న్యూఢిల్లీ: మైక్రోఫైనాన్స్ కంపెనీ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్(ఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసిక ఫలితాలను ఆలస్యంగా విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో లాభాలను కోల్పోయి నష్టాలలోకి ప్రవేశించింది. వెరసి రూ. 58 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) క్యూ2లో దాదాపు రూ. 67 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ కంపెనీ రూ. 54 కోట్ల నికర లాభం సాధించింది.
అయితే క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 354 కోట్ల నుంచి రూ. 396 కోట్లకు పుంజుకుంది. క్యూ1లో అందుకున్న రూ. 435 కోట్లతో పోలిస్తే ఆదాయం క్షీణించింది. అప్పటి ఎండీ, వ్యవస్థాపకురాలి రాజీనామాతో యాజమాన్యంలో చేపట్టిన మార్పుల కారణంగా క్యూ2 ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ 2021 నవంబర్ 12నే వెల్లడించింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా కంపెనీ ఎండీ, వ్యవస్థాపకురాలు పద్మజ గంగిరెడ్డి 2021 నవంబర్ 2న రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో కంపెనీ వెనువెంటనే మేనేజ్‌మెంట్ కమిటీని పునర్వ్యవస్థీకరించింది.
ఫలితాల విడుదల నేపథ్యంలో స్పందన స్ఫూర్తి షేరు బీఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 415 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment