న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 జనవరిలో 2.84 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 జనవరితో పోల్చితే 2018 జనవరిలో టోకు ధరలు 2.84 శాతం పెరిగాయన్నమాట. గడచిన ఆరు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే కూరగాయల ధరలు మాత్రం టోకున సామాన్యునికి భారంగానే ఉన్నాయి. కాగా 2017 డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.58 శాతం అయితే, జనవరిలో ఈ రేటు 4.26 శాతంగా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం...
మూడు ప్రధాన విభాగాలూ వేర్వేరుగా...
♦ ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 2.37 శాతంగా ఉంది. ఇందులో ఫుడ్ ఆర్టికల్స్‌కు సంబంధించి ఈ రేటు 3 శాతంగా ఉంటే, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌లో మాత్రం ధరలు అసలు పెరక్కపోగా –1.23 శాతం తగ్గాయి.
♦ ఫ్యూయెల్ అండ్ పవర్: ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 4.08 శాతంగా ఉంది.
♦ తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం ఉన్న ఈ విభాగంలో రేటు 2.78 శాతంగా ఉంది.
ఉల్లి ధర... కన్నీరు!
డిసెంబర్ 2017లో 4.72 శాతంగా ఉన్న ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు జనవరిలో 3 శాతానికి తగ్గింది. కూరగాయల ధరలు 56.46 శాతం (డిసెంబర్) నుంచి 40.77 శాతానికి తగ్గినా, ఇదీ సామాన్యునికి భారంగానే ఉంటుందన్నది గమనార్హం. ఇక ఉల్లి ధర జనవరిలో ఏకంగా 194 శాతం పెరిగింది.
పప్పు దినుసుల ధరలు 30.43 శాతం తగ్గాయి. గోధుమల ధరలు 6.94 శాతం తగ్గగా, తృణ ధాన్యాల ధరలు 1.98 శాతం తగ్గాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 0.37 శాతం తగ్గితే, పండ్ల ధరలు 8 శాతం పైగా పెరిగాయి. ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వం విడుదల చేసిన జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment