స్వల్పంగా పెరిగిన ధరలు
డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం
* నవంబర్‌లో ఈ రేటు 4.38 శాతం
* ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల కారణం
న్యూఢిల్లీ: రిటైల్ ధరలు 2014 డిసెంబర్‌లో స్వల్పంగా పెరిగాయి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం వృద్ధి రేటు 5 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 డిసెంబర్‌తో పోల్చితే 2014 డిసెంబర్‌లో రిటైల్ ధరలు 5 శాతం పెరిగాయన్నమాట. 2014 నవంబర్‌లో ఈ రేటు 4.38 శాతంగా ఉంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా ఈ ధరల పెరుగుదల శాతాన్ని లెక్కిస్తారు.
డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం పెరగడానికి పళ్లు, కూరగాయలుసహా కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుదలే కారణమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య,పరపతి విధాన సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఈ గణాంకాలు వెలువడ్డాయి. వివిధ విభాగాల్లో ఉత్పత్తుల పెరుగుదల రేట్లు ఇలా...
* ఆహార పానీయాల విభాగం మొత్తంగా చూసుకుంటే, ధరలు రెండు వరుస నెలల్లో 3.5 శాతం నుంచి 5 శాతానికి చేరాయి. విడివిడిగా ఉత్పత్తులను చూస్తే, 2014 నవంబర్‌లో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా (2013 నవంబర్‌తో పోల్చితే) 10.9 శాతం క్షీణించగా, గత డిసెంబర్‌లో మాత్రం 0.58 శాతం పెరిగాయి
* కాగా పట్టణాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.69 శాతం ఉంటే, ఇది డిసెంబర్‌లో 5.32 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతంలో ఈ రేటు 4.09 శాతం నుంచి 4.71 శాతానికి చేరింది.