
ధరల ప్రతాపం...
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు అక్టోబర్‌లో భారీగా 7 శాతానికి ఎగసింది. అంటే ఈ సూచీ 2012 అక్టోబర్‌తో పోల్చితే 2013 అక్టోబర్‌లో 7 శాతం పెరిగిందన్నమాట. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. సెప్టెంబర్‌లో ఈ రేటు 6.46 శాతం. ఉల్లిఘాటు, కూరగాయల పోటు టోకు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
నిత్యావసరాల ధరల పెరుగుదల తీరు...
వార్షిక ప్రాతిపదికన టోకున అక్టోబర్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు ఏకంగా 18.19 శాతం పెరిగాయి. ఉల్లి ధరల తీవ్రత కొనసాగుతోంది. ఈ నిత్యావసర ఉత్పత్తి పెరుగుదల రేటు 278 శాతంగా ఉంది. ఇక కూరగాయలను తీసుకుంటే వీటి రేటు ఏకంగా 78.38 శాతం ఎగసింది. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 17.47 శాతం ఎగశాయి. సెప్టెంబర్‌లో ఈ రేటు 13.37 శాతమే. గోధుమల ధరలు 7.88 శాతం ఎగశాయి. సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు 5.9 శాతం.
మరిన్ని అంశాలు
- మొత్తం సూచీలో ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ (వెయిటేజ్ 21 శాతం) విభాగంలో రేటు 14.68 శాతం ఎగసింది.
- ఇక ఆహారేతర ఉత్పత్తుల (4 శాతం వెయిటేజ్) ద్రవ్యోల్బణం రేటు 6.79 శాతంగా నమోదయ్యింది.
- ఇంధనం, విద్యుత్ విభాగం (15% వెయిటేజ్) ద్రవ్యోల్బణం రేటు 10.33%.
- మొత్తం సూచీలో దాదాపు 64 శాతం వెయిటేజ్ వాటా ఉన్న కోర్ గ్రూప్ (తయారీ రంగం) ద్రవ్యోల్బణం 2.5 శాతంగా ఉంది.
ధరల అదుపు అంత ఈజీ కాదు: చిదంబరం
ధరలను అదుపు చేయడం అంతసులభంకాదని ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ పలు చర్యలను తీసుకుంటున్నాయని వివరించారు. తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణం 10%ను మించిపోగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 7%ను తాకిన నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి సరఫరాల పరమైన అడ్డంకులు తొలగిపోవాల్సి ఉందని పారిశ్రామిక ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు...: ద్రవ్యోల్బణం తీవ్రత దృష్ట్యా ఆర్‌బీఐ డిసెంబర్ 18న చేపట్టనున్న పాలసీ సమీక్ష లో వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కీలక కోర్ ద్రవ్యోల్బణం తగిన స్థాయిలోనే ఉన్నప్పటికీ, నిత్యావసర వస్తువుల ధరల తీవ్రత వల్ల గడచిన రెండు పాలసీ సమీక్షల సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రెపో రేటు పెంపునకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.