సరఫరాల సమస్యలతో ధరలకు రెక్కలు!
• జూలై టోకు ధరల పెరుగుదల 3.55%
• 23 నెలల గరిష్ట స్థాయి - నిత్యావసరాల ధరల తీవ్రత
• 12 శాతం పైకి... కూరగాయల ధర 28 శాతం రయ్ !
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు జూలైలో భారీగా పెరిగింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చిచూస్తే.. ఈ బాస్కెట్‌లో వస్తువుల మొత్తం ధర 3.55 శాతం ఎగసింది. ఇది 23 నెలల గరిష్ట స్థాయి. అంటే 2014 ఆగస్టు (3.74 శాతం) తరువాత మళ్లీ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. టోకు ధరల సూచీలో ఒక భాగమైన నిత్యావసర ధరలు భారీగా పెరగడం మొత్తం సూచీ పెరుగుదలకు ఒక కారణం. సరఫరాల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. జూన్‌లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ట స్థాయిలో 6.07 శాతంగా నమోదయిన నేపథ్యంలోనే తాజా గణాంకాలు వెలువడ్డాయి. కాగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం జూన్‌లో 1.62 శాతం నమోదవగా, గత ఏడాది జూలైలో అసలు పెరుగుదల లేకపోగా -4% క్షీణతలో ఉంది. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కీలక విభాగాలను పరిశీలిస్తే...
ప్రైమరీ ఆర్టికల్స్: ఆహార, ఆహారేతర వస్తువుల బాస్కెట్ మొత్తంగా ద్రవ్యోల్బణం రేటు 9.38 శాతంగా ఉంది. గత ఏడాది జూలైలో ఈ రేటు -3.98 శాతంగా ఉంది. ఇక ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు -1.2 శాతం క్షీణత నుంచి 12 శాతానికి పెరిగింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్ రేటు -1 శాతం నుంచి 9.5 శాతానికి చేరింది.
ఇంధనం, విద్యుత్: -12 శాతం క్షీణత -1 శాతం క్షీణతకు చేరింది.
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో రేటు -1.54 శాతం క్షీణత నుంచి 1.82 పైకి మళ్లింది.
కొన్ని నిత్యావసరాలను చూస్తే...
వార్షికంగా టోకున పప్పుల ధరలు 37% పెరిగాయి. బంగాళాదుంపలు ఏకంగా 59% పెరిగాయి. కూరగాయలు 28 శాతం ఎగశాయి. టోకునే ధరల పెరుగుదల ఈ తీరున ఉంటే.. ఇక రిటైల్ స్థాయికి చేరే సరికి ఏ స్థాయిలో పెరుగుదల ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విమర్శ.