సిరిసిల్ల, న్యూస్‌లైన్ : ఎలాంటి ష్యూరిటీలు లేకుండా బ్యాంకుల కంటే సులభంగా రుణాలివ్వడంతోపాటు వారంవారం కిస్తీలు చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తామంటూ మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు మహిళలను ఆకర్షించినట్లు సమాచారం.
మరోవైపు రుణం పొందేందుకు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా ఇళ్ల వద్దకు ఇచ్చి అడిగినంత డబ్బు ఇస్తామనడంతో పలువురు మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. సిరిసిల్లలో 2008 వరకు పలు మైక్రోఫైనాన్స్ సంస్థలు వడ్డీ వ్యాపారం సాగించాయి. మహిళా సంఘాలకు రూ.కోట్లలో రుణాలిచ్చి అప్పుల ఊబిలోకి నెట్టివేశాయి. అప్పులు చెల్లించేక, వేధింపుల భరించలేక పలువురు బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
దీంతో అప్పటి వైఎస్సార్ సర్కారు మైక్రోఫైనాన్స్ రుణాలపై మారటోరియం విధించింది. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు ద్వారా స్వశక్తి సంఘాలకు పావలావడ్డీ రుణాలందించి అప్పుల ఊబి నుంచి గట్టెక్కించింది. ఇటీవల బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకపోవడంతో మహిళలు ఆర్థిక అవసరాల కోసం మళ్లీ మైక్రోఫైనాన్స్‌ల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా సిరిసిల్లలో తిరిగి రంగప్రవేశం చేసేందుకు పలు సంస్థలు ఉబలాటపడుతున్నాయి. ఒక్కసారి మైక్రో ఉచ్చులో చిక్కుకుంటే పీకల్లోతు అప్పుల్లో మునిగిపోవడం ఖాయం. ఇదే జరిగితే మళ్లీ నేతన్న కుటుంబాలు ఆర్థికంగా ‘చితికి’పోయే ప్రమాదముందని గత అనుభవాలు హెచ్చరిస్తున్నాయి.
ఐదేళ్ల కిందట..
2008లో సిరిసిల్లలో వరుస ఆత్మహత్యలకు మైక్రోఫైనాన్స్ వేధింపులే కారణమని అధికారులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేల్లో తేల్చారు. సిరిసిల్లలో స్వయంకృషి, షేర్‌ముల్లా, స్పందన, కృషిబేసిక్స్ వంటి మైక్రోఫైనాన్స్‌లు వేల మందికి రూ.కోట్లలో రుణాలిచ్చాయి. పదిమంది సభ్యులు గల మహిళా గ్రూపులకు ఒక్కొక్కరికి రూ.పదివేల చొప్పున రూ.లక్ష వరకు అప్పులిచ్చాయి. రుణాల వసూళ్లలోనూ అంతే కఠినంగా వ్యవహరించాయి. వారం వారం వాయిదాలు చెల్లించకుంటే సంఘ సభ్యులపై ఒత్తిళ్లు తెచ్చి బాధితుల ఇళ్ల ముందు ధర్నాలు చేయించి వారి పరువు మర్యాదలను రోడ్డుకీడ్చాయి. ఇలాంటి ఒత్తిళ్లతో మానసికవేదనకు గురై సిరిసిల్లలో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వరుస ఆత్మహత్యల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రుణాల వసూళ్లపై 2008లో మారటోరియం విధించారు. మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలందించారు. ఒక్కో మహిళకు రూ.50 వేలకు తగ్గకుండా 1400 సంఘాల్లోని 15వేల మంది మహిళలకు రూ.70 కోట్లను ఏకకాలంలో 2009 జనవరి 1న హైదరాబాద్‌లో అందించారు. దీంతో మైక్రోఫైనాన్స్‌ల ఆగడాలు ఆగిపోయాయి.
ఆదర్శ సిరిసిల్లకు అందని వడ్డీమాఫీ
రుణాలు తిరిగి చెల్లించడంతో సిరిసిల్ల మహిళా సంఘాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ వారికి వడ్డీమాఫీ మాత్రం మంజూరు కావడం లేదు. గతంలో పావలావడ్డీ మంజూరు కాగా, జీరో వడ్డీ అమలుకు సర్కారు బడ్జెట్ విడుదల చేయడం లేదు. సిరిసిల్లలో 1636 సంఘాలు ఉండగా, ఇందులో 20,926 మంది సభ్యులున్నారు. వీరికి రూ.105.43 కోట్లు రుణాలివ్వగా, జీరోవడ్డీగా రూ.7 కోట్లు ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. జీరో వడ్డీ రాకపోవడంతో మహిళా సంఘాల నిర్వహణ భారంగా మారింది. అప్పులు తీసుకున్న మహిళలు వడ్డీతో సహా చెల్లిస్తుండగా, సంఘాల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. బ్యాంకు రుణం అన్న పేరేగాని వడ్డీ రాయితీ లేక నెలనెలా వాయిదాలు చెల్లించలేకపోతున్నామని పలువురు మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం జీరో వడ్డీ అమలు చేసి తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే మహిళా సంఘాలకు భరోసా ఇచ్చినట్లవుతుంది.
మహిళా బ్యాంకు జాడేదీ?
సిరిసిల్లలో స్వశక్తి సంఘాలకు ప్రత్యేకంగా మహిళా బ్యాంకును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన బుట్టదాఖలవుతోంది. ఇప్పటికే స్త్రీనిధి పరస్పర సహకార బ్యాంకు ద్వారా రూ.3.33 కోట్లు సిరిసిల్లకు మంజూరు కాగా, ఆ డబ్బును ఎప్పట్లాగే స్లమ్ సమాఖ్యలకు పంపిణీ చేశారు. మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తే రుణాల మంజూరు, రికవరీ సులభవుతుందని ప్రతిపాదనలు పంపగా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. బ్యాంకు రుణాల మంజూరులో జాప్యం కారణంగానే మైక్రోఫైనాన్స్‌లకు మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుందని కొందరు మహిళలు పేర్కొంటున్నారు. పట్టణంలో మళ్లీ మైక్రో భూతం చొరబడకుండా చూడాల్సిన బాధ్యత పట్టణ పేదరిక నిర్మూలన సంస్థపై ఉంది.
రుణాల్లో జాప్యం లేదు
- ఎం.రాజేశం, మెప్మా పీఆర్పీ
సిరిసిల్లలో రుణాల మంజూరులో ఎలాంటి జాప్యం లేదు. ఇటీవలే స్త్రీనిధి మంజూరైంది. 335 సంఘాలకు రూ.3.33 కోట్లు వచ్చాయి. కమ్యూనిటీ ఫండ్‌గా రూ.9 లక్షలు వచ్చాయి. ఎప్పటికప్పుడు మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. మైక్రోఫైనాన్స్ మాయలో పడొద్దు. రుణాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి.
మళ్లీ ‘మైక్రో’భూతం
Published Sat, Sep 14 2013 2:55 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement