జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం 6.01% నుంచి 5.43%కి డౌన్
8.28 శాతం నుంచి 7.31 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
కొన్ని నిత్యావసరాల ధరలు తగ్గిన ప్రభావం
రుతుపవనాల ప్రభావంపై వీడని ఆందోళన
న్యూఢిల్లీ: అటు టోకు ధరలు, ఇటు రిటైల్ ధరల వేగం జూన్‌లో కొంత తగ్గింది. వేర్వేరుగా చూస్తే- టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 6.01% ఉండగా, ఇది జూన్‌లో 5.43 శాతానికి దిగింది. ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 8.28 శాతం నుంచి 7.31%కి దిగింది.
అంటే గత ఏడాది ఇదే నెలలతో (2013 మే, జూన్) పోల్చితే 2014 మే, జూన్ నెలలో ధరలు ఆ రేట్ల (శాతాల) మేరకు పెరిగాయన్నమాట. టోకు ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టంకాగా, రిటైల్ ద్రవ్యోల్బణం 30 నెలల కనిష్టం. కూరగాయలుసహా కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం ధరల స్పీడ్ తగ్గడానికి కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఎల్‌నినో, రుతుపవనాల ప్రభావం ఇంకా ఆందోళన కలిగించే అంశమేనని అంటున్నాయి.
డబ్ల్యూపీఐ తీరు ఇదీ...
టోకు ధరలకు సంబంధించి మొత్తం మూడు విభాగాల్లో ఒకటైన ప్రైమరీ ఆర్టికల్స్ ధరల పెరుగుదల రేటు 6.84 శాతంగా ఉంది. ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 8.14 శాతంగా ఉంది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 3.49 శాతంగా నమోదయ్యింది.
ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 9.04 శాతంగా నమోదయ్యింది.మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం ద్రవ్యోల్బణం రేటు 3.61 శాతంగా ఉంది.
రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా...
ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 7.9 శాతంగా ఉంది. వేర్వేరుగా కొన్ని ముఖ్య ఆహార ఉత్పత్తుల ధరల స్పీడ్ చూస్తే- పప్పు దినుసుల ధరలు 5.17 శాతం , ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం ధరలు 8.27 శాతం, పాలు, పాల ఉత్పత్తుల ధరలు 11.06 శాతం, కూరగాయల ధరలు 8.73 శాతం, పండ్ల ధరలు 20.64%, ఆల్కాహాలేతర పానీ యాల ధరలు 6.31%, ప్రెపేర్డ్ మీల్స్ ధరలు 7.75 శాతం పెరిగాయి. 2013 జూన్‌తో పోల్చిచూస్తే 2014 జూన్‌లో చక్కెర ధరలు పెరగలేదు. స్వల్పంగా 0.27 శాతం (మైనస్) తగ్గాయి.
పారిశ్రామిక వర్గాల హర్షం...
అటు టోకు, ఇటు రిటైల్ ధరల స్పీడ్ మే నెలతో పోల్చితే జూన్ నెలలో తగ్గడం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం చేశాయి. ధరలకు సంబంధించి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశమేనని అసోచామ్ పేర్కొంది. ఏపీఎంసీ చట్టం రద్దు, గిడ్డంగి సదుపాయాల వంటి బ్యాక్-ఎండ్ ఇన్‌ఫ్రా వంటి చర్యల ద్వారా మున్ముందు ధరల పెరుగుదలను అడ్డుకోవాలని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ సూచించారు. మే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, జూన్ ద్రవ్యోల్బణం గణాంకాలు మెరుగుపడ్డం వృద్ధి రికవరీకి సంకేతంగా కనిపిస్తున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
తగ్గిన ధరల సెగ..!
Published Tue, Jul 15 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM
Advertisement
Advertisement