తగ్గిన డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం
♦ జూన్‌లో 0.90 శాతానికి డౌన్
♦ ఇది ఎనిమిది నెలల కనిష్టం
న్యూఢిల్లీ: కూరగాయలు సహా ఇతర ఆహారపదార్థాల రేట్ల తగ్గుదలతో జూన్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 0.90 శాతానికి క్షీణించింది. బేస్ ఇయర్‌ను 2011–12కి మార్చిన తర్వాత నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇది 8 నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2016 నవంబర్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 1.82 శాతంగా నమోదైంది.
ఇది ఈ ఏడాది మే లో 2.17 శాతంగాను, గతేడాది జూన్‌లో మైనస్ 0.09 శాతంగానూ నమోదైంది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రికార్డు కనిష్ట స్థాయి 1.54 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గుదలతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతోంది.
ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం ..
♦ ఆహారపదార్థాల ధరలు వార్షిక ప్రాతిపదికన 3.47 శాతం క్షీణించాయి. కూరగాయల ధరల ద్రవ్యోల్బ ణం మైనస్ 21.16 శాతంగా నమోదైంది.
♦ బంగాళదుంప రేట్లు గణనీయంగా 47.32 శాతం మేర క్షీణించాయి. పప్పు ధాన్యాల ధరలు తర్వాత స్థాయిలో 25.47 శాతం మేర క్షీణించాయి. ఇక ఉల్లి రేట్లు 9.47 శాతం తగ్గాయి.
♦ తృణధాన్యాల ధరలు 1.93 శాతం, గుడ్లు.. మాంసం.. చేపలు మొదలైన వాటి రేట్లు 1.92 శాతం మేర పెరిగాయి.