పల్లె బాట పట్టండి...
♦ ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునివ్వండి
♦ మైక్రోఫైనాన్స్ సంస్థలకు
♦ గవర్నర్ నరసింహన్ సూచన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సూక్ష్మ రుణ (మైక్రోఫైనాన్స్) సంస్థలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునిచ్చేలా కార్యకలాపాలు విస్తరించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వినూత్న ఆవిష్కరణలు చేసే సామర్ధ్యం గల యువతకు కొదవలేదని.. కానీ సరైన ఆర్థిక సహకారం అందక వారి నైపుణ్యాలు మరుగున పడిపోతున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మైక్రోఫైనాన్స్ సంస్థలు అలాంటివారికి తోడ్పాటునివ్వడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సహకారం’ అనే అంశంపై మంగళవార మిక్కడ జరిగిన మైక్రోఫైనాన్స్ సంస్థల జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.
గతంలో మైక్రోఫైనాన్స్ సంస్థలు వడ్డీ వ్యాపారుల ధోరణిలో వ్యవహరించడం వల్లే వాటిని నియంత్రించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్డినెన్స్ తేవాల్సి వచ్చిందని నరసింహన్ చెప్పారు. ఆ తర్వాత సూక్ష్మ రుణాల రంగంలో క్రమ శిక్షణ, స్వీయ నియంత్రణ వచ్చాయన్నారు. ఒకవేళ మళ్లీ పాత ధోరణులకు మళ్లితే గతంలోలాగా కఠిన చర్యలు ఎదురవక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం సాంకేతిక పురోగతి, ప్రభుత్వ మద్దతు, మొబైల్ బ్యాంకింగ్ వంటి అంశాల ఊతంతో పురోగమిస్తున్న మైక్రోఫైనాన్స్ రంగం అన్ని వర్గాలను చేరువయ్యేలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
84 శాతం ఎగిసిన సూక్ష్మ రుణాలు ..
రుణ పరిమితులను పెంచడం తదితర ఇటీవలి పరిణామాల నేపథ్యంలో సూక్ష్మ రుణాలు 2014-15తో పోలిస్తే 2015-16లో ఏకంగా 84 శాతం ఎగిసి రూ. 53,000 కోట్ల పైగా చేరాయని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోడియా తెలిపారు. చిన్న సంస్థల రుణ అవసరాలకు తోడ్పాటునిచ్చేందుకు ఆగస్టులో పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ వెల్లడించారు. ఈ సదస్సులో అసోచామ్, కన్సల్టెన్సీ సంస్థ ఈఅండ్‌వై రూపొందించిన నాలెడ్జ్ రిపోర్ట్‌ను విడుదల చేశారు.