నిత్యావసరాల ధరల మంట..
♦ జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.77 శాతం
♦ 22 నెలల గరిష్ట స్థాయి
♦ గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ
న్యూఢిల్లీ : రిటైల్ ధరలు సామాన్యునిపై మరింత భారంగా మారాయి. 2015 జూన్‌తో పోల్చితే 2016 జూన్‌లో దేశం మొత్తానికి సంబంధించి వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) సూచీ 5.77 శాతం పెరిగింది. ఇది 22 నెలల గరిష్ట స్థాయి. ఈ ఏడాది మేనెలతో పోల్చితే (5.76 శాతం) ఇది ఒక బేస్ పాయింట్ (100 బేస్ పాయింట్లు ఒక శాతం) అధికం. 2015 జూన్‌లో రేటు 5.40 శాతం. చక్కెర, పప్పు దినుసులు, కూరగాయలుసహా పలు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడం రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతకు కారణం. కాగా జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ (6.2 శాతం) ప్రాంతంలో మరింత తీవ్రంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 5.26 శాతంగా నమోదయ్యింది. ఆగస్టు 9 పరపతి విధానం సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు కోత (బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణ రేటు- ప్రస్తుతం 6.5 శాతం) అంచనాకు తాజా గణాంకాలు విఘాతం కలిగిస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
విభాగాల వారీగా చూస్తే...
⇒ ఆహారం... పానీయాలు: ఇందులో ఒక్క ఆహార విభాగాన్ని చూస్తే... ద్రవ్యోల్బణం మేలో 7.47 శాతం ఉండగా, జూన్‌లో 7.79 శాతానికి ఎగసింది. ఆహారం, పానీయాలు రెండింటినీ కలిపి చూస్తే.. ద్రవ్యోల్బణం రేటు 7.28 శాతంగా ఉంది. భారీగా ధరలు పెరిగిన ఉత్పత్తుల్లో పప్పు దినుసులు (27 శాతం), చక్కెర (17 శాతం), కూరగాయలు (15 శాతం) ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 9 శాతం, గుడ్ల ధరలు 6 శాతం పెరిగాయి.
⇒ పాన్, పొగాకు, ఇతర మత్తు ప్రేరితాల ధరలు ఏడు శాతం ఎగశాయి.
⇒ దుస్తులు, పాదరక్షలు, హౌసింగ్ ధరలు 5 శాతం ఎగశాయి.
⇒ఇంధనం లైట్ విభాగంలో రేటు 3% పెరిగింది.