![Govt Exploring New Markets Like Brazil And Argentina For Pulses Import - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/17/pulses01.jpg.webp?itok=ypx5wwIF)
రైతులకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ దేశీయ పప్పుల అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పప్పుల దిగుమతులు 2023-24లో గతంలోకంటే దాదాపు రెండింతలు పెరిగి 3.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల టన్నుల పప్పు దినుసులు ఎగుమతి చేసుకున్నట్లు అంచనా. ఇది అంతకుమందు ఏడాదిలో 24.5 లక్షల టన్నులుగా ఉంది.
దేశీయంగా పప్పు ధరలను నియంత్రణలో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా పప్పు దినుసుల దిగుమతుల కోసం బ్రెజిల్, అర్జెంటీనాలతో ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిసింది. చర్చలు సఫలమైతే బ్రెజిల్ నుంచి మినుములు, అర్జెంటీనా నుంచి కందులను దిగుమతి చేసుకోనుంది. పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఇప్పటికే మొజాంబిక్, టాంజానియా, మయన్మార్‌లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ప్రభుత్వం పసుపు బఠానీల దిగుమతిపై ఈ ఏడాది జూన్ వరకు సుంకాన్ని వసులు చేయకూడదని నిర్ణయించింది. ఇప్పటికే మినుములు, కందుల దిగుమతులకు ఈ నిబంధన వర్తిస్తోంది. మార్చి 31, 2025 వరకు వీటిని సుంకం లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని ప్రభుత్వ తెలిపింది.
ఎన్నికల సమయంలో ఆందోళన
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పప్పుల ధరల ద్రవ్యోల్బణం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే విధంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం మార్చిలో 17 శాతం నమోదైంది. దాంతో గత కొంతకాలంగా పప్పు ధరలు పెరుగుతున్నాయి. వాటిని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 15న పప్పు నిల్వలపై పరిమితులను విధించింది.
ఇదీ చదవండి: ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లు ప్రారంభించిన ప్రముఖ కంపెనీ
ప్రభుత్వం గ్యారెంటీ కొనుగోలు, ఎంఎస్‌పీ వంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ దేశీయంగా గత కొంతకాలంగా ఉత్పత్తి క్షీణిస్తోంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం 2023-24లో పప్పుధాన్యాల ఉత్పత్తి 234 లక్షల టన్నులుగా ఉంది. అంతకుమందు ఏడాది 261 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment