అన్నీ మంచి శకునాలే..! | US-China trade deal and RBI minutes to guide Dalal Street this week | Sakshi
Sakshi News home page

అన్నీ మంచి శకునాలే..!

Published Mon, Dec 16 2019 3:03 AM | Last Updated on Mon, Dec 16 2019 3:03 AM

US-China trade deal and RBI minutes to guide Dalal Street this week  - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారిన రెండు కీలక అంశాలకు సంబంధించి గతవారంలో ఒకేసారి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా–చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదరడం, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చేందుకు మార్గం సుగమం కావడం వంటి అనుకూల అంశాలతో గత వారాంతాన దేశీ స్టాక్‌ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తుల విషయంలో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది.

వాణిజ్య, ఆర్థిక అంశాల పరంగా మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఈ సానుకూల అంశం నేపథ్యంలో దేశీ మార్కెట్‌ మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. ట్రేడ్‌ డీల్‌ ఒక కొలిక్కి రావడం, బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం వంటి మార్కెట్‌ ప్రభావిత అంశాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ తెలిపారు. నిఫ్టీకి 12,200 – 12,250 స్థాయిలో ప్రధాన నిరోధం ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఇక తాజా పరిణామాలు మార్కెట్‌కు సానుకూలంగా ఉన్నందున ర్యాలీకి ఆస్కారం ఉందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు.

జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ఈవారంలోనే..
పరోక్ష పన్నుల విధానంలో ఆదాయాన్ని పెంచేందుకు ఈవారంలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్‌ సమావేశం కానుంది. బుధవారం జరిగే 38వ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాల నష్టపరిహారం అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మినహాయింపు అంశాలపై సమీక్ష, రేట్లలో మార్పులు ఉండేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. వీటికి ప్రభావితం అయ్యే రంగాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి.

ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి..: ఈ నెల మొదటి వారంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశ మినిట్స్‌ను ఆర్‌బీఐ బుధవారం విడుదల చేయనుంది. ఇక నవంబర్‌ నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సోమవారం వెల్లడికానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement