రాష్ట్రంలో 33 చోట్ల సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రతి పార్లమెంట్‌  నియోజకవర్గంలో ఒక యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయం. కొన్ని చోట్ల అవసరాన్నిబట్టి ఒకటికి మించి యూనిట్లను నెలకొల్పుతారు. ఇప్పటికే యూనిట్ల ఏర్పాటుకు స్ధలాల గుర్తింపు దాదాపుగా పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 

ఏఎంసీలు – బీఎంసీలు 
జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు ఏర్పాటు. వీటి అంచనా వ్యయం రూ.4,190 కోట్లు. తొలిదశలో 2,769 బీఎంసీలు ఏర్పాటవుతాయి. రెండో దశలో 7,130 ఏర్పాటు కానున్నాయి.  

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లు 
ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో సెకండరీ çఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు. మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్, క్వాలిటీ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, స్కిల్‌ డెవలప్‌మెంట్, ఇంక్యుబేషన్‌ సెంటర్లు, సీడ్‌ కం మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను రైతుభరోసా కేంద్రాల స్ధాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయం. దీనికోసం రూ.2,961 కోట్లు ఖర్చు కానుందని అంచనా. 

ఆవుల ఫార్మ్స్, ఆర్గానిక్‌ డెయిరీలు.. 
పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో దేశీయ ఆవుల ఫార్మ్స్, ఆర్గానిక్‌ డెయిరీల ఏర్పాటుకు నిర్ణయం. ఆర్బీకేల స్థాయిలోనే పశుసంవర్ధక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు. దీనికోసం రూ.22.25 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఆర్బీకేల స్థాయిలో సెప్టెంబరు నుంచి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  

4,277 గోడౌన్ల ఏర్పాటు..  
ఆర్బీకేల పరిధిలో 4,277 గోడౌన్లు ఏర్పాటు కానుండగా తొలిదశలో 1,265 గోదాములు అందుబాటులోకి రానున్నాయి. నాడు –నేడు కింద అభివృద్ధి చేసే 532 గోడౌన్లకు ఈ నెలలోనే టెండర్లు ఖరారు కానున్నాయి.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement