న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పంజా విసిరింది. ధరల స్పీడ్ జనవవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 6.52 శాతంగా (2022 ఇదే నెలతో పోల్చి ధరల తీరు) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్నదానిప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాలి. అయితే 10 నెలలు ఆపైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్ నెలల్లో కట్టడిలోకి (ఆరు శాతం దిగువకు) వచ్చింది.
ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధానాలకు ముఖ్యంగా రెపోపై నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు), మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది.
ఈ నెల మొదట్లో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం తాజా లెక్కల ప్రకారం ఫడ్ బాస్కెట్ ధర జనవరిలో 5.94 శాతం ఎగసింది. డిసెంబర్‌లో ఈ పెరుగుదల రేటు 4.19 శాతం. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.85 శాతం అయితే, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 6 శాతంగా ఉంది. 2022–23లో రిలైట్ ద్రవ్యోల్బణం సగటును 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్షలో అంచనావేయగా, జనవరి–డిసెంబర్ మధ్య 5.7 శాతంగా ఉంటుందని విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment